ధోనీపై వేటు వేయడం ఆశ్చర్యకరం
మెల్‌బోర్న్: ఐపీఎల్ ఫ్రాంచైజీ రైజింగ్ పుణె సూపర్‌జెయింట్స్ కెప్టెన్ పదవి నుంచి మహేంద్ర సింగ్ ధోనీని తొలగించినపుడు తనకు ఆశ్చర్యం కలిగిందని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ అన్నాడు. ధోనీ సమర్థవంతమైన కెప్టెన్ అని పాంటింగ్ ప్రశంసించాడు.
ఐపీఎల్-2017 సీజన్ ఆరంభంలో పుణె యాజమాన్యం తమ జట్టు కెప్టెన్ ధోనీని తొలగించి అతని స్థానంలో స్టీవెన్ స్మిత్‌కు బాధ్యతలు అప్పగించిన సంగతి తెలిసిందే. పుణె జట్టులో ధోనీ ఆటగాడిగా కొనసాగుతున్నాడు. ధోనీలో ఇంకా సామర్థ్యముందని, అకస్మాత్తుగా కెప్టెన్సీ నుంచి తొలగించడం ఆశ్చర్యకరమని రికీ అన్నాడు. ఆటగాడిగా ధోనీ సామర్థ్యంపై సందేహాలు వ్యక్తం చేస్తున్నవారిని విమర్శిస్తూ, చాంపియన్ ఆటగాడి గురించి ఎప్పుడూ తప్పుగా మాట్లాడవద్దని హెచ్చరించాడు. కాగా ధోనీ వయసు రీత్యా ఐపీఎల్-2017 అతనికి ఆఖరి సీజన్ కావచ్చని, వచ్చే ఏడాది ఈ టోర్నీలో ఆడకపోవచ్చని అభిప్రాయపడ్డాడు.