
న్యూఢిల్లీ : మహేంద్రసింగ్ ధోని జాతీయ జట్టుతో కొనసాగుతాడా లేదా అనేది 2020లో జరిగే ఐపీఎల్‌తో తేలనుందని టీమిండియా మాజీ కెప్టెన్, లెగ్ స్పిన్నర్ అనిల్ కుంబ్లే పేర్కొన్నాడు. దీంతో పాటు వచ్చే ఏడాది జరగనున్న టీ20 ప్రపంచకప్‌లో ధోని సేవలు అవసరం అనిపిస్తే టీమిండియా జట్టులో తప్పక ఉంటాడని, అయితే ముందు జరగనున్న ఐపీఎల్‌లో అతని ప్రదర్శన ఎలా ఉంటుదనే దానిపైనే ఆధారపడి ఉంటుందని కుంబ్లే అభిప్రాయపడ్డాడు.అయితే దీనికి కొంత సమయం ఉండడంతో అంతవరకు మనం వేచి చూడాల్సిందేనని తెలిపాడు.
కాగా వచ్చే ఏడాది జరగనున్న టీ20 ప్రపంచకప్‌లో ఆల్‌రౌండర్ల కంటే వికెట్లు తీయగలిగే బౌలర్లపైనే దృష్టి పెట్టాలని దిగ్గజ బౌలర్ సలహా ఇచ్చాడు. ' వచ్చే టీ20 ప్రపంచకప్ ఆస్ట్రేలియాలో జరగనుంది. నా దృష్టిలో కుల్‌దీప్ యాదవ్, యజువేంద్ర చాహల్ జట్టులో ఉండాలని కోరుకుంటున్నా. ఎందుకంటే అప్పటికి ఆప్ట్రేలియాలో ఉండే మంచు ప్రభావ పరిస్థితుల వల్ల ఈ మణికట్టు బౌలర్లు వికెట్లతో అదరగొడతారని ఆశిస్తున్నా. దీంతో పాటు ఆల్‌రౌండర్ల కంటే వికెట్లను ఎక్కువగా తీసే ఫాస్ట్ బౌలర్లను జట్టులోకి తీసుకుంటే బాగుంటుంది. ఆస్ట్రేలియాలోని పిచ్ పరిస్థితిని బట్టి జట్టును ఎంపిక చేసుకోవాలని' కుంబ్లే తెలిపాడు. కాగా వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్ అక్టోబర్ 18 నుంచి నవంబర్ 15 వరకు ఆస్ట్రేలియాలో జరగనుంది. (చదవండి : ధోనిని కాదని.. రోహిత్‌కే ఓటు)