హైదరాబాద్.. నాకు లక్కీ ప్లేస్: యువీ
హైదరాబాద్: స్టార్ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ ఐపీఎల్-2017 సీజన్‌ను ఘనంగా ఆరంభించాడు. ప్రారంభ మ్యాచ్‌లోనే యువీ ఐపీఎల్‌లో వ్యక్తిగత ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీతో రెచ్చిపోయాడు. బుధవారం ఉప్పల్ స్టేడియంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ విజయంలో అతను కీలకపాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో తన బ్యాటింగ్‌ను ఆస్వాదించానని, హైదరాబాద్ తనకు లక్కీ ప్లేస్ అని యువీ అన్నాడు.
గత రెండేళ్లుగా బ్యాటింగ్‌లో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నానని, ఈ మ్యాచ్‌లో తన ఆటతీరు సంతృప్తినిచ్చిందని, ఇదే జోరు కొనసాగించాల్సిన అవసరముందని యువీ చెప్పాడు. భారత జట్టులో తాను మళ్లీ చోటు సంపాదించడం చాలా సాయం చేసిందని వ్యాఖ్యానించాడు. ఎలాంటి ఒత్తిడి లేకుండా స్వేచ్ఛగా బ్యాటింగ్ చేశానని, పరిస్థితిని బట్టి షాట్లు ఆడానని చెప్పాడు. బెంగళూరుతో మ్యాచ్‌లో యువీ 27 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 62 పరుగులు చేశాడు.
'ఐపీఎల్ కోసం నెట్స్‌లో గంటల కొద్దీ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశా. హైదరాబాద్ ఎప్పుడూ నాకు లక్కీ ప్లేస్. ఇక్కడ భారీగా పరుగులు చేశా. ఎక్కడ ముగించామో (విజయం) అక్కడి నుంచే తాము కొత్త సీజన్‌ను ప్రారంభించాం. మా జట్టులో బ్యాట్స్‌మెన్ అందరూ రాణించారు. బౌలర్లూ కూడా ప్రతిభ కనబరిచారు. బెంగళూరు జట్టుపై గెలవడం మాకు (సన్ రైజర్స్ హైదరాబాద్)కు ముఖ్యమైనది. సొంతగడ్డపై వీలైనన్ని ఎక్కువ పాయింట్లు గెలవాలి. సొంత వేదికపై జరిగే 7 మ్యాచ్‌లలో మేం 5 గెలిస్తే నాకౌట్ దశకు చేరుకునేందుకు ఉపయోగపడుతుంది' అని యువీ అన్నాడు.