
'రవిశాస్త్రి, కుంబ్లేల కోరిక ఒకటే'
న్యూఢిల్లీ: భారత క్రికెట్ జట్టుకు ప్రధాన కోచ్గా మాజీ స్పిన్నర్ అనిల్ కుంబ్లే ఎంపిక కావడాన్ని ఆల్ రౌండర్ స్టువర్ట్ బిన్నీ స్వాగతించాడు. భారత క్రికెట్ జట్టుకు గెలుపే లక్ష్యంగా టీమిండియా మాజీ డైరెక్టర్ రవిశాస్త్రి ఎలా పని చేశాడో.. ఇప్పుడు కుంబ్లే కూడా అదే కోరికతో పని చేయడం ఖాయమన్నాడు. వీరిద్దరూ జట్టు విజయమే లక్ష్యమే పని చేస్తారన్నాడు. దీంతో పెద్ద వ్యత్యాసం ఏమీ ఉండదని స్టువర్ట్ బిన్నీ అభిప్రాయపడ్డాడు. త్వరలో వెస్టిండీస్ పర్యటనకు వెళ్లనున్న భారత జట్టు ప్రస్తుతం ప్రాక్టీస్ సెషన్లో పాల్గొంటుంది.
ఆ ప్రాక్టీస్ సెషన్లో సానుకూల ధోరణిలో ఉండాలన్నదే కుంబ్లే నుంచి నేర్చుకున్న తొలిపాఠంగా బిన్నీ తెలిపాడు. తమకు ఇంకా సాంకేతికపరమైన విషయాలు ఏమీ కుంబ్లే చెప్పలేదని, కేవలం విండీస్ టూర్కు ఆత్మస్థైర్యాన్ని కూడగట్టే యత్నం మాత్రమే ఆ మాజీ ఆటగాడు చేస్తున్నారన్నాడు. రంజీ ట్రోఫీలు ఆడినప్పట్నుంచి తనకు అనిల్ తెలుసని, అందుచేత తన గేమ్పై అనిల్కు పూర్తి అవగాహన ఉంటుందని స్టువర్ట్ బిన్నీ తెలిపాడు.