WI Vs NZ 3rd T20I: West Indies Tops New Zealand In 3rd T20, Avoid Series Sweep - Sakshi
Sakshi News home page

WI VS NZ 3rd T20: ఎట్టకేలకు ఓ విజయం.. వైట్‌వాష్‌ అవమానాన్ని తప్పించుకున్న విండీస్‌

Published Mon, Aug 15 2022 11:05 AM | Last Updated on Mon, Aug 15 2022 11:26 AM

West Indies Tops New Zealand In 3rd T20, Avoid Series Sweep - Sakshi

ఇటీవలి కాలంలో వరుస వైట్‌వాష్‌ పరాభవాలను ఎదుర్కొంటున్న వెస్టిండీస్‌ జట్టు.. మరోసారి ఆ అవమానం బారిన పడకుండా గట్టెక్కింది. న్యూజిలాండ్‌తో స్వదేశంలో జరగుతున్న టీ20 సిరీస్‌లో ఆ జట్టు ఎట్టకేలకు ఓ ఓదార్పు విజయాన్ని అందుకుంది. న్యూజిలాండ్‌ ఇదివరకే 2-0 తేడాతో సిరీస్‌ను కైవసం చేసుకోవడంతో నామమాత్రంగా సాగిన ఆఖరి టీ20లో కరీబియన్‌ జట్టు 8 వికెట్ల తేడాతో గెలుపొందింది.

టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌.. ఓడియన్‌ స్మిత్‌ (3/29), అకీల్‌ హొసేన్‌ (2/28), డోమినిక్‌ డ్రేక్స్‌ (1/19), హేడెన్‌ వాల్ష్‌ (1/16) చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 145 పరుగుల నామమాత్రపు స్కోర్‌కే పరిమితమైంది. కివీస్‌ ఇన్నింగ్స్‌లో గ్లెన్‌ ఫిలిప్‌ (26 బంతుల్లో 41; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) ఒక్కడే చెప్పుకోదగ్గ స్కోర్‌ చేశాడు. ఛేదనలో ఓపెనర్లు బ్రాండన్‌ కింగ్‌ (35 బంతుల్లో 53; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), షమార్‌ బ్రూక్స్‌ (59 బంతుల్లో 56 నాటౌట్‌; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధశతకాలతో చెలరేగడంతో విండీస్‌ 19 ఓవర్లలో కేవలం రెండే వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. ఆఖర్లో కెప్టెన్‌ రోవ్‌మన్‌ పావెల్‌ (15 బంతుల్లో 27 నాటౌట్‌; 2 ఫోర్లు, 2 సిక్సర్లు) వరుస ఓవర్లలో సిక్సర్లతో విరుచుకుపడి విండీస్‌ను విజయతీరాలకు చేర్చాడు.

ఫలితంగా విండీస్‌ 3 మ్యాచ్‌ల ఈ సిరీస్‌ను 1-2 తేడాతో ముగించింది. కివీస్‌ బౌలర్లలో టిమ్‌ సౌథీ, ఐష్‌ సోధీకి తలో వికెట్‌ దక్కింది. సిరీస్‌ మొత్తంలో 5 అద్భుతమైన క్యాచ్‌లతో పాటు ఓ హాఫ్‌ సెంచరీ సహా 100కిపైగా పరుగులు సాధించిన గ్లెన్‌ ఫిలిప్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ద సిరీస్‌ అవార్డు దక్కగా.. ఈ మ్యాచ్‌లో సుడిగాలి హాఫ్‌ సెంచరీతో చెలరేగిన బ్రాండన్‌ కింగ్‌ను ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు వరించింది.

ఇదిలా ఉంటే, ఈ సిరీస్‌కు ముందు విండీస్‌ టీమిండియా చేతిలో 0-3 తేడాతో వన్డే సిరీస్‌ను, 1-4 తేడాతో టీ20 సిరీస్‌ను, అంతకుముందు స్వదేశంలోనే బంగ్లాదేశ్‌ చేతిలో 0-3 తేడాతో వన్డే సిరీస్‌ను, పాక్‌ గడ్డపై 0-3 తేడాతో వన్డే సిరీస్‌ను కోల్పోయిన విషయం తెలిసిందే. విండీస్‌-న్యూజిలాండ్‌ జట్ల మధ్య 3 మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ ఆగస్ట్‌ 17 నుంచి ప్రారంభం కానుంది. బార్బడోస్‌ వేదికగా ఆగస్ట్‌ 17న తొలి వన్డే, 19న రెండో వన్డే, 21న ఆఖరి వన్డే జరుగనుంది.  
చదవండి:  వెస్టిండీస్‌తో వన్డే సిరీస్‌.. న్యూజిలాండ్‌కు బిగ్‌ షాక్‌!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement