
'నా పన్నేండేళ్ల శ్రమ నేడు ఫలించింది'
రియోడిజనిరో: తన పన్నేండళ్ల కష్టానికి ఫలితమే ఈ ఒలింపిక్స్ పతకం అని భారత్ కు రియోడిజనిరోలో జరుగుతున్న ఒలింపిక్స్లో తొలి పతకాన్ని సాధించిపెట్టిన సాక్షి మాలిక్ చెప్పింది. చివరి వరకు తాను గెలుస్తానన్న నమ్మకం తనకు ఉందని ఆమె చెప్పింది. మహిళల ఫ్రీస్టయిల్ రెజ్లింగ్ 58 కేజీల విభాగంలో భారత రెజ్లర్ సాక్షి మాలిక్ కాంస్య పతకాన్ని సాధించిన విషయం తెలిసిందే.
బుధవారం అర్ధరాత్రి దాటాక జరిగిన కాంస్య పతక పోరులో సాక్షి 8-5తో ఐసులు తినిబెకోవా (కిర్గిజిస్తాన్)పై విజయం సాధించి ఈ పతకాన్ని గెలిచి భారత్ తరుపున ఈ ఒలింపిక్స్లో తొలి పతకాన్ని సాధించింది. దీంతో రియో ఒలింపిక్స్ ఎట్టకేలకు భారత్ పతకాల ఖాతా తెరిచినట్లయింది. ఈ పతకం గెలిచిన సందర్భంగా సాక్షి మాలిక్ మీడియాతో మాట్లాడుతూ.. 'నా పన్నేండేళ్ల కఠోర శ్రమ నేడు ప్రతిఫలించింది. చివరి అంకం వరకు పతకం నాదే అని నా గుండె నాకు బలంగా చెప్పింది' అంటూ ఆమె భావోద్వేగంగా మాట్లాడింది. భారత్కు ఒలింపిక్స్ నుంచి పతకం తీసుకొచ్చిన సాక్షి నాలుగో మహిళకాగా.. రెజ్లర్ గా తొలి మహిళ.