రాణించిన మెకల్లమ్, దినేశ్ కార్తీక్
ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-10లో భాగంగా ఇక్కడ వాంఖేడ్ స్టేడియంలో ముంబై ఇండియన్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో గుజరాత్ లయన్స్ 177 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. గుజరాత్ ఆటగాళ్లలో బ్రెండన్ మెకల్లమ్(64;44 బంతుల్లో6 ఫోర్లు, 3 సిక్సర్లు), దినేష్ కార్తీక్(48; 26 బంతుల్లో 2 సిక్సర్లు, 2 ఫోర్లు) లు రాణించగా, సురేశ్ రైనా(28; 29 బంతుల్లో 2 ఫోర్లు) ఫర్వాలేదనిపించి జట్టు గౌరవప్రదమైన స్కోరు సాధించడంలో తోడ్పడ్డారు.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ కు దిగిన గుజరాత్ కు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ డ్వేన్ స్మిత్ డకౌట్ గా పెవిలియన్ చేరి నిరాశపరిచాడు. ముంబై బౌలర్ మెక్లీన్ గన్ బౌలింగ్ లో స్మిత్ అవుటయ్యాడు. దాంతో మెకల్లమ్ కు జత కలిసిన కెప్టెన్ సురేశ్ రైనా జట్టు స్కోరును చక్కదిద్దే పనిలో పడ్డాడు. ఈ జోడి 80 పరుగుల భాగస్వామ్యం సాధించిన తరువాత రైనా రెండో వికెట్ గా పెవిలియన్ చేశాడు. అదే సమయంలో మెకల్లమ్ కూడా హాఫ్ సెంచరీ సాధించాడు. 36 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో మెకల్లమ్ అర్థ శతకం నమోదు చేశాడు.
అయితే మెకల్లమ్ దాటిగా బ్యాటింగ్ చేసే క్రమంలో 64 పరుగుల వ్యక్తిగత పరుగుల వద్ద మలింగా బౌలింగ్ లో బౌల్డ్ అయ్యాడు. ఆ తరువాత దినేష్ కార్తీక్ జోరును పెంచడంతో గుజరాత్ స్కోరు బోర్డులో వేగం పెరిగింది. అతనికి ఇషాన్ కిషన్(11), జాసన్ రాయ్(14 నాటౌట్;7 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్) కొద్దిపాటి సహకారం ఇవ్వడంతో గుజరాత్ నిర్ణీత ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. ముంబై బౌలర్లలో మెక్లీన్ గన్ రెండు వికెట్లు సాధించగా, మలింగా, హర్భజన్ సింగ్ లకు తలో వికెట్ దక్కింది.