నా పేరు కైఫ్.. షార్ప్షూటర్ను కాను
న్యూఢిల్లీ: బిహార్లో జర్నలిస్టు రాజ్దేవ్ రంజన్ హత్యకేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న షార్ప్ షూటర్ మహ్మద్ కైఫ్ తాను హంతకుడ్ని కాదని క్రికెటర్ను అంటూ ఓ ఇంటర్వ్యూలో చెప్పడం గందరగోళానికి తావిచ్చింది. జంట హత్యల కేసులో యావజ్జీవ కారాగారశిక్ష అనుభవిస్తున్న ఆర్జేడీ మాజీ ఎంపీ మహ్మద్ షాబుద్దీన్ ఇటీవల బెయిల్పై విడుదలైనపుడు ఆయన పక్కన కైఫ్ కనిపించడం దుమారం రేపింది. కైఫ్ను అరెస్ట్ చేయకపోవడంపై తీవ్ర నిరసనలు రావడం.. తర్వాత పోలీసులు ఆయన ఆస్తులను అటాచ్ చేయడం.. కైఫ్కు న్యాయం చేయాలంటూ ఆయన అనుచరులు నిరసన తెలపడం.. ఈ వార్తలు జాతీయ మీడియాలో రావడంతో క్రికెట్ అభిమానులు తికమకపడ్డారు. షార్ప్షూటర్ కైఫ్ స్వస్థలం బిహార్లోని శివాన్ జిల్లా కాగా.. ఇదే పేరు గల మహ్మద్ కైఫ్ టీమిండియా మాజీ క్రికెటర్ అన్న సంగతి తెలిసిందే. క్రికెటర్ కైఫ్ షార్ప్షూటర్ ఎప్పుడు అయ్యాడని నెటిజెన్లు అయోమయంలో పడ్డారు. కొంతమంది ఇదే విషయాన్ని ట్విట్టర్లో పోస్ట్ చేయగా, కొంతమంది ఏకంగా కైఫ్ ఇంటికి ఫోన్ చేసి ఆరా తీశారు. ఈ విషయం కైఫ్ దృష్టికి రావడంతో వివరణ ఇచ్చాడు.
‘నాకు, నా కుటుంబ సభ్యులకు చాలా మంది ఫోన్లు చేశారు. నా పేరు మహ్మద్ కైఫ్. మీరు అనుకుంటున్న ఆ షార్ప్షూటర్ నేను కాను. నేను తుపాకీతో కాల్చను. బంతితో స్టంప్స్ను షూట్ చేస్తుంటానంతే. నేను బంతి, బ్యాట్తో మాత్రమే ఆడుతా. రంజీ క్రికెట్ సీజన్ కోసం చండీగఢ్లో శిక్షణ పొందుతున్నా. దయచేసి గందరగోళం పడవద్దు. ఇందులో సందేహం వద్దు నేను క్రికెటర్ను’ అంటూ కైఫ్ చెప్పాడు.