
లండన్: టెస్టు క్రికెట్ చరిత్రలో మరో అపురూపమైన ఘట్టానికి తెరలేవబోతోంది. వచ్చే నెలలో ఆస్ట్రేలియా-ఇంగ్లండ్ జట్ల మధ్య ఆరంభమయ్యే ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్‌లో ఇరు జట్ల ఆటగాళ్లు తమ తమ జెర్సీలపై పేర్లు, నంబర్లతో కనిపించనున్నారు. ఇలా ఆటగాళ్లు తమ జెర్సీలపై పేర్లు, నంబర్లతో కనిపిండం టెస్టు క్రికెట్ చరిత్రలో ఇదే తొలిసారి. సాధారణంగా వన్డేల్లో ఆటగాళ్లు వేసుకునే జెర్సీలపై పేర్లు ముద్రించబడి ఉంటాయి. వీటితో పాటు వారు ఎంచుకున్న జెర్సీ నెంబర్లు కూడా ఉంటాయి. జెర్సీపై ఉన్న నంబర్‌ను బట్టి ఆ ఆటగాడు ఎవరో ఇట్టే చెప్పేస్తారు క్రికెట్ అభిమానులు.(ఇక్కడ చదవండి: ఐసీసీ కీలక నిర్ణయం యాషెస్ నుంచే అమలు!)
అయితే, టెస్టుల్లో మాత్రం ఇందుకు భిన్నం. టెస్టు క్రికెట్ చరిత్రలో ఏ మ్యాచ్‌లో కూడా ఆటగాళ్ల జెర్సీలపై పేర్లు, అంకెలు కనిపించింది లేదు. టెస్టుల్లో ఆడే ఆటగాళ్లు కేవలం తెలుపు లేదా గోధుమ రంగు జెర్సీలు ధరిస్తారు. జెర్సీ వెనుక భాగంలో ఖాళీగా ఉంటుంది తప్ప, నంబర్లు ఉండవు. కాగా, యాషెస్ సిరీస్‌తో సరికొత్త సంప‍్రదాయానికి తెరలేపారు. ఇరు క్రికెట్ బోర్డులు ఒప్పందంతో యాషెస్‌లో పేర్లు, నంబర్లతో ఆటగాళ్లు బరిలోకి దిగనున్నారు. దీనికి సంబంధించి జో రూట్ ధరించిన టెస్టు జెర్సీపై నంబర్, పేరుతో ఉన్న ఫొటోను ఇంగ్లండ్ క్రికెట్ బోర్డు తన ట్వీటర్ అకౌంట్‌లో పోస్ట్ చేసింది.
Names and numbers on the back of Test shirts! 🏴🏏 pic.twitter.com/M660T2EI4Z
— England Cricket (@englandcricket) July 22, 2019