
కన్నీళ్లు పెట్టిన నర్సింగ్ కుటుంబ సభ్యులు
భారత రెజ్లర్ నర్సింగ్ యాదవ్ పై నాలుగేళ్ల నిషేధం విధించడంపై అతడి కుటుంబ సభ్యులు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.
వారణాసి: భారత రెజ్లర్ నర్సింగ్ యాదవ్ పై నాలుగేళ్ల నిషేధం విధించడంపై అతడి కుటుంబ సభ్యులు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ఒలింపిక్స్ లో బరిలో దిగేముందు అతడిపై వేటు వేయడం సరికాదంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. కుట్రకు తన కుమారుడు క్రీడాజీవితం బలైందని నర్సింగ్ తల్లి బుల్నాదేవి వ్యాఖ్యానించారు. తన కొడుకును ఒలింపిక్స్ పాల్గొనకుండా చేయడంపై తనకు మాటలు రావడం లేదని వాపోయారు.
ప్రధాని నరేంద్ర మోదీ తమకు అండగా నిలిచి, తన సోదరుడిపై నిషేధం ఎత్తివేయించాలని నర్సింగ్ సోదరి వేడుకుంది. తన సోదరుడు పోటీకి దిగితే కచ్చితంగా స్వర్ణపతకం గెలుస్తాడని ఆమె విశ్వాసం వ్యక్తం చేసింది. డోపింగ్ వివాదంలో నర్సింగ్ యాదవ్ పై కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్స్ (సీఏఎస్) నాలుగేళ్ల నిషేధం విధించింది.
కాగా, నర్సింగ్ యాదవ్ షాక్ గురయ్యాడని.. అతడు మాట్లాడే పరిస్థితిలో లేడని భారత రెజ్లింగ్ సమాఖ్య(డబ్ల్యూఎఫ్) అధ్యక్షుడు బీబీ శరణ్ తెలిపారు. సీఏఎస్ తీర్పు విన్నప్పటి నుంచి నర్సింగ్ ఏడుస్తూనే ఉన్నాడని వెల్లడించారు.