కివీస్ 'సెంచరీల' రికార్డు!
మౌంట్ మాన్గాని:న్యూజిలాండ్ క్రికెట్ జట్టు సరికొత్త రికార్డు నమోదు చేసింది. శుక్రవారం ఇక్కడ బంగ్లాదేశ్తో జరిగిన రెండో ట్వంటీ 20 లో కివీస్ ఆటగాడు కొలిన్ మున్రో(101) శతకం సాధించాడు. 54 బంతుల్లో 7 ఫోర్లు, 7 సిక్సర్లు సాయంతో సెంచరీ పూర్తి చేశాడు. తద్వారా ట్వంటీ 20 చరిత్రలో అత్యధిక సెంచరీలు సాధించిన జట్టుగా న్యూజిలాండ్ నిలిచింది.
ఈ తాజా సెంచరీతో న్యూజిలాండ్ ట్వంటీ 20ల్లో నాలుగు శతకాలను నమోదు చేసింది. అంతకుముందు మూడేసి సెంచరీలు మాత్రమే పలు జట్లు నమోదు చేశాయి. ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్, భారత్ జట్లు మూడేసి సెంచరీలు చొప్పున సాధించగా, దాన్ని కివీస్ అధిగమించింది. న్యూజిలాండ్ క్రికెట్ జట్టులో మెకల్లమ్ రెండు ట్వంటీ 20 సెంచరీలు చేయగా, గప్టిల్, మున్రోలు తలో సెంచరీ చేశారు.
ఈ మ్యాచ్లో న్యూజిలాండ్ గెలిచి సిరీస్ను 2-0 తేడాతో కైవసం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత ఓవర్లలో ఏడు వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేపట్టిన బంగ్లాదేశ్ 18.1 ఓవర్లలో148 పరుగులకే ఆలౌటై 47 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. దాంతో ఇంకో మ్యాచ్ మిగిలి ఉండగానే బంగ్లాదేశ్ సిరీస్ను కోల్పోయింది.