చెలరేగిన అండర్సన్
మౌంట్ మాన్గాని:బంగ్లాదేశ్ తో జరిగిన చివరిదైన మూడో ట్వంటీ 20 న్యూజిలాండ్ ఆటగాడు కోరీ అండర్సన్ చెలరేగిపోయాడు. 41 బంతుల్లో 10 సిక్సర్లు, 2 ఫోర్లతో 94 పరుగులు నమోదు చేసి అజేయంగా నిలిచాడు. తద్వారా తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 27 పరుగుల తేడాతో మ్యాచ్ గెలిచి సిరీస్ను క్లీన్స్వీప్ చేసింది. అంతకుముందు కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్(60) బాధ్యతాయుతంగా ఆడటంతో న్యూజిలాండ్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది.
అనంతరం భారీ లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన బంగ్లాదేశ్ 20.0 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసి ఓటమి పాలైంది. బంగ్లా ఆటగాళ్లలో తమిమ్ ఇక్బాల్(24) మోస్తరుగా ఫర్వాలేదనిపించగా, సౌమ్య సర్కార్(42), షకిబుల్ హసన్(41)లు రాణించారు. అయితే లక్ష్యం ఎక్కువగా ఉండటంతో బంగ్లాదేశ్ కు పరాజయం తప్పలేదు. న్యూజిలాండ్ బౌలర్లలో బోల్ట్, సౌథీలకు తలో రెండు వికెట్లు లభించగా,సాంట్నార్, విలియమ్సన్లకు చెరో వికెట్ దక్కింది.