నా నిర్ణయం సరైనదే
బులవాయో: జమ్మూ కాశ్మీర్ నుంచి జాతీయ జట్టులో చోటు దక్కించుకున్న తొలి క్రికెటర్‌గా పర్వేజ్ రసూల్ పేరు తెచ్చుకున్నప్పటికీ జింబాబ్వే పర్యటనలో అరంగేట్రం చేయలేకపోయాడు. చివరి వన్డేలో చాన్స్ దక్కుతుందనుకున్నప్పటికీ ఈ ఆల్‌రౌండర్‌కు నిరాశే ఎదురైంది. ఈ విషయంలో పలువురి నుంచి విమర్శలు ఎదురయ్యాయి. అయితే తమ ప్రణాళికలను కెప్టెన్ విరాట్ కోహ్లి సమర్థించుకున్నాడు. తాను తీసుకున్న నిర్ణయం సరైనదేనని వివరణ ఇచ్చాడు. సమతూకంతో ఉన్న జట్టు బౌలింగ్ విభాగంలో రసూల్‌ను ఆడించే అవకాశం లేకుండా పోయిందని అన్నాడు. భవిష్యత్‌లో అతడికి మరిన్ని అవకాశాలు వస్తాయన్న కోహ్లి పలు అంశాలపై వెలిబుచ్చిన అభిప్రాయాలు అతని మాటల్లోనే... మార్పులు వద్దనుకున్నాం: జట్టులో ఓ ఆటగాడిని ఆడించే విషయంలో ఇతరులు ఏమనుకుంటారో అనే విషయం నాకనవసరం. ఈ ఐదు మ్యాచ్‌ల్లో ఆడిన ఆటగాళ్లు కూడా ఇప్పటిదాకా రెండు నెలలు అంతకంటే ఎక్కువగానే వేచి చూశారు. జట్టులో బౌలింగ్ కాంబినేషన్ చక్కగా కుదిరింది. ఈ విషయాన్ని పర్వేజ్ కూడా అర్థం చేసుకున్నాడు. ఇందులో ఎలాంటి మార్పులు చేయదలుచుకోలేదు. అతడికి చాన్స్ రాకపోవడం దురదృష్టకరం. భవిష్యత్‌లో అతడు మరిన్ని సిరీస్‌లు ఆడగలిగితే అతడి సామర్థ్యం బయటపడుతుంది.
జడేజాను వదులుకోవడం కష్టం: ఆల్‌రౌండర్ జడేజా స్థానంలో రసూల్‌ను ఆడించాలని అనుకోవడం సరికాదు. అలాంటి ఆటగాడిని వదులుకోవడం కష్టం. ఎందుకంటే అతడు ఎలాంటి పరిస్థితుల్లోనైనా వికెట్ తీయగలడు. ఏ మ్యాచ్‌ను కూడా తేలిగ్గా తీసుకోకూడదని నిర్ణయించుకున్నాం. అందుకే బౌలింగ్‌లో మరీ ఎక్కువ ప్రయోగాలు చేయదలుచుకోలేదు. చాలా రోజులుగా మిశ్రా రిజర్వ్ బెంచికే పరిమితమయ్యాడు. అతడికి నాలుగైదు మ్యాచ్‌ల అవకాశం ఇవ్వాలని అనుకున్నాం.
దక్షిణాఫ్రికా పర్యటనలో చాన్స్: పర్వేజ్ ఇప్పుడు భారత్ ‘ఎ’ జట్టుతో పాటు దక్షిణాఫ్రికా వెళ్లనున్నాడు. అక్కడ అతడు చాలా మ్యాచ్‌లు ఆడతాడు. అలాగే అనుభవం కూడా వస్తుంది.
అరంగేట్రంలోనే అదరగొట్టారు: వన్డేల్లో తొలిసారిగా ఆడే అవకాశం వచ్చినా మా ఆటగాళ్లు అదరగొట్టారు. ముఖ్యంగా మోహిత్ శర్మ, ఉనాద్కట్ విశేషంగా రాణించారు. అమిత్ మిశ్రా నిరంతరంగా రెండు నెలల పాటు చోటు కోసం వేచి చూసినా ఈ సిరీస్‌లో 18 వికెట్లతో దుమ్ము రేపాడు. పరిస్థితులకు తగ్గట్టు మా బౌలర్లు సరైన బంతులు విసరగలిగారు.