ఆ పిచ్ 'యాంటీ నేషనలా'?
వరుస విజయాలు, భారీ అంచనాలు, ఫేవరెట్ అన్న ట్యాగ్, హోమ్ గ్రౌండ్‌లో ఆడుతున్న అడ్వాంటేజ్.. ఇన్ని తోడున్న టీమిండియాను అద్భుతమైన పోరాటపటిమతో బోల్తా కొట్టించింది కివీస్ జట్టు. నాగ్‌పూర్‌లోని విదర్భ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో మంగళవారం జరిగిన టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌లో 47 పరుగులతో ధోనీసేనను చిత్తుచేసింది న్యూజిలాండ్ జట్టు. 126 పరుగుల లక్ష్య ఛేదనలో 79 పరుగులకే టీమిండియా చేతులెత్తేయడం భారత అభిమానులను షాక్‌కు గురిచేసింది.
ఈ మ్యాచ్ కోసం స్పిన్ బౌలింగ్‌కు అనుకూలంగా రూపొందిన నాగ్‌పూర్ పిచ్‌పైనా పలు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. హోమ్ టీంకు అనుగుణంగా పిచ్ లేదని కొందరు పెదవి విరుస్తుండగా.. ఇటు ధోనీ సేన చెత్త ప్రదర్శనపై నెటిజన్లు సెటైరికల్ వ్యాఖ్యలతో ట్విట్టర్‌ను ముంచెత్తారు. ప్రపంచంలోనే స్పిన్ ను సమర్థంగా ఎదుర్కొనే జట్టయిన టీమిండియా.. స్పిన్ బౌలింగ్ ను ఎలా ఆడకూడదో చూపిందని పలువురు విమర్శించారు. నాగ్‌పూర్ పిచ్ యాంటీ నేషనల్ అయి ఉంటుందని, అందుకే లక్షఛేదనలో 47 పరుగులకు ముందే టీమిండియాకు కళ్లెం వేసిందని ఒక నెటిజన్ అభిప్రాయపడగా.. పిచ్ క్యూరేటర్ జెఎన్‌యూలో చదివి ఉంటాడని, అందుకే పిచ్ సహకరించలేదని మరో నెటిజన్ చమత్కరించాడు. బీసీసీఐ అంటే 'బోరెడ్ ఆఫ్ క్రికెట్ కొలాప్స్ ఇన్ ఇండియా' అని ఒకరు నిర్వచనమివ్వగా.. ఈ ఓటమికి శిక్షగా ఆటగాళ్లకు 'తేరా సురూర్' సినిమాను బీసీసీఐ చూపించాలంటూ మరో నెటిజన్ సెటైర్ వేశారు.