నల్ల రిబ్బన్‌లతో న్యూజిలాండ్ ఆటగాళ్లు
నాగ్పూర్:
టీ20 ప్రపంచకప్ ఆరంభ మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఆటగాళ్లు తమ భుజాలకు నల్ల రిబ్బన్‌లు ధరించి బరిలోకి దిగారు. తమ క్రికెట్ దిగ్గజం మార్టిన్ క్రో మృతికి నివాళిగా వారు ఈ నిర్ణయం తీసుకున్నారు. సుదీర్ఘకాలం క్యాన్సర్‌తో పోరాడిన 53 ఏళ్ల మార్టిన్ క్రో ఈనెల 3న మరణించిన విషయం విదితమే.
13 ఏళ్ల పాటు కివీస్‌కు ప్రాతినిధ్యం వహించిన క్రో వరుస గాయాలతో 33 ఏళ్లకే 1995లో రిటైర్మెంట్ ప్రకటించారు. 80ల్లో ప్రపంచంలోని అత్యుత్తమ ఫాస్ట్ బౌలర్లను సమర్థంగా ఎదుర్కొని భారీగా పరుగులు సాధించిన క్రో, నాడు న్యూజిలాండ్ చారిత్రక విజయాల్లో కీలక పాత్ర పోషించారు. న్యూజిలాండ్ తరఫున టెస్టుల్లో అత్యధిక పరుగుల రికార్డు చాలా ఏళ్లు క్రో పేరిటే ఉండగా, అత్యధిక సెంచరీల రికార్డు (17) ఇంకా కొనసాగుతోంది. మార్టిన్ క్రో అనగానే ఈతరం అభిమానులకు కూడా గుర్తొచ్చేది 1992 ప్రపంచకప్. బ్యాటింగ్‌లో అదరగొట్టడమే కాకుండా పించ్ హిట్టర్, స్పిన్నర్‌తో బౌలింగ్ ప్రారంభించడంలాంటి అపూర్వ వ్యూహాలతో టోర్నీకి ఆయన కొత్త కళ తెచ్చారు.