IPL-2017
-
తొలి బంతినే సిక్సర్ బాదేస్తా
న్యూఢిల్లీ: తానాడే తొలిబంతిని సిక్సర్ కొట్టవచ్చని భావిస్తే, అదే పని చేస్తానని బ్యాటింగ్ సంచలనం రిషబ్ పంత్ అన్నాడు. తొలిబంతి అయినా చెత్తగా వేస్తే దాన్ని వదలిపెట్టరాదని, షాట్ కొట్టాల్సిందేనని చెప్పాడు. గుజరాత్ లయన్స్‌తో మ్యాచ్‌లో పంత్ (43 బంతుల్లో 6 ఫోర్లు, 9 సిక్సర్లతో 97) మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో ఢిల్లీ డేర్‌డెవిల్స్ విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో పంత్ ఆడిన రెండో బంతినే సిక్సర్ బాదాడు. ఈ విషయం గురించి ఆతను మాట్లాడుతూ.. 'షాట్ కొట్టాల్సిన బాల్ అయితే వదిలిపెట్టను. చెత్తబంతి వేస్తే దాన్ని బాదాల్సిందే. ఎక్కువగా ఆలోచించకుండా సహజశైలిలో ఆడాల్సిందిగా రాహుల్ ద్రావిడ్ చెప్పాడు' అని అన్నాడు. కాగా మూడు పరుగుల తేడాతో సెంచరీ మిస్సవడంపై పంత్ మాట్లాడుతూ.. తాను విషయం గురించి ఆలోచించలేదని, వీలైనంత త్వరగా లక్ష్యాన్ని ఛేదించి జట్టును గెలిపించడం గురించే ఆలోచించానని చెప్పాడు. -
ధోనీ సింప్లిసిటీ చూసి అవాక్కయ్యారు.
-
ధోనీ సింప్లిసిటీ చూసి అవాక్కయ్యారు
ఐపీఎల్-2017 సీజన్లో మహేంద్ర సింగ్ ధోనీ ప్రమేయం లేకుండానే అతన్ని వివాదాలు చుట్టుముట్టాయి. రైజింగ్ పుణె సూపర్‌జెయింట్ కెప్టెన్సీ నుంచి ధోనీని జట్టు యాజమాన్యం తొలగించడంపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేగాక ధోనీని కించపరిచేలా పుణె టీమ్ యజమాని సోదరుడు ట్వీట్ చేయడం మరింత వివాదం రాజేసింది. ఈ సీజన్లో బ్యాట్స్‌మన్‌గా ధోనీ ఆటతీరుపైనా విమర్శలు వచ్చాయి. అయితే ధోనీ ఎక్కడా వీటిపై పెదవి విప్పలేదు. అభిమానులు, మాజీలు అతనికి అండగా నిలిచారు. ఈ వివాదాలను పక్కనబెడితే మైదానంలో ఎలాంటి పరిస్థితుల్లోనైనా మిస్టర్ కూల్‌గా ఉండే ధోనీ.. నిజజీవితంలోనూ సింపుల్‌గా ఉంటాడు. తాజాగా సోషల్ మీడియాలో్ వైరల్ అవుతున్న ఓ వీడియోను ఇందుకు నిదర్శనం. ధోనీ ఎయిర్‌పోర్ట్‌లో పుణె టీమ్మేట్ ఇమ్రాన్ తాహిర్ కొడుకు గిబ్రాన్‌తో కలసి ఫ్లోర్‌పై కూర్చున్నాడు. ఓ బొమ్మ కారుతో చిన్నారి గిబ్రాన్‌తో ఆడుకుంటూ ఈ వీడియోలో మహీ కనిపిస్తాడు. కాగా ఈ సన్నివేశం ఎక్కడ జరిగిందన్న విషయం తెలియరాలేదు. ఐపీఎల్లో పుణె తర్వాతి మ్యాచ్ హైదరాబాద్‌తో ఆడాల్సివుంది. పుణె జట్టు హైదరాబాద్‌కు వెళ్తుండగా ఈ సంఘటన జరిగి ఉంటుందని భావిస్తున్నారు. ధోనీ సింప్లిసిటీని చూసి అభిమానులు ప్రశంసిస్తున్నారు. ధోనీ గతంలో కూడా పలుమార్లు ఓ సామాన్యుడిలా ప్రవర్తించిన సంఘటనలున్నాయి. -
ధోనీపై వేటు వేయడం ఆశ్చర్యకరం
మెల్బోర్న్: ఐపీఎల్ ఫ్రాంచైజీ రైజింగ్ పుణె సూపర్‌జెయింట్స్ కెప్టెన్ పదవి నుంచి మహేంద్ర సింగ్ ధోనీని తొలగించినపుడు తనకు ఆశ్చర్యం కలిగిందని ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ అన్నాడు. ధోనీ సమర్థవంతమైన కెప్టెన్ అని పాంటింగ్ ప్రశంసించాడు. ఐపీఎల్-2017 సీజన్ ఆరంభంలో పుణె యాజమాన్యం తమ జట్టు కెప్టెన్ ధోనీని తొలగించి అతని స్థానంలో స్టీవెన్ స్మిత్‌కు బాధ్యతలు అప్పగించిన సంగతి తెలిసిందే. పుణె జట్టులో ధోనీ ఆటగాడిగా కొనసాగుతున్నాడు. ధోనీలో ఇంకా సామర్థ్యముందని, అకస్మాత్తుగా కెప్టెన్సీ నుంచి తొలగించడం ఆశ్చర్యకరమని రికీ అన్నాడు. ఆటగాడిగా ధోనీ సామర్థ్యంపై సందేహాలు వ్యక్తం చేస్తున్నవారిని విమర్శిస్తూ, చాంపియన్ ఆటగాడి గురించి ఎప్పుడూ తప్పుగా మాట్లాడవద్దని హెచ్చరించాడు. కాగా ధోనీ వయసు రీత్యా ఐపీఎల్-2017 అతనికి ఆఖరి సీజన్ కావచ్చని, వచ్చే ఏడాది ఈ టోర్నీలో ఆడకపోవచ్చని అభిప్రాయపడ్డాడు. -
ధోనీకిదే ఆఖరి సీజన్ కావచ్చు
న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీపై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆటగాడిగా ధోనీ సామర్థ్యంపై సందేహాలు వ్యక్తం చేస్తున్నవారిని విమర్శిస్తూ, చాంపియన్ ఆటగాడి గురించి ఎప్పుడూ తప్పుగా మాట్లాడవద్దని హెచ్చరించాడు. కాగా ధోనీ వయసు రీత్యా ఐపీఎల్-2017 అతనికి ఆఖరి సీజన్ కావచ్చని, వచ్చే ఏడాది ఈ టోర్నీలో ఆడకపోవచ్చని అభిప్రాయపడ్డాడు. తాజా ఐపీఎల్ సీజన్లో రైజింగ్ పుణె సూపర్‌జెయింట్ కెప్టెన్‌గా ధోనీని తప్పించారు. ఇక బ్యాట్స్‌మన్‌గా ధోనీ నిలకడగా రాణించలేకపోతున్నాడు. దీంతో ధోనీ బ్యాటింగ్ సామర్థ్యంపై కొందరు సందేహాలు వ్యక్తం చేస్తూ విమర్శించారు. ఈ నేపథ్యంలో పాంటింగ్ స్పందిస్తూ.. 'ధోనీ సుదీర్ఘకాలం గొప్ప విజయాలు అందించాడు. ఎన్ని విజయాలు సాధించినా కెరీర్లో క్షీణదశ ఉంటుంది. నా కెరీర్లోనూ ఇలాంటి అనుభవం ఎదురైంది. నాపైనా విమర్శలు వచ్చాయి. అయితే చాంపియన్ ఆటగాళ్లను ఎప్పుడూ తక్కువ చేసి మాట్లాడవద్దు' అని అన్నాడు. -
పఠాన్ వస్తున్నాడు
రాజ్‌కోట్: టీమిండియా ఆల్ రౌండర్, బరోడా పేసర్ ఇర్ఫాన్ పఠాన్ కు అనూహ్యంగా ఐపీఎల్-10లో ఆడే అవకాశం దక్కింది. గుజరాత్ లయన్స్ తరపు అతడు బరిలోకి దిగనున్నాడు. వెస్టిండీస్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో స్థానంలో ఇర్ఫాన్ ను తీసుకోవాలని గుజరాత్ ఫ్రాంచైజీ నిర్ణయించింది. గాయం కారణంగా బ్రావో.. ఐపీఎల్‌కు దూరమయ్యాడు. ఫిబ్రవరిలో నిర్వహించిన 2017 సీజన్ వేలంలో ఇర్ఫాన్ పఠాన్‌ను కొనుగోలు చేసేందుకు ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపలేదు. వేలంలో అతడి కనీస ధర రూ. 50 లక్షలుగా నిర్ణయించారు. పేసర్ ఇషాంత్ శర్మ కూడా వేలంలో అమ్ముడు పోలేదు. టోర్నమెంట్ మొదలైన తర్వాత అతడిని కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తీసుకుంది. తొమ్మిదేళ్ల పాటు ఐపీఎల్ ఆడిన ఇర్ఫాన్ పఠాన్ పలు జట్లకు ప్రాతినిథ్యం వహించాడు. కింగ్స్ ఎలెవన్ పంజాబ్, ఢిల్లీ డేర్ డెవిల్స్, చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్ తరపున ఆడాడు. 1137 పరుగులు చేసి, 80 వికెట్లు పడగొట్టాడు. -
ఐపీఎల్లో వారిద్దరూ స్పెషల్
న్యూఢిల్లీ: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు స్టార్ ఆటగాళ్లు విరాట్ కోహ్లీ, క్రిస్ గేల్‌పై సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాడు కేన్ విలియమ్సన్ ప్రశంసలు కురిపించాడు. ఐపీఎల్-2017 సీజన్లో కోహ్లీ, గేల్ బ్యాటింగ్‌ను ఆస్వాదిస్తున్నానని చెప్పాడు. వీరిద్దరూ అద్భుతమైన ఆటగాళ్లని, వీరి ఆటతీరు భిన్నంగా ఉంటుందని కేన్ అన్నాడు. కోహ్లీ క్లాస్ ఆటగాడైతే, క్రిస్ టి-20 మాస్టర్ అంటూ కితాబిచ్చాడు. బెంగళూరు జట్టును ఓడించడం చాలా కష్టమని అన్నాడు. గేల్‌ను అవుట్ చేస్తే, కోహ్లీ రూపంలో మరో ప్రమాదం ఎదురవుతుందని, వీరిద్దరూ డామినేట్ చేయగల ఆటగాళ్లని చెప్పాడు. ఇటీవల ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ విజయంలో విలియమ్సన్ కీలక పాత్ర పోషించాడు. అతను 51 బంతుల్లో 89 పరుగులు చేసి జట్టు విజయానికి కృషి చేశాడు. -
హోటల్లో విలియమ్సన్‌ను ఆడుకున్నారు
న్యూఢిల్లీ: ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో బుధవారం జరిగిన ఐపీఎల్ మ్యాచ్‌లో ఉత్కంఠ విజయం సాధించాక సన్ రైజర్స్ హైదరాబాద్ ఆటగాళ్లు సంబరాలు చేసుకున్నారు. సన్ రైజర్స్ టీమ్ మేనేజ్మెంట్ ఈ వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేసింది. ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ మైదానంలో అయినా, బయట అయినా సరదాగా ఉంటాడు. ఇక ఏదైనా ఫంక్షన్ అయితే డ్యాన్స్ చేసి అదరగొడతాడు. తాజాగా ఢిల్లీతో ఐపీఎల్ మ్యాచ్‌లో గెలిచిన తర్వాత హోటల్ వచ్చాక సన్ రైజర్స్ ఆటగాళ్లు కేక్ కట్ చేసి సెలెబ్రేట్ చేసుకున్నారు. ఈ సందర్భంగా యువీ స్టెప్పులేసి ఇరగదీశాడు. ఈ మ్యాచ్‌లో మెరుపు ఇన్నింగ్స్ ఆడిన విలియమ్సన్ (51 బంతుల్లో 89)కు కేక్ తినిపించేందుకు హైదరాబాద్ ఆటగాళ్లు పోటీపడ్డారు. కాగా తన ముఖానికి కేక్ పూస్తారని ముందే భావించిన విలియమ్సన్ రెండు చేతులతో ముఖాన్ని దాచుకునేందుకు ప్రయత్నించగా, యువీ వచ్చి వెనుక నుంచి అతన్ని పట్టుకుని చేతులు తీసేందుకు ప్రయత్నించాడు. ఇతర ఆటగాళ్లు విలియమ్సన్కు కేక్ తినిపిస్తూ అతని ముఖానికంతా కేక్ పూశారు. విలియమ్సన్ తప్పించుకునేందుకు ప్రయత్నించినా ఆటగాళ్లు వదల్లేదు. అందరూ కలసి సరదాగా అతనితో ఓ ఆటాడుకున్నారు. -
పెద్ద గ్రౌండ్లు అయితే.. ఫోర్లు, సిక్సర్లు బాదేస్తా
న్యూఢిల్లీ: సాధారణంగా చిన్న గ్రౌండ్లలో క్రికెట్ మ్యాచ్‌లు ఆడితే భారీ స్కోర్లు నమోదు అవుతాయి. ఇక టి-20 ఫార్మాట్ అయితే బ్యాట్స్‌మెన్ ఫోర్లు, సిక్సర్లతో చెలరేగిపోతారు. కోల్‌కతా నైట్ రైడర్స్ ఆటగాడు యూసుఫ్ పఠాన్‌కు మాత్రం చిన్న మైదానాల్లో మ్యాచ్‌లు ఆడటం ఇబ్బందికరంగా ఉంటుందట. పెద్ద గ్రౌండ్లలో అయితే బంతి బౌండరీ లైన్ దాటాలంటే ఎలా కొట్టాలో తనకు తెలుసునని యూసుఫ్ అన్నాడు. టి-20 క్రికెట్లో తన పాత్రను కొద్దిగా మారిందని చెప్పాడు. ప్రస్తుతం కొందరు ఆటగాళ్లు సులభంగా ఫోర్లు, సిక్సర్లు కొడుతున్నారని, అవసరమైతే తాను సహజశైలిలో దూకుడుగా ఆడగలనని, అలాగే 20 ఓవర్లూ బ్యాటింగ్ చేయాల్సిన పరిస్థితి వచ్చినా సిద్ధపడతానని యూసుఫ్ అన్నాడు. 2007 జరిగిన తొలి టి-20 ప్రపంచ్ కప్‌లో యూసుఫ్ టీమిండియా తరఫున అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత ఐపీఎల్లో వెలుగులోకి వచ్చాడు. 2010 సీజన్లో రాజస్థాన్ తరపున ఆడిన యూసుఫ్ 37 బంతుల్లో మెరుపు సెంచరీ చేశాడు. ప్రస్తుతం కోల్‌కతా తరఫున ఆడుతున్నాడు. -
విరాట్ వచ్చాడు.. క్రిస్ గేల్ కూడా
బెంగళూరు: ఐపీఎల్-2017 సీజన్లో బెంగళూరు రాయల్ చాలెంజర్స్ కెప్టెన్ విరాట్ కోహ్లీ పునరాగనమం చేశాడు. ఫిట్నెస్ లేమి కారణంగా మునుపటి మ్యాచ్‌లకు దూరంగా ఉన్న కోహ్లీ.. శుక్రవారం ముంబై ఇండియన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో బరిలో దిగాడు. అలాగే బెంగళూరు స్టార్ క్రికెటర్ విధ్వంసకర బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్ ఈ మ్యాచ్‌లో ఆడుతున్నాడు. టాస్ గెలిచిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ తొలుత ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ముంబై జట్టులో మలింగ స్థానంలో సౌతీని తుది జట్టులోకి తీసుకున్నారు. బెంగళూరు జట్టులో వాట్సన్‌ను పక్కన పెట్టగా, బద్రీ, గేల్ వచ్చారు. -
ధోనీకి అండగా నిలిచిన పుణె కెప్టెన్
రాజ్‌కోట్: ఐపీఎల్-2017 సీజన్లో బ్యాట్‌తో పెద్దగా రాణించలేకపోతున్న మహేంద్ర సింగ్ ధోనీకి రైజింగ్ పుణె సూపర్‌జెయింట్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ అండగా నిలిచాడు. ధోనీ ఫామ్‌పై తనకు ఆందోళన లేదని, అతను క్లాస్ ఆటగాడని అన్నాడు. ఐపీఎల్ తాజా సీజన్లో తమ జట్టు కేవలం మూడే మ్యాచ్‌లు ఆడిందని, ఈ టోర్నీమిగతా మ్యాచ్ ల్లో ధోనీ రాణిస్తాడని స్మిత్ విశ్వాసం వ్యక్తం చేశాడు. తమకు ధోని బ్యాటింగ్ తో ఎటువంటి ఇబ్బంది లేదని స్మిత్ పేర్కొన్నాడు. తాజా సీజన్లో పుణె కెప్టెన్‌గా ధోనీని తొలగించి, అతని స్థానంలో స్మిత్‌కు జట్టు పగ్గాలు అప్పగించిన సంగతి తెలిసిందే. శుక్రవారం గుజరాత్ లయన్స్‌తో పుణె తలపడనుంది. ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో జరిగిన గత మ్యాచ్ తనకు, తమ జట్టుకు నిరాశ కలిగించిందని స్మిత్ అన్నాడు. ఈ మ్యాచ్ సందర్భంగా తాను కడుపు నొప్పితో బాధపడ్డానని, ఇప్పుడు కోలుకున్నానని చెప్పాడు. గుజరాత్‌తో జరిగే మ్యాచ్‌కు పూర్తి ఫిట్నెస్తో ఉంటానని స్మిత్ అన్నాడు. -
రాయల్ చాలెంజర్స్ కు మేజర్ బూస్ట్
న్యూఢిల్లీ: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు అమితోత్సాహాన్ని ఇచ్చే వార్త అందింది. గాయంతో ఐపీఎల్ తొలి మూడు మ్యాచ్‌లకు దూరమైన కెప్టెన్ విరాట్ కోహ్లి రేపు బరిలోకి దిగనున్నాడు. శుక్రవారం బెంగళూరులో ముంబై ఇండియన్స్ తో జరిగే మ్యాచ్ లో ఆడడేందుకు సిద్ధమయ్యాడు. కోహ్లి ఫిట్ గా ఉన్నాడని బీసీసీఐ మెడికల్ టీమ్ ధ్రువీకరించింది. గాయం నుంచి అతడు పూర్తిగా కోలుకున్నాడని అధికారికంగా వెల్లడించింది. ‘కుడి భుజంకు గాయం కావడంతో కోహ్లి వైద్యశిబిరంలో చికిత్స పొందాడు. అతడు ఇప్పుడు పూర్తిగా కోలుకుని ఐపీఎల్-10లో పాల్గొనేందుకు సిద్ధమయ్యాడ’ని బీసీసీఐ తెలిపింది. తమ కెప్టెన్ కోసం రాయల్ చాలెంజర్స్ బెంగళూరు టీమ్ ఎదురుచూస్తోంది. ఈ ఐపీఎల్ సీజన్ లో ఇప్పటివరకు మూడు మ్యాచ్ లు ఆడిన ఆర్సీబీ రెండిట్లో ఓడి ఒక మ్యాచ్ లో గెలిచింది. ‘మిస్టర్ ఫైర్’ కెప్టెన్సీలో ఆర్సీబీ వరుస విజయాల బాట పట్టాలని అభిమానులు కోరుకుంటున్నారు. -
జాంటీ రోడ్స్‌లా.. సాహా సూపర్ క్యాచ్
ఇండోర్: టీమిండియా కీపర్‌గా వృద్ధిమాన్ సాహా అద్భుతమైన క్యాచ్‌లు ఒడిసి పట్టుకున్నాడు. సాహా గాల్లోకి డైవ్ చేసి అసాధారణ రీతిలో క్యాచ్‌లు పట్టుకుని తోటి క్రికెటర్లు, అభిమానుల నుంచి ప్రశంసలు అందుకున్న సందర్భాలున్నాయి. తాజాగా ఐపీఎల్-2017 సీజన్లో సాహా ఇలాంటి అరుదైన ఫీట్‌ను రిపీట్ చేసి దక్షిణాఫ్రికా గ్రేట్ జాంటీ రోడ్స్‌ను తలపించాడు. సోమవారం రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ విజయం సాధించిన గతి తెలిసిందే. సాహా కింగ్స్ లెవెన్ పంజాబ్ తరఫున ఆడుతున్నాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బెంగళూరు బ్యాటింగ్ చేసింది. పంజాబ్ బౌలర్ వరుణ్ అరోన్ వేసిన షార్ట్ డెలివరీని బెంగళూరు ఆటగాడు మణ్‌దీప్ సింగ్ షాట్ కొట్టేందుకు ప్రయత్నించగా, బంతి వికెట్ల వెనుక గాల్లోకి లేచింది. ఆ సమయంలో అక్కడ ఫీల్డర్లు ఎవరూ లేరు. బంతి గమనాన్ని కచ్చితంగా అంచనా వేసిన సాహా పరిగెత్తుకుంటూ వెళ్లి గాల్లోకి డైవ్ చేసి సూపర్ క్యాచ్ పట్టుకున్నాడు. ఈ అద్భుతమైన దృశ్యాన్ని చూసిన వారందరూ స్టన్ అయ్యారు. సాహా ఫీల్డింగ్‌ను ప్రశంసించారు. మణ్‌దీప్ క్యాచవుట్గా పెవిలియన్ చేరాడు. -
మ్యాక్స్‌వెల్ మరో ఘనత
ఇండోర్: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో పంజాబ్ కింగ్స్ ఎలెవన్ కెప్టెన్ గ్లెన్ మ్యాక్స్‌వెల్ వెయ్యి పరుగుల మైలురాయిని అధిగమించాడు. ఐపీఎల్ లో 1000 పరుగులు పూర్తి చేసిన 53వ ఆటగాడిగా నిలిచాడు. ఇంతకుముందు 52 మంది ఈ ఘనత సాధించినప్పటికీ వీరందరికంటే అత్యధిక స్ట్రైక్ రేటుతో మ్యాక్స్‌వెల్ వెయ్యి పరుగులు పూర్తి చేయడం విశేషం. ఇప్పటివరకు 45 మ్యాచ్ లు ఆడిన ఈ ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ 164.75 స్ట్రైక్ రేటుతో 1005 పరుగులు తన ఖాతాలో వేసుకున్నాడు. సోమవారం ఇండోర్ లోని హోల్కర్ మైదానంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్ మ్యాక్స్‌వెల్ (22 బంతుల్లో 43 నాటౌట్; 3 ఫోర్లు, 4 సిక్సర్లు) చెలరేగి జట్టుకు విజయాన్ని అందించాడు. ఐపీఎల్లో ఓవరాల్ గా అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో సురేష్ రైనా (4,166)అగ్రస్థానంలో ఉండగా, ఆ తరువాత స్థానంలో విరాట్ కోహ్లి ఉన్నాడు. ప్రస్తుతం విరాట్ (4,110) రెండో స్థానంలో ఉన్నాడు. -
మిస్టర్ కూల్ ధోనీ డాన్స్ ఇరగదీశాడు..!
టీమిండియా కెప్టెన్‌గా ఓ వెలుగు వెలిగిన మహేంద్ర సింగ్ ధోనీ.. ఐపీఎల్‌లోనూ కెప్టెన్‌గా తనదైన ముద్ర వేశాడు. కాగా ఐపీఎల్-2017 సీజన్లో రైజింగ్ పుణె సూపర్ జెయింట్స్ కెప్టెన్సీ నుంచి ఉద్వాసనకు గురైన ధోనీ.. సాధారణ ఆటగాడిగా జట్టులో కొనసాగుతున్నాడు. ధోనీతో జట్టు యాజమాన్యానికి పడటం లేదని వార్తలు వచ్చాయి. టీమ్ యజమాని సంజీవ్ గోయెంకా సోదరుడు, వ్యాపారవేత్త అయిన హర్ష్ గోయెంకా ధోనీపై పరుష వ్యాఖ్యలు చేయడం గమనార్హం. క్రికెట్ మైదానంలో ఎలాంటి ప్రతికూల పరిస్థితుల్లోనైనా సహనంగా ఉండే మిస్టర్ కూల్.. నిజ జీవితంలోనూ అలాగే ఉంటాడు. టీమ్ యాజమాన్యం తన పట్ల ఎలాంటి వైఖరి ప్రదర్శించినా.. మహీ మాత్రం ఎప్పటిలాగే సహచర ఆటగాళ్లతో కలసి ఉల్లాసంగా గడుపుతున్నాడు. ఐపీఎల్ తాజా సీజన్ ప్రారంభమయ్యాక ధోనీ సహచర పుణె ఆటగాళ్లతో కలసి హుషారుగా డాన్స్ చేశాడు. మహీ తన ఇన్స్టాగ్రామ్ ఎకౌంట్లో ఓ షార్ట్ వీడియోను అప్లోడ్ చేశాడు. ఈ వీడియోలో ధోనీ.. అజింక్యా రహానెతో కలసి డాన్స్ చేస్తుండగా.. బెన్ స్టోక్స్ వెనుక నిల్చుని ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ వీడియోను పోస్ట్ చేసిన 12 గంటల్లోనే 7.50 లక్షల వ్యూస్, 4400 కామెంట్లు వచ్చాయి. 2008 ఐపీఎల్ ఆరంభమయ్యాక 2015 వరకు చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్‌గా ధోనీ బాధ్యతలు నిర్వర్తించాడు. ఐపీఎల్ నుంచి చెన్నై జట్టును సస్పెండ్ చేశాక గత సీజన్లో పుణె కెప్టెన్‌గా ధోనీ నియమితుడయ్యాడు. కాగా కెప్టెన్సీ బాధ్యతలు లేకుండా సాధారణ ఆటగాడిగా ధోనీ ఐపీఎల్లో ఆడుతుండటం ఇదే తొలిసారి. -
హైదరాబాద్.. నాకు లక్కీ ప్లేస్: యువీ
హైదరాబాద్: స్టార్ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ ఐపీఎల్-2017 సీజన్‌ను ఘనంగా ఆరంభించాడు. ప్రారంభ మ్యాచ్‌లోనే యువీ ఐపీఎల్లో వ్యక్తిగత ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీతో రెచ్చిపోయాడు. బుధవారం ఉప్పల్ స్టేడియంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ విజయంలో అతను కీలకపాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో తన బ్యాటింగ్‌ను ఆస్వాదించానని, హైదరాబాద్ తనకు లక్కీ ప్లేస్ అని యువీ అన్నాడు. గత రెండేళ్లుగా బ్యాటింగ్‌లో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నానని, ఈ మ్యాచ్‌లో తన ఆటతీరు సంతృప్తినిచ్చిందని, ఇదే జోరు కొనసాగించాల్సిన అవసరముందని యువీ చెప్పాడు. భారత జట్టులో తాను మళ్లీ చోటు సంపాదించడం చాలా సాయం చేసిందని వ్యాఖ్యానించాడు. ఎలాంటి ఒత్తిడి లేకుండా స్వేచ్ఛగా బ్యాటింగ్ చేశానని, పరిస్థితిని బట్టి షాట్లు ఆడానని చెప్పాడు. బెంగళూరుతో మ్యాచ్‌లో యువీ 27 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 62 పరుగులు చేశాడు. 'ఐపీఎల్ కోసం నెట్స్‌లో గంటల కొద్దీ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశా. హైదరాబాద్ ఎప్పుడూ నాకు లక్కీ ప్లేస్. ఇక్కడ భారీగా పరుగులు చేశా. ఎక్కడ ముగించామో (విజయం) అక్కడి నుంచే తాము కొత్త సీజన్‌ను ప్రారంభించాం. మా జట్టులో బ్యాట్స్‌మెన్ అందరూ రాణించారు. బౌలర్లూ కూడా ప్రతిభ కనబరిచారు. బెంగళూరు జట్టుపై గెలవడం మాకు (సన్ రైజర్స్ హైదరాబాద్)కు ముఖ్యమైనది. సొంతగడ్డపై వీలైనన్ని ఎక్కువ పాయింట్లు గెలవాలి. సొంత వేదికపై జరిగే 7 మ్యాచ్‌లలో మేం 5 గెలిస్తే నాకౌట్ దశకు చేరుకునేందుకు ఉపయోగపడుతుంది' అని యువీ అన్నాడు. -
ధోని మమ్మల్ని లెక్క చేయలేదు!
⇒ అందుకే కెప్టెన్సీ నుంచి తప్పించాం ⇒ పుణే యజమాని గోయెంకా సంచలన వ్యాఖ్యలు పుణే: ఒక్క సీజన్లో జట్టు ప్రదర్శన బాగా లేకపోయినంత మాత్రాన ధోనిలాంటి దిగ్గజ కెప్టెన్‌ను ఎవరైనా తప్పిస్తారా! పుణే జట్టు అతడిని నాయకత్వ బాధ్యతలనుంచి తొలగించిన దగ్గరినుంచి అభిమానుల మదిలో ఇదే ప్రశ్న. మార్పు కోసమే అంటూ స్మిత్‌ను ఎంపిక చేయడంకంటే దీని వెనక మరో బలమైన కారణం ఉండవచ్చని అందరిలో సందేహాలు తలెత్తాయి. ఇప్పుడు వాటిని నిజం చేస్తూ రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్ జట్టు యజమాని సంజీవ్ గోయెంకా అనేక విషయాలు వెల్లడించారు. ధోని గురించి ఆయన పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. జట్టు యజమానులైన తమను ధోని పట్టించుకోకపోవడమే ప్రధాన కారణమని అర్థమవుతోంది. ఒక బెంగాలీ పత్రికకు ఇచ్చిన ఇంటర్వూ్యలో గోయెంకా మాట్లాడుతూ...‘ధోని మాకు ఫోన్లో కూడా ఎప్పుడూ అందుబాటులోకి రాలేదు. ఫ్రాంచైజీ కీలక సమావేశాలకు కూడా అతను రాలేదు. అతనితో మాట్లాడాలనుకున్న ప్రతీసారి ఏజెంట్ అరుణ్ పాండే ద్వారానే వెళ్లాల్సి వచ్చేది. గతేడాది లీగ్ సమయంలో అతను టీమ్ మీటింగ్‌లకు కూడా దూరంగా ఉన్నాడు. ఇందులో చర్చించిన ఫీల్డింగ్‌ను ధోని మ్యాచ్‌లో పూర్తిగా మార్చేశాడు. అతను ఆ సమావేశంలో లేకపోవడం వల్ల ఏం జరిగిందో కూడా ధోనీకి తెలీదని ఒక సీనియర్ ఆటగాడు మాకు చెప్పాడు’ అని గోయెంకా కుండబద్దలు కొట్టారు. జట్టు నెట్ ప్రాక్టీస్‌లకు కూడా మహి హాజరు కాలేదని, లెగ్‌స్పిన్నర్ ఆడం జంపాను తుది జట్టులోకి తీసుకోమంటే తాను అతని ఆటను ఎప్పుడూ చూడలేదని చెప్పడం తమకు ఆశ్చర్యం కలిగించిందని పుణే యాజమాన్యం పేర్కొంది. దేశవాళీలో మంచి ప్రదర్శన లేకపోయినా ఫ్రాంచైజీపై ఒత్తిడి తెచ్చి సౌరభ్ తివారిని బలవంతంగా జట్టులోకి తీసుకోవడంతో పాటు టీమ్ జెర్సీ రంగు, డిజైన్‌కు సంబంధించి ధోని ఇచ్చిన సూచనలను యాజమాన్యం పట్టించుకోలేదు. క్రికెటేతర అంశాల్లో కూడా అతను జోక్యం చేసుకొనేంత అధికారం అతని చేతుల్లో ఇవ్వరాదని ఆర్పీజీ టీమ్ భావించింది. దాంతో మార్పు అనివార్యమంటూ జనవరిలోనే ధోనికి సమాచారం ఇవ్వగా, ‘మీరు ఏది సరైందని అనిపిస్తే అది చేయండి. ఇది మీ నిర్ణయం. నేను ఆటగాడిగానే ఉంటాను’ అని ధోని అప్పుడే చెప్పినట్లు తెలిసింది. ‘సామాన్య అభిమానులకు ఈ నిర్ణయం నచ్చదని మాకు తెలుసు. కానీ ఇదే సరైంది. నేను నిజాలను ఎప్పుడైనా మొహం మీదే చెప్పేస్తాను. ఫ్రాంచైజీ మేలు కోసమే ధోనిని తప్పించాం’ అని గోయెంకా స్పష్టం చేశారు. జార్ఖండ్ కెప్టెన్‌గా తొలిసారి.. ఐపీఎల్లో కెప్టెన్సీకి దూరమైన రెండు రోజులకే ధోని తన సొంత రాష్ట్రానికి నాయకుడిగా వ్యవహరించేందుకు సిద్ధమయ్యాడు. ఈ నెల 25నుంచి జరిగే దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీలో ధోని జార్ఖండ్ కెప్టెన్‌గా బరిలోకి దిగనున్నాడు. ఈ జట్టును మంగళవారం ప్రకటించారు. భారత్‌కు 331 అంతర్జాతీయ మ్యాచ్‌లలో, 143 ఐపీఎల్ మ్యాచ్‌లలో కెప్టెన్‌గా వ్యవహరించిన ధోని జార్ఖండ్‌కు తొలి సారి కెప్టెన్ కావడం విశేషం. గతేడాది కూడా ఈ టోర్నీ ఆడిన ధోని.. వరుణ్ ఆరోన్ కెప్టెన్సీలో ఆడాడు.