ఆల్‌రౌండర్ షోతో అదరగొట్టాడు!
ముంబై ఇండియన్స్ ఆటగాడు క్రునాల్ పాండ్యా ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టాడు. గుజరాత్ లయన్స్‌తో మ్యాచ్‌లో క్రునాల్ పొదుపుగా బౌలింగ్ చేసి 14 పరుగులకు మూడు వికెట్లు తీసుకున్నాడు. అనంతరం బ్యాటింగ్‌లో కీలకమైన 29 పరుగులు (20 బంతుల్లో) చేశాడు. క్రునాల్ పర్ఫెక్ట్ ఆల్‌రౌండర్ ప్రదర్శనతో ముంబై సూపర్ ఓవర్ దాకా వెళ్లగలిగింది. సూపర్ ఓవర్‌లో బూమ్రా అద్భుతమైన బౌలింగ్‌తో ముంబై జట్టును విజయం వరించిన సంగతి తెలిసిందే.
మ్యాచ్ విజయంలో కీలక పాత్ర పోషించిన క్రునాల్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఈ సందర్భంగా క్రునాల్ మాట్లాడుతూ ‘నన్ను నేను ఆల్‌రౌండర్‌గా భావించుకుంటాను. బ్యాటుతోనూ, బంతితోనూ మైదానంలో రాణించాలని కోరుకుంటాను. బ్యాటింగ్ చేసేటప్పుడు బ్యాట్స్‌మన్‌గానూ, బౌలింగ్ చేసేటప్పుడు బౌలర్‌గానూ భావించుకుంటాను’ అని అతను చెప్పాడు. గుజరాత్ మ్యాచ్‌లో బ్యాటింగ్‌కు పిచ్ అంతా అనుకూలంగా లేదని, కానీ, చివరి ఓవర్‌లో తాను సిక్సర్ కొట్టడంతో మ్యాచ్ టై వరకు వెళ్లేందుకు దోహదపడిందని తెలిపాడు.
ఆఖరి ఓవర్‌లో ముంబై విజయానికి 11 పరుగులు అవసరం కాగా తొలి బంతిని కృనాల్ సిక్సర్ కొట్టగా... రెండో బంతికి సింగిల్ వచ్చింది. అయితే మూడో బంతికి బుమ్రా అవుటయ్యాడు. నాలుగో బంతికి రెండు పరుగులు... ఐదో బంతికి సింగిల్ వచ్చాయి. చివరి బంతికి కృనాల్ రనౌట్ కావడంతో మ్యాచ్ టై అయిన సంగతి తెలిసిందే.