కేఎల్ రాహుల్, ముంబై ఆటగాళ్లు
సాక్షి, ముంబై : ఐపీఎల్-11లో భాగంగా బుధవారం రాత్రి జరిగిన ఉత్కంఠ పోరులో కింగ్స్ ఎలెవన్ పంజాబ్‌పై డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఓవైపు ముంబై ఆటగాళ్లు సంబరాలు చేసుకుంటుంటే.. మరోవైపు పంజాబ్ ఓటమిని జీర్ణించుకోలేక ఆ జట్టు ఓపెనర్ కేఎల్ రాహుల్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ప్రేక్షకులను సైతం రాహుల్ కన్నీళ్లు కదిలించాయి. ఎందుకంటే జట్టు కోసం శక్తివంచన లేకుండా ఈ సీజన్‌లో రాణిస్తున్న కొందరు క్రికెటర్లలో రాహుల్ ఒకడు. 187 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పంజాబ్ ఓపెనర్ రాహుల్ (94: 60 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లు) మరో సెంచరీ చేజార్చుకున్నాడు.
కాగా, చేజారింది రాహుల్ సెంచరీ కాదు. మ్యాచ్ అని పంజాబ్‌కు కొంత సేపటికే తెలిసొచ్చింది. 19వ ఓవర్లో బుమ్రా వేసిన తెలివైన స్లో డెలివరికి రాహుల్ ఇన్నింగ్స్ ముగియగా.. పంజాబ్ విజయానికి 9 బంతుల్లో 16 పరుగులు కావాలి. కానీ ప్రత్యర్థిని కట్టడి చేసి 3 పరుగుల తేడాతో ముంబై నెగ్గింది. పంజాబ్ ఓటమిని తట్టుకోలేక కీలక ఇన్నింగ్స్ ఆడిన రాహుల్ డగౌట్‌లో ఏడ్చేశాడు. అదే సమయంలో విజయం సాధించిన ముంబై ఆటగాళ్లు మెక్లీనగన్ హార్ధిక్ పాండ్యాలు మైదానంలో పుష్ అప్స్ చేసి సంబరాలు చేసుకున్నారు. మ్యాచ్ ముగిశాక పాండ్యాతో ముంబై జెర్సీ తీసుకుని ధరించి క్రీడాస్పూర్తిని చాటుకున్నాడు. పాండ్యా సైతం పంజాబ్ జెర్సీ ధరించాడు.
మ్యాచ్ అనంతరం ఇరుజట్లు 12 పాయింట్లతో ఉన్నప్పటికీ మెరుగైన రన్‌రేట్ కారణంగా పాయింట్ల పట్టికలో ముంబై 4వ స్థానంలో ఉండగా, పంజాబ్ 6వ స్థానంలో నిలిచింది.
Comments
Please login to add a commentAdd a comment