పఠాన్ వస్తున్నాడు
రాజ్‌కోట్: టీమిండియా ఆల్ రౌండర్, బరోడా పేసర్ ఇర్ఫాన్ పఠాన్ కు అనూహ్యంగా ఐపీఎల్-10లో ఆడే అవకాశం దక్కింది. గుజరాత్ లయన్స్ తరపు అతడు బరిలోకి దిగనున్నాడు. వెస్టిండీస్ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో స్థానంలో ఇర్ఫాన్ ను తీసుకోవాలని గుజరాత్ ఫ్రాంచైజీ నిర్ణయించింది. గాయం కారణంగా బ్రావో.. ఐపీఎల్‌కు దూరమయ్యాడు.
ఫిబ్రవరిలో నిర్వహించిన 2017 సీజన్ వేలంలో ఇర్ఫాన్ పఠాన్‌ను కొనుగోలు చేసేందుకు ఏ ఫ్రాంచైజీ ఆసక్తి చూపలేదు. వేలంలో అతడి కనీస ధర రూ. 50 లక్షలుగా నిర్ణయించారు. పేసర్ ఇషాంత్ శర్మ కూడా వేలంలో అమ్ముడు పోలేదు. టోర్నమెంట్ మొదలైన తర్వాత అతడిని కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తీసుకుంది.
తొమ్మిదేళ్ల పాటు ఐపీఎల్ ఆడిన ఇర్ఫాన్ పఠాన్ పలు జట్లకు ప్రాతినిథ్యం వహించాడు. కింగ్స్ ఎలెవన్ పంజాబ్, ఢిల్లీ డేర్ డెవిల్స్, చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్ తరపున ఆడాడు. 1137 పరుగులు చేసి, 80 వికెట్లు పడగొట్టాడు.