
పంజగుట్ట: క్రికెట్ మ్యాచ్‌లో క్రీడాకారులు కొంతమంది మాత్రమే బ్యాటింగ్ చేసి మరొ కొంతమందికి ఎంతో ప్రతిభ ఉన్నప్పటికీ బ్యాటింగ్ చేయలేకపోతున్నారని అందరికీ సమాన అవకాశాలు కల్పించడానికే ‘సూధన ఫార్మాట్ ఆఫ్ క్రికెట్’ పేరుతో కొత్త ఫార్మాట్ రూపొందించినట్లు క్రీడాకారులు, రిటైర్డ్ వెటర్నరీ డాక్టర్ సూధన వెంకయ్య తెలిపారు. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో మాట్లాడుతూ స్వతహాగా తాను క్రికెట్‌తో పాటు పలు క్రీడలు ఆడుతానన్నారు. ఇటీవల క్రికెట్‌లో ఎన్నో మార్పులు వస్తున్నాయని, ముఖ్యంగా టీ 20 మ్యాచ్‌లో చివరి ఆటగాళ్లకు బ్యాటింగ్ అవకాశం దక్కడం లేదన్నారు.
ఒక్కో టీంలో 11 మంది సభ్యులు ఉంటే కేవలం ఒకటి నుంచి నలుగురు మాత్రమే బ్యాటింగ్ చేసి అన్ని ఓవర్లు వారే ఆడుతుండడంతో మిగతా ఆటగాళ్లు అవకాశం దక్కక తమ ప్రతిభను చూపలేకపోతున్నారన్నారు. అందుకే తాను ప్రత్యేక ఫార్మాట్ రూపొందించినట్లు తెలిపారు. ఈ నెల 25న సాగర్‌రోడ్డు గుర్రంగుడలోని జీఎన్‌ఆర్ క్రికెట్ అకాడమీలో టీ 20 పోటీని నిర్వహిస్తున్నామన్నారు. ఈ పోటీలో ప్రతి ఆటగాడికి 12 బంతులు ఆడే అవకాశం వస్తుందన్నారు. క్రీడాకారుడు మొదటి బంతిలోనే అవుట్ అయినప్పటికీ తప్పనిసరిగా 12 బంతులు ఆడాల్సిందేనని, వీరు 20 ఓవర్లలో కొట్టిన స్కొర్‌ను ఎదుటి జట్టు చేధిస్తే వారు విజేతలుగా నిలుస్తారన్నారు. రెండు టీంలు పోటీల్లో పాల్గొంటాయని, అందరికీ సమాన అవకాశాలు కల్పించేందుకే ఈ ఫార్మాట్‌ను ట్రయల్ బేస్‌పై పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. ఇది విజయవంతమైతే రానున్న రోజుల్లో మరికొన్ని టీంలను కలిపి పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. తమ ఫార్మాట్‌కు కాపీరైట్స్ అనుమతి కూడా తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.
మాట్లాడుతున్న వెంకయ్య
Comments
Please login to add a commentAdd a comment