
ముంబై: వచ్చే ఏడాది జరుగనున్న వరల్డ్‌టీ20లో టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనిని ఆడించాలనుకుంటే ఇప్పుట్నుంచే అతన్ని రెగ్యులర్‌గా జట్టుతో పాటే ఉంచాలని దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే అభిప్రాయపడ్డాడు. ధోనిని గౌరవంగానే జట్టు నుంచి సాగనంపితే బాగుంటుందని టీమిండియా మేనేజ్‌మెంట్‌కు సూచించాడు.‘ధోని రిటైర్మెంట్ అంశానికి సంబంధించి ఎవ్వరికీ క్లారిటీ లేదు. అతను ఎప్పుడు అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు చెబుతాడో తెలియదు. కాబట్టి.. ధోని భవితవ్యంపై సెలక్టర్లు ఒకసారి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. టీ20 ప్రపంచకప్‌లో ధోనిని ఆడించాలని వారు భావిస్తే..? రెగ్యులర్‌గా అతనికి జట్టులో చోటు కల్పించాలి.
అలాకాకుండా.. యువ క్రికెటర్లతో ముందుకు వెళ్లాలని భావిస్తే మాత్రం.. ధోనికి గౌరవంగా వీడ్కోలు చెప్పాలి. భారత జట్టుకి అనితర విజయాల్ని అందించిన ధోని గౌరవమైన వీడ్కోలుకి అర్హుడు’ అని కుంబ్లే పేర్కొన్నాడు. దక్షిణాఫ్రికాతో ఆరంభం కానున్న ద్వైపాక్షిక సిరీస్‌లో భాగంగా మూడు టీ20ల సిరీస్‌కు ధోనిని ఎంపిక చేయలేదు. తాను దూరంగా ఉండదల్చుకున్నానని ధోని చెప్పడంతోనే అతనికి విశ్రాంతి ఇచ్చామని చీఫ్ సెలక్టర్ ఎంఎస్‌కే ప్రసాద్ వివరణ కూడా ఇచ్చాడు. యువ క్రికెటర్లను పరీక్షించే క్రమంలోనే ధోని జట్టుకు దూరంగా ఉండటానికి నిర్ణయించుకున్నాడని ఎంఎస్‌కే పేర్కొన్నాడు. కాగా, ధోని తప్పించాలనే నిర్ణయం సెలక్టర్లదేనని, దాంతో కాదనలేక ధోని దూరంగా ఉన్నాడనే విమర్శలు వచ్చాయి. ఈ తరుణంలో అనిల్ కుంబ్లే స్పందించడం ఆ విమర్శలకు మరింత బలాన్ని చేకూరుస్తుంది.