అడుగు దూరంలో ధోని..
న్యూఢిల్లీ:ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10 లో రైజింగ్ పుణె సూపర్ జెయింట్ తుది పోరుకు అర్హత సాధించడంలో మహేంద్ర సింగ్ ధోని తనవంతు పాత్రను సమర్ధవంతంగా పోషించాడని భారత మాజీ కెప్టెన్ మహ్మద్ అజహరుద్దీన్ అభిప్రాయపడ్డాడు. ఈ టోర్నీ ఆరంభానికి ముందు ఎన్నో ఛీత్కారాలను ఎదుర్కొన్న ధోని.. ప్రస్తుతం తనను తాను నిరూపించుకోవడానికి కేవలం అడుగు దూరంలో మాత్రమే ఉన్నాడని అజహరుద్దీన్ పేర్కొన్నాడు. ఈ సందర్భంగా ధోనిని పుణె జట్టు కెప్టెన్ గా తప్పించడాన్ని తప్పుబట్టాడు.
గతంలో ఆరు ఐపీఎల్ ఫైనల్స్ ఆడిన అనుభవం ఉన్నధోని ఈ సీజన్ ఫైనల్ పోరులో రాణించి కప్ ను జట్టుకు అందిచిన పక్షంలో తనను పూర్తిగా నిరూపించుకున్నట్లు అవుతుందన్నాడు. 'కెప్టెన్ గా ధోని ఎప్పుడూ గెలిచాడు. ప్రస్తుతం ఆటగాడిగా ధోని నిరూపించుకోవాలనే యత్నంలో ఉన్నాడు. కెప్టెన్ గానే కాదు.. ఆటగాడిగా గెలవగలను అని నిరూపించుకునే సమయం ధోని ముందుంది. ఇందుకు కేవలం పాయింట్ దూరంలో మాత్రమే ధోని ఉన్నాడు.
అతన్ని రైజింగ్ పుణె జట్టు కెప్టెన్ గా తప్పించడాన్ని నేను ఎట్టిపరిస్థితుల్లోనూ సమర్ధించను. కానీ ధోని-స్టీవ్ స్మిత్ ల మధ్య సంబంధం బాగుండటం జట్టు మంచి విజయాలు సాధించడానికి దోహదం చేసింది.. ఫైనల్లో పుణెనే గెలుస్తుందని అనుకుంటున్నా. తొలి క్వాలిఫయర్ లో ముంబైపై గెలవడం పుణెకు లాభిస్తుంది. పుణె జట్టులో బెన్ స్టోక్స్ లేని లోటును పూడ్చటం కష్టమే. కానీ గత మ్యాచ్ చివరి ఓవర్లలో రాణించిన ధోని మరొకసారి బ్యాట్ ఝుళిపించి పుణె టైటిల్ సాధించడంలో సాయపడతాడని ఆశిస్తున్నా'అని అజహరుద్దీన్ పేర్కొన్నాడు.