మ్యాచ్ టర్నింగ్ పాయింట్ అదే!
మ్యాచ్ టర్నింగ్ పాయింట్ అదే!
Published Mon, May 22 2017 7:43 AM | Last Updated on Tue, Sep 5 2017 11:44 AM
హైదరాబాద్: అతనో మ్యాచ్ ఫినిషర్.. చేజింగ్ ఒత్తిడిలో ఎన్నో విజయాలందించిన అనుభవం.. చివరి బంతికి సిక్స్ కొట్టి గెలిపించిన సందర్భాలెన్నో.. అలాంటి డేంజరేస్ బ్యాట్స్ మన్ క్రీజులో ఉండగా గెలవడం కష్టమని భావించిందో ఎమో గానీ ముంబై మాత్రం మంచి వ్యూహంతో ఆ బ్యాట్స్ మన్ ను అవుట్ చేసి టైటిల్ ను సొంతం చేసుకుంది.
ఆ బ్యాట్స్ మన్ ఎవరో కాదు.. భారత మాజీ కెప్టెన్, రైజింగ్ పుణె వికెట్ కీపర్ మహేంద్రసింగ్ ధోని.. క్వాలిఫయర్-1 లో ఒంటి చెత్తో జట్టుకు విజయాన్నందించిన మహేంద్రుడు ఫైనల్ మ్యాచ్ లో మాత్రం జట్టును గెలిపించలేకపోయాడు. స్వల్ప లక్ష్యాన్ని ఎదుర్కొలేక అభిమానులను నిరాశపర్చాడు. దీంతో రైజింగ్ పుణె భారీ మూల్యాన్ని చెల్లించుకుంది. ఇక ఆదివారం ఉప్పల్ లో జరిగిన ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ లో ముంబై ఒక్క పరుగుతో పుణె పై గెలిచిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ లో తొలి నుంచి విజయ అవకాశం పుణే వైపు ఉన్న ధోని అవుటవ్వడంతో ఒక్కసారిగా ముంబై పట్టు సాధించింది.
అజింక్యా రహానే అవుటవ్వడంతో క్రీజులోకి వచ్చిన ధోని స్మిత్ తో ఆచితూచి ఆడాడు. ఇదే పుణే ను కొంప ముంచింది. ధోని క్రీజులోకి వచ్చిన సమయానికి పుణెకు 49 బంతుల్లో 59 పరుగులు అవసరం. కేవలం ఓవర్ కు 8 పరుగులు చేస్తే చాలు. ఇది టీ20 ల్లో కష్టమేమి కాదు. కానీ ధోని ఒత్తిడి గురయ్యాడు. ఏ మాత్రం తన సహాజ ఆట తీరును ప్రదర్శించలేక పోయాడు. ఐదు ఓవర్ల పాటు క్రీజులో ఉన్న ధోని ఒక బౌండరీతో కేవలం 13 పరుగులు చేశాడు. అటు స్మిత్ కూడా వేగంగా ఆడలేకపోయాడు. ఇక కృనాల్ పాండ్యా బౌలింగ్ లో స్మిత్ సిక్స్ బాది ఒత్తిడి తగ్గించాడు.. అయితే పుణె మాత్రం ఈ ఐదు ఓవర్లలో 27 పరుగులే చేయడం గమనార్హం. పుణె విజయానికి 22 బంతుల్లో 32 పరుగులు కావల్సిన తరుణంలో బుమ్రా వేసిన బంతికి ధోని కీపర్ పార్దీవ్ పటేల్ కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ధోని అవుట్ తో పట్టు సాధించిన ముంబై పుణె కు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా విజయాన్ని సొంతం చేసుకుంది.
Advertisement
Advertisement