
తప్పుకున్నాడా... తప్పించారా!
ధోని జట్టు గురించి ఆలోచించే మనిషి... వ్యక్తిగత రికార్డులను పట్టించుకోకుండా సరైన సమయం చూసుకొని తనంతట తానే కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు...
ధోని నిష్క్రమణపై కొత్త సందేహాలు
బోర్డు ఒత్తిడి వల్లేనని కథనాలు
ముంబై: ధోని జట్టు గురించి ఆలోచించే మనిషి... వ్యక్తిగత రికార్డులను పట్టించుకోకుండా సరైన సమయం చూసుకొని తనంతట తానే కెప్టెన్సీ నుంచి తప్పుకున్నాడు... ఇలా అనూహ్యంగా వ్యవహరించడం అతనికి మాత్రమే సాధ్యం... ఇదంతా ‘నాయకుడు’ ధోని గురించి అందరికీ తెలిసిన విషయం. కానీ అతని అర్ధాంతర నిష్క్రమణపై కొత్త కథనాలు వినిపిస్తున్నాయి. ధోని తనంతట తానుగా కెప్టెన్సీకి గుడ్‌బై చెప్పలేదని, 2019 వన్డే ప్రపంచకప్‌ను దృష్టిలో ఉంచుకొని జట్టును సిద్ధం చేస్తున్నాం కాబట్టి తప్పుకోవాలని బీసీసీఐ అతనిపై ఒత్తిడి పెంచినట్లు తెలుస్తోంది. తాను నాయకత్వ బాధ్యతల నుంచి దూరంగా వెళుతున్నట్లు ధోనినే స్వయంగా ప్రకటించాలంటూ కూడా వారు అతడికి చెప్పినట్లు సమాచారం.
సెప్టెంబర్‌లోనే నిర్ణయమా?
ఒక జాతీయ ఆంగ్ల దినపత్రిక కథనం ప్రకారం ధోనిని కెప్టెన్‌గా తప్పించాలనే నిర్ణయం హడావిడిగా జరిగింది కాదు. గత ఏడాది సెప్టెంబర్‌లోనే దీనిపై చర్చ జరిగింది. బీసీసీఐ నుంచి శ్రీనివాసన్ తప్పుకున్న తర్వాత సహజంగానే తనకు మద్దతుగా నిలిచేవారు లేక ధోని బలం తగ్గగా, కోహ్లిని కెప్టెన్ చేయాలనే డిమాండ్ బోర్డులోనే పెరిగింది. ఇదే విషయాన్ని గత వారం జార్ఖండ్, గుజరాత్ మధ్య నాగపూర్‌లో జరిగిన రంజీ ట్రోఫీ సెమీఫైనల్ మ్యాచ్ సందర్భంగా చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ చర్చించినట్లు తెలిసింది. మరోవైపు జార్ఖండ్‌కే చెందిన బీసీసీఐ సంయుక్త కార్యదర్శి అమితాబ్ చౌదరితో ధోనికి వాగ్వాదం జరిగినట్లు మరికొందరు చెబుతున్నారు. జార్ఖండ్ తరఫున రంజీ ట్రోఫీ సెమీఫైనల్ మ్యాచ్ ఆడాలని ధోనిని కోరగా, అతను దానికి నిరాకరించాడు. దీనిపై ఆగ్రహం చెందిన అమితాబ్, అసలు ధోని భవిష్యత్ ప్రణాళికలేమిటో తెలుసుకోవాల్సిందిగా ప్రసాద్‌కు చెప్పారు. ఇదంతా ధోనిని తప్పించడానికి ముందు జరిగిన వ్యవహారంగా వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. దాంతో తప్పనిసరి పరిస్థితుల్లో ధోని తన పదవికి వీడ్కోలు పలికాడు. ‘భవిష్యత్ ప్రణాళికల’ గురించి అడగటంతోనే కలత చెంది ధోని తప్పుకున్నాడని బీహార్ క్రికెట్ సంఘం కార్యదర్శి ఆదిత్య వర్మ ఆరోపించారు.
ప్రసాద్ ఖండన..
మరోవైపు చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ ఈ వార్తలను ఖండించారు. అది పూర్తిగా అతని వ్యక్తిగత నిర్ణయమన్నారు. ‘కెప్టెన్సీ నుంచి తప్పుకోమని ధోనిపై ఎవరూ ఒత్తిడి తీసుకురాలేదు. రంజీ సెమీస్ సమయంలో అతను తన నిర్ణయాన్ని నాకు చెప్పాడు. అతను నిజాయితీపరుడు కాబట్టి అతని నిర్ణయం మమ్మల్ని ఆశ్చర్యపరచలేదు. చాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్‌కు ముందు కోహ్లికి తగిన అనుభవం కావాలని అతను భావించి ఉంటాడు’ అని ప్రసాద్ వివరణ ఇచ్చారు.