ఆసీస్ మాజీ సారధి రికీ పాంటింగ్.. ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్‌ను టీమిండియా విజయవంతమైన నాయకుడు మహేంద్ర సింగ్ ధోనితో పోల్చాడు. బెన్ స్టోక్స్ యొక్క మ్యాచ్ విన్నింగ్ సామర్థ్యం మిస్టర్ కూల్ కెప్టెన్ సామర్థ్యంతో సరిసమానంగా ఉంటుందని అన్నాడు. ప్రసుత్త కెప్టెన్లతో పోలిస్తే స్టోక్స్ ఒత్తిడిని మెరుగ్గా హ్యాండిల్ చేయగలడని కితాబునిచ్చాడు.
స్టోక్స్ చాలాకాలంగా ఫార్మాట్లకతీతంగా బ్యాట్‌తో పాటు బంతితోనూ సత్తా చాటుతూ మ్యాచ్ విన్నర్‌గా మారాడని అన్నాడు. ఒత్తిడి సమయాల్లో స్టోక్స్ తనలోని అత్యుత్తమ ప్రతిభను బయటపెట్టి జట్టు విజయాల్లో ప్రధానపాత్ర పోషించాడని పేర్కొన్నాడు. తాజాగా లార్డ్స్‌లో జరిగిన యాషెస్ సిరీస్ రెండో టెస్ట్‌లోనూ స్టోక్స్ ఇదే తరహా ప్రదర్శనను కనబర్చి, తన జట్టును ఒంటిచేత్తో గెలిపించినంత పని చేశాడని తెలిపాడు. 2019 లీడ్స్ టెస్ట్‌లోనూ స్టోక్స్ ఇలాగే ఒంటిపోరాటం చేసి ఇంగ్లండ్‌కు చిరస్మరణీయ విజయాన్ని అందించాడని గుర్తు చేశాడు.
టెస్ట్‌ల్లో స్టోక్స్ బ్యాట్‌తో 36, బంతితో 32 కంటే ఎక్కువ సగటు కలిగి ఉన్నాడని తక్కువ అంచనా వేయరాదని, ఈ సంఖ్యలకు మించి ఆటను ప్రభావితం చేయగల సామర్థ్యం అతనికి ఉందని కొనియాడాడు. టెస్ట్‌ల్లోనే కాక పరిమిత ఓవర్ల ఫార్మాట్లలోనూ స్టోక్స్ అత్యుత్తమ ఆటగాడని, ఇందుకు 2022 టీ20 వరల్డ్‌కప్ ఫైనల్ మ్యాచే నిదర్శనమని అన్నాడు. ఐసీసీ రివ్యూలో పాంటింగ్ స్టోక్స్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. కాగా, ఇటీవల ముగిసిన యాషెస్ రెండో టెస్ట్‌లో ఆసీస్ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ విజయంతో ఆసీస్ 5 మ్యాచ్‌ల సిరీస్‌లో 2-0 ఆధిక్యంలోకి వెళ్లింది.
Comments
Please login to add a commentAdd a comment