మౌంట్ మాంగనీ: అంతర్జాతీయ టీ 20 క్రికెట్‌లో న్యూజిలాండ్ సరికొత్త రికార్డు సృష్టించింది. వెస్టిండీస్‌తో బుధవారం జరిగిన చివరిదైన మూడో టీ 20లో 119 పరుగుల తేడాతో గెలిచి కొత్త అధ్యాయాన్ని లిఖించింది. టెస్టు సభ్యత్వం కల్గిన దేశాల వారీగా చూస్తే టీ 20ల్లో కివీస్ సాధించిందే(పరుగులు పరంగా)అతి పెద్ద విజయం. తద్వారా ఐదేళ్ల క్రితం ఇంగ్లండ్ సాధించిన రికార్డును కివీస్ బద్దలుకొట్టింది. 2012లో అఫ్గానిస్తాన్‌పై ఇంగ్లండ్ 116 పరుగులతో గెలుపొందింది. ఇదే ఇప్పటివరకూ అత్యధిక పరుగుల టీ 20 విజయం కాగా, దాన్ని తాజాగా కివీస్ సవరించింది. ఇదిలా ఉంచితే, ఓవరాల్ అత్యధిక పరుగుల విజయం శ్రీలంక పేరిట లిఖించబడి ఉంది. 2007లో కెన్యాపై లంకేయులు 172 పరుగుల తేడాతో విజయాన్ని అందుకున్నారు. అయితే కెన్యాకు ఇక్కడ టెస్టు హోదా లేదు.
నిన్నటి మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 243 పరుగులు సాధించింది. కొలిన్ మున్రో సెంచరీతో చెలరేగడంతో న్యూజిలాండ్ భారీ స్కోరు నమోదు చేసింది. ఆపై బ్యాటింగ్‌కు దిగిన వెస్టిండీస్ 124 పరుగులకే ఆలౌటై ఘోర ఓటమిని మూటగట్టుకుంది. దాంతో సిరీస్‌ను కివీస్ 2-0తో కైవసం చేసుకుంది. రెండో టీ 20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దయిన సంగతి తెలిసిందే. ఇంతకుముందు టెస్టు, వన్డే సిరీస్‌లు కూడా న్యూజిలాండ్ ఖాతాలోకే వెళ్లడం విశేషం. దాంతో 1999–2000 తర్వాత తొలిసారి విండీస్ జట్టు న్యూజిలాండ్ గడ్డపై ఒక్క విజయం నమోదు చేయకుండానే వెనుదిరిగింది.
Comments
Please login to add a commentAdd a comment