ముంబై ఇండియన్స్ జైత్రయాత్ర
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10లో ముంబై ఇండియన్స్ జైత్రయాత్ర కొనసాగుతోంది. ఆదివారం గుజరాత్ లయన్స్ తో జరిగిన మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించి తమకు తిరుగులేదని మరోసారి నిరూపించింది. ఈ తాజా విజయం ద్వారా ముంబై ఖాతాలో వరుసగా నాల్గో విజయం చేరింది. తొలి మ్యాచ్ ను ఓటమితో ప్రారంభించిన ముంబై ఇండియన్స్, ఆపై తన జైత్రయాత్రను కొనసాగిస్తూ దూసుకుపోతోంది.
గుజరాత్ విసిరిన 177 పరుగుల లక్ష్యాన్ని ముంబై ఇండియన్స్ ఇంకా మూడు బంతులు మిగిలి ఉండగానే ఛేదించి బ్యాటింగ్ పవర్ చూపెట్టింది. ముంబై విజయంలో నితీష్ రానా(53; 36 బంతుల్లో4 ఫోర్లు, 2 సిక్సర్లు), రోహిత్ శర్మ(40 నాటౌట్;29బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్), పొలార్డ్(39;23 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లు) ప్రధాన పాత్ర పోషించారు. మరొక ముంబై ఆటగాడు జాస్ బట్లర్(26) ఫర్వాలేదనిపించాడు.
అంతకముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ కు దిగిన గుజరాత్ నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది.బ్రెండన్ మెకల్లమ్(64;44 బంతుల్లో6 ఫోర్లు, 3 సిక్సర్లు), దినేష్ కార్తీక్(48; 26 బంతుల్లో 2 సిక్సర్లు, 2 ఫోర్లు) , సురేశ్ రైనా(28; 29 బంతుల్లో 2 ఫోర్లు)లు గౌరవప్రదమైన స్కోరు చేయడంలో సహకరించారు.
ఆదిలోనే ఓపెనర్ డ్వేన్ స్మిత్ డకౌట్ గా పెవిలియన్ చేరి నిరాశపరిచినా మెకల్లమ్, రైనాలు బాధ్యతాయుతంగా ఆడారు. ఈ జోడి 80 పరుగుల భాగస్వామ్యం సాధించిన తరువాత రైనా రెండో వికెట్ గా పెవిలియన్ చేశాడు. అదే సమయంలో మెకల్లమ్ కూడా హాఫ్ సెంచరీ సాధించాడు. 36 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో మెకల్లమ్ అర్థ శతకం నమోదు చేశాడు.అయితే మెకల్లమ్ దాటిగా బ్యాటింగ్ చేసే క్రమంలో 64 పరుగుల వ్యక్తిగత పరుగుల వద్ద మలింగా బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు. ఆ తరువాత దినేష్ కార్తీక్ జోరును పెంచడంతో ఓ మంచి లక్ష్యాన్ని ముంబై ముందుంచారు.