బౌలర్ల ప్రతిభతో రెండు జట్ల ఇన్నింగ్స్ 8 పరుగుల రన్‌రేట్‌తోనే సాగింది. అటు, ఇటు మొదటి, చివరి స్థానాల్లో బ్యాటింగ్‌కు దిగిన ఆటగాళ్లే కీలక ఇన్నింగ్స్ ఆడారు. విజయానికి సమఉజ్జీలుగా ఉన్న దశలో పేలవ బౌలింగ్ పంజాబ్ కొంపముంచగా... మెరుపు ఇన్నింగ్స్ ఆడిన కృనాల్ పాండ్యా ముంబైకి విజయం అందించి సంతోషంలో ముంచెత్తాడు.
ఇండోర్: డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్ ఆశలు సజీవం. రేసులో నిలవాలంటే తప్పక గెలవాల్సిన స్థితిలో ఆ జట్టు పోరాడింది. శుక్రవారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో రోహిత్ జట్టు కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌ను 6 వికెట్ల తేడాతో ఓడించింది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పంజాబ్ మొదట్లో క్రిస్ గేల్ (40 బంతుల్లో 50; 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ శతకం, చివర్లో మార్కస్ స్టాయినిస్ (15 బంతుల్లో 29 నాటౌట్; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) మెరుపులతో నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 174 పరుగులు చేసింది. బుమ్రా (1/19) ప్రత్యర్థిని కట్టడి చేశాడు. అనంతరం ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ సూర్యకుమార్ యాదవ్ (42 బంతుల్లో 57; 6 ఫోర్లు, 3 సిక్స్‌లు) ప్రతిఘటనతో పోటీనిచ్చిన ముంబై... కృనాల్ పాండ్యా (12 బంతుల్లో 31 నాటౌట్, 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) విజృంభణతో గెలుపొందింది. 30 బంతుల్లో 57 పరుగులు చేయాల్సిన దశలో కృనాల్, కెప్టెన్ రోహిత్‌శర్మ (15 బంతుల్లో 24 నాటౌట్; 1 ఫోర్, 2 సిక్స్‌లు)లు చెలరేగారు. వీరిద్దరు 21 బంతుల్లోనే అభేద్యంగా 56 పరుగులు జోడించడంతో ఫలితం మారిపోయింది.
ముందుగా గేల్... చివర్లో స్టొయినిస్
పంజాబ్ ఇన్నింగ్స్ పెద్దగా మెరుపుల్లేకుండానే సాగింది. ముంబై బౌలర్లు బుమ్రా, మెక్లీనగన్ కట్టడి చేయడంతో గేల్, కేఎల్ రాహుల్ (20 బంతుల్లో 24; 1 ఫోర్, 2 సిక్స్‌లు) స్వేచ్ఛగా ఆడలేకపోయారు. హార్దిక్ వేసిన నాలుగో ఓవర్లో వరుసగా మూడు ఫోర్లు కొట్టి గేల్ టచ్‌లోకి వచ్చాడు. మెక్లీనగన్ బౌలింగ్‌లో అతి భారీ సిక్స్ బాదాడు. తొలి వికెట్‌కు 54 పరుగులు జోడించాక రాహుల్‌ను మార్కండే వెనక్కు పంపాడు. వీలు చిక్కినప్పుడల్లా షాట్లు కొడుతూ గేల్ అర్ధ శతకం (38 బంతుల్లో) పూర్తిచేసుకున్నాడు. ఈ ఐపీఎల్‌లో అయిదు మ్యాచ్‌ల్లో తనకిది నాలుగో హాఫ్ సెంచరీ కావడం విశేషం. అయితే, కటింగ్ వెంటనే అతడి జోరుకు కత్తెరేశాడు. బంతులను వృథా చేసిన యువరాజ్ సింగ్ (14) మరుసటి ఓవర్లోనే రనౌటయ్యాడు. కరుణ్ నాయర్ (12 బంతుల్లో 23; 1 ఫోర్, 2 సిక్స్‌లు) కొన్ని మంచి షాట్లు ఆడగా, అక్షర్ పటేల్ (13) ఆకట్టుకోలేకపోయాడు. హార్దిక్ వేసిన చివరి ఓవర్లో చెలరేగిన స్టొయినిస్ 2 ఫోర్లు, 2 సిక్స్‌లు సహా 22 పరుగులు సాధించి జట్టుకు ఫర్వాలేదనిపించే స్కోరు అందించాడు.
తొలుత సూర్య... ముగింపులో కృనాల్
ఊహించిన దాని కంటే తక్కువ పరుగులు చేశామని భావించాడో ఏమో పంజాబ్ బౌలింగ్ దాడిని కెప్టెన్ అశ్వినే ప్రారంభించాడు. దీనికి తగ్గట్లే అతడు బ్యాట్స్‌మెన్‌ను నిరోధించాడు. అయితే అంకిత్ రాజ్‌పుత్‌ను లక్ష్యంగా చేసుకుని సూర్యకుమార్ మూడు సిక్స్‌లు బాదాడు. 34 బంతుల్లోనే అర్ధశతకం అందుకున్నాడు. మిగతా బౌలర్లు కట్టుదిట్టమైన బంతులేయడంతో ముంబై ఛేదన నత్తనడకన సాగింది. సూర్యతో పాటు ఇషాన్ కిషన్ (19 బంతుల్లో 25; 3 సిక్స్‌లు), హార్దిక్ పాండ్యా (13 బంతుల్లో 23; 2 ఫోర్లు, 1 సిక్స్) కీలక సమయంలో వెనుదిరిగారు. రోహిత్, కృనాల్‌లు స్టొయినిస్, ముజీబ్‌ల ఓవర్లలో భారీగా పరుగులు సాధించి మ్యాచ్‌ను లాగేసుకున్నారు. టై బౌలింగ్‌లో ఫోర్, సిక్స్‌తో కృనాల్ లక్ష్యాన్ని మరింత కరిగించాడు.
రెండు ప్లే ఆఫ్‌లు ఈడెన్‌లో
కోల్‌కతా: ఐపీఎల్–11లో రెండు మ్యాచ్‌ల వేదిక మారింది. ఈ నెల 23, 25 తేదీల్లో జరగాల్సిన ఎలిమినేటర్, క్వాలిఫయర్ 2లను పుణే నుంచి కోల్‌కతాలోని చరిత్రాత్మక ఈడెన్ గార్డెన్స్‌కు తరలిస్తూ పాలక మండలి నిర్ణయం తీసుకుంది. కావేరి జల వివాదం నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్‌లకు పుణే ఆతిథ్యమిస్తోంది. ఈ నేపథ్యంలో ఎలిమినేటర్, క్వాలిఫయర్‌లను కోల్‌కతాకు తరలించారు. మే 22న మొదటి క్వాలిఫయర్, 27న ఫైనల్‌లకు ముంబైలోని వాంఖెడే స్టేడియం ఆతిథ్యమిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment