sharpshooter
-
ఖాకీలకు చిక్కిన షార్ప్‌షూటర్..
సాక్షి, న్యూఢిల్లీ : అతడో కరుడుగట్టిన నేరగాడు, ప్రత్యర్ధులకు చెమటలు పట్టించడంతో పాటు పోలీసులను ముప్పతిప్పలు పెట్టే గ్యాంగ్‌స్టర్. ఖాకీలకు టోకరా వేస్తూ అజ్ఞాతంగా నేరాలకు పాల్పడే ఆ ఘరానా నిందితుడికి రాజధాని పోలీసులు ఝలక్ ఇచ్చారు. నీరజ్ బవానా గ్యాంగ్‌కు చెందిన షార్ప్‌షూటర్ రాజ్ కుమార్ అలియాస్ బంభాను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులతో జరిగిన ఎన్కౌంటర్లో నిందితుడికి బుల్లెట్ గాయాలయ్యాయి. నాలుగు హత్యలతో సహా ఆరు కేసుల్లో మోస్ట్ వాండెట్‌గా ఉన్న నిందితుడిని ఇప్పటికే పరారీలో ఉన్న నేరగాడిగా ప్రకటించారు. ఆయన తలపై రూ లక్ష రివార్డును ఢిల్లీ పోలీసులు ప్రకటించారు. కాగా ఓ వ్యక్తిని కలిసేందుకు నిందితుడు ప్రహ్లాద్పూర్ రోడ్డుకు వస్తున్నాడనే సమాచారంతో వలపన్ని అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కుమార్ నుంచి ఓ సెమీ ఆటోమేటిక్ పిస్టల్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బైక్‌పై వచ్చిన నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నించగా బైక్‌ను వదిలి పారిపోతూ పోలీసులపై కాల్పులు జరిపాడని, ఆత్మరక్షణ కోసం పోలీసులు జరిపిన కాల్పుల్లో నిందితుడు గాయపడ్డాడని అధికారులు వెల్లడించారు. తాను నీరజ్ బవానా సోదరుడు పంకజ్ నుంచి డబ్బు తీసుకున్నానని, ఆ మొత్తం చెల్లించలేక వారి వద్ద పనిచేస్తున్నానని విచారణ సందర్భంగా రాజ్ కుమార్ విచారణలో వెల్లడించాడని పోలీసులు చెప్పారు. కాగా, నిందితుడికి ప్రత్యర్థి వర్గానికి చెందిన పలువురి హత్య కేసులతో పాటు ఇతర హత్య కేసుల్లో సంబంధం ఉందని వెల్లడించారు. -
కోర్టులో మహ్మద్ కైఫ్ లొంగుబాటు
శివాన్: బిహార్ పోలీసులు వెతుకుతోన్న షార్ప్ షూటర్ మహ్మద్ కైఫ్ బుధవారం శివాన్ కోర్టులో లొంగిపోయాడు. అతడికి న్యాయస్థానం 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీ విధించింది. జర్నలిస్టు రాజ్దేవ్ రంజన్ హత్యకేసులో అతడు ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. జంట హత్యల కేసులో యావజ్జీవ కారాగారశిక్ష అనుభవిస్తున్న ఆర్జేడీ మాజీ ఎంపీ మహ్మద్ షాబుద్దీన్ ఇటీవల బెయిల్‌పై విడుదలైనపుడు ఆయన పక్కన కైఫ్ కనిపించడంతో బిహార్ రాజకీయాల్లో దుమారం రేపింది. కైఫ్ వ్యవహారం జేడీ(యూ)-ఆర్జేడీ ప్రభుత్వానికి తలనొప్పిగా మారింది. కాగా, తనకు కుట్రపూరితంగా కేసుల్లో ఇరికించారని అంతకుముందు కైఫ్ ఆరోపించాడు. రాజకీయ కుట్రతో తనపై బురద చల్లుతున్నారని వాపోయాడు.‘నేను నేరస్తుడిని కాదని శివాన్ ప్రజలు, జర్నలిస్టులకు తెలుసు. రాజ్దేవ్ రంజన్ తో నాకు ఎటువంటి శత్రుత్వం లేదు. నా పెళ్లికి కూడా అతడు వచ్చాడ’ని కైఫ్ వెల్లడించాడు. మహ్మద్ షాబుద్దీన్ ఎందుకు కనిపించావని ప్రశ్నించగా... ’మద్దతుదారుగా వెళ్లాను. అక్కడకు వెళ్లే ముందు మా న్యాయవాది సలహా కూడా తీసుకున్నాన’ని తెలిపాడు. -
నా పేరు కైఫ్.. షార్ప్‌షూటర్‌ను కాను
న్యూఢిల్లీ: బిహార్‌లో జర్నలిస్టు రాజ్దేవ్ రంజన్ హత్యకేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న షార్ప్ షూటర్ మహ్మద్ కైఫ్ తాను హంతకుడ్ని కాదని క్రికెటర్‌ను అంటూ ఓ ఇంటర్వ్యూలో చెప్పడం గందరగోళానికి తావిచ్చింది. జంట హత్యల కేసులో యావజ్జీవ కారాగారశిక్ష అనుభవిస్తున్న ఆర్జేడీ మాజీ ఎంపీ మహ్మద్ షాబుద్దీన్ ఇటీవల బెయిల్‌పై విడుదలైనపుడు ఆయన పక్కన కైఫ్ కనిపించడం దుమారం రేపింది. కైఫ్‌ను అరెస్ట్ చేయకపోవడంపై తీవ్ర నిరసనలు రావడం.. తర్వాత పోలీసులు ఆయన ఆస్తులను అటాచ్ చేయడం.. కైఫ్‌కు న్యాయం చేయాలంటూ ఆయన అనుచరులు నిరసన తెలపడం.. ఈ వార్తలు జాతీయ మీడియాలో రావడంతో క్రికెట్ అభిమానులు తికమకపడ్డారు. షార్ప్‌షూటర్ కైఫ్ స్వస్థలం బిహార్‌లోని శివాన్ జిల్లా కాగా.. ఇదే పేరు గల మహ్మద్ కైఫ్ టీమిండియా మాజీ క్రికెటర్ అన్న సంగతి తెలిసిందే. క్రికెటర్ కైఫ్ షార్ప్‌షూటర్ ఎప్పుడు అయ్యాడని నెటిజెన్లు అయోమయంలో పడ్డారు. కొంతమంది ఇదే విషయాన్ని ట్విట్టర్లో పోస్ట్ చేయగా, కొంతమంది ఏకంగా కైఫ్ ఇంటికి ఫోన్ చేసి ఆరా తీశారు. ఈ విషయం కైఫ్ దృష్టికి రావడంతో వివరణ ఇచ్చాడు. ‘నాకు, నా కుటుంబ సభ్యులకు చాలా మంది ఫోన్లు చేశారు. నా పేరు మహ్మద్ కైఫ్. మీరు అనుకుంటున్న ఆ షార్ప్‌షూటర్ నేను కాను. నేను తుపాకీతో కాల్చను. బంతితో స్టంప్స్‌ను షూట్ చేస్తుంటానంతే. నేను బంతి, బ్యాట్‌తో మాత్రమే ఆడుతా. రంజీ క్రికెట్ సీజన్ కోసం చండీగఢ్‌లో శిక్షణ పొందుతున్నా. దయచేసి గందరగోళం పడవద్దు. ఇందులో సందేహం వద్దు నేను క్రికెటర్‌ను’ అంటూ కైఫ్ చెప్పాడు.