
జమైకా: టీమిండియా- వెస్టిండీస్ జట్ల మధ్య శుక్రవారం ప్రారంభమైన కింగ్‌స్టన్ టెస్టు ఒక అరుదైన రికార్డుకు వేదికైంది. ఈ టెస్టులో విండీస్ భారీ కాయుడు రకీమ్ కార్న్‌వాల్ అరంగేట్రం చేశాడు. ఆరడుగుల ఐదు అంగుళాలు ఎత్తు కల్గిన కార్న్‌వాల్.. 140 కిలోలపైగా ఉన్నాడు. దాంతో క్రికెట్ చరిత్రలో భారీ కాయుడిగా రికార్డు నెలకొల్పాడు. ఇప్పటివరకూ ఆసీస్ మాజీ క్రికెటర్ వార్విక్ ఆర్మ్‌స్ట్రాంగ్ పేరిట(133 కేజీల నుంచి-139 కేజీల వరకూ) ఉండగా, దాన్ని తాజాగా కార్న్‌వాల్ బ్రేక్ చేశాడు. భారత్‌తో రెండు టెస్టుల సిరీస్‌కు ఎంపికైన 26 ఏళ్ల కార్న్‌వాల్.. రెండో టెస్టులో బరిలోకి దిగాడు. కమిన్స్ స్థానంలో చోటు దక్కించుకున్న రకీమ్ కార్న్‌వాల్ తన తొలి టెస్టులోనే అద్భుత ప్రదర్శన చేశాడు.(ఇక్కడ చదవండి: భారత్ 264/5)
ఈ మ్యాచ్‌లో మంచి బౌన్స్ రాబట్టిన కార్న్‌వాల్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. తన తొలి అంతర్జాతీయ వికెట్‌ను సాధించాడు. అది కూడా టెస్టు స్పెషలిస్టు చతేశ్వర పుజారాది కావడం విశేషం. కార్న్‌వాల్ వేసిన బంతిని అంచనా వేయడంలో తడబడిన పుజారా వికెట్‌ను సమర్పించుకున్నాడు. మరొకవైపు కేఎల్ రాహుల్, మయాంక్ అగర్వాల్ ఇచ్చిన క్యాచ్‌లను కూడా అతడే అందుకున్నాడు. భారీ సిక్స్‌లు కొట్టగల కార్న్‌వాల్.. ఇటీవలి కాలంలో విండీస్ దేశవాళీ క్రికెట్లో చాలా నిలకడగా రాణించాడు. 2018-19 వెస్టిండీస్ చాంపియన్‌షిప్స్‌లో 17.68 సగటుతో 54 వికెట్లు పడగొట్టాడు. మొత్తంగా 55 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌ల్లో 260 పడగొట్టిన కార్న్‌వాల్.. 2224 పరుగులు సాధించాడు.
Comments
Please login to add a commentAdd a comment