క్లీన్స్వీప్ ల హ్యాట్రిక్!
క్రిస్ట్ చర్చ్: స్వదేశంలో బంగ్లాదేశ్తో జరిగిన మూడు క్రికెట్ సిరీస్లను న్యూజిలాండ్ క్లీన్ స్వీప్లతో ముగించింది. బంగ్లాదేశ్ తో తొలుత మూడు వన్డేల సిరీస్ను, మూడు ట్వంటీ 20 ల సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసిన న్యూజిలాండ్.. ఆపై రెండు టెస్టుల సిరీస్ను కూడా వైట్ వాష్ చేసింది. తద్వారా ఈ టోర్నీలో న్యూజిలాండ్ వరుసగా ఎనిమిది విజయాల్ని తన ఖాతాలో వేసుకోగా, బంగ్లాదేశ్ ఒక్క విజయాన్ని చూడకుండానే ఇంటి దారి పట్టింది. సోమవారం ముగిసిన చివరిదైన రెండో టెస్టులో న్యూజిలాండ్ 9 వికెట్ల తేడాతో విజయం సాధించి తమకు తిరుగులేదని నిరూపించింది. బంగ్లాదేశ్ విసిరిన 109 పరుగుల లక్ష్యాన్ని న్యూజిలాండ్ వికెట్ కోల్పోయి ఛేదించింది. రావల్(33) వికెట్ ను కివీస్ కోల్పోయినా, లాథమ్(41 నాటౌట్), గ్రాండ్ హోమ్(33నాటౌట్) లు మిగతా పనిని పూర్తి చేశారు.
ఈ రోజు ఆటలో తొలుత బంగ్లాదేశ్ ను రెండో ఇన్నింగ్స్ లో 173 పరుగులకు ఆలౌట్ చేసిన కివీస్.. ఆపై ఆడుతు పాడుతూ విజయాన్ని అందుకుని 2-0 తేడాతో టెస్టు సిరీస్ ను కైవసం చేసుకుంది. ఆదివారం మూడో రోజు వర్షం కారణంగా బంతి కూడా పడకుండానే మ్యాచ్ రద్దు కాగా, నాల్గో రోజు న్యూజిలాండ్ జూలు విదిల్చింది. అటు బౌలింగ్ లోనూ, ఇటు బ్యాటింగ్ లోనూ రాణించిన కివీస్.. బంగ్లాదేశ్ ను ఏ దశలోనూ కోలుకోనీయలేదు. బంగ్లాదేశ్ రెండో ఇన్నింగ్స్ లో సౌమ్య సర్కార్(36), మొహ్మదుల్లా(38), తస్కిన్ అహ్మద్(33),ఇస్లామ్ అబీ(25 నాటౌట్)లు మోస్తరుగా ఫర్వాలేదనిపించారు. న్యూజిలాండ్ బౌలర్లలో బౌల్ట్, సౌతీ,వాగ్నర్లు తలో మూడు వికెట్లు తీసి బంగ్లా పతనాన్ని శాసించారు.
బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్ 289 ఆలౌట్, రెండో ఇన్నింగ్స్ 173 ఆలౌట్
న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ 354 ఆలౌట్, రెండో ఇన్నింగ్స్ 111/1(18.4 ఓవర్లలో)