దోహా: సాధారణంగా ప్రధాన ఈవెంట్‌లలో పతకాలు సాధించిన అథ్లెట్లకు ఆ దేశ జాతీయ గీతంతో గౌరవాన్ని ఇస్తారు. అదే సమయంలో సదరు అథ్లెట్ జాతీయ జెండాను తన ఒంటిపై వేసుకోవడం చూస్తూ ఉంటాం. కాకపోతే ఐఏఏఎఫ్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో పాల్గొన్న రష్యాకు చెందిన పోల్ వాల్టర్ అంజెలికా సిదోరోవా పసిడి పతకం సాధించినా ఆమెకు జాతీయ గౌరవం దక్కలేదు. అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భాగంగా ఆదివారం జరిగిన పోటీలో సిదోరోవా 4.95 మీటర్లు ఎత్తు ఎగిరి స్వర్ణాన్ని సాధించారు. అయినప్పటికీ ఆమెకు దక్కాల్సిన గౌరవానికి దూరంగా ఉండిపోయింది. కనీసం పతకం సాధించిన తర్వాత జాతీయ జెండాతో ఆనందాన్ని పంచుకోవడానికి కూడా నోచుకోలేదు.
ఇక్కడ రజత, కాంస్య పతకాలు సాధించిన వారు మాత్రం తమ జాతీయ జెండాలతో మైదానమంతా కలియ తిరిగితే సిదోరోవా మాత్రం కేవలం చప్పట్లతోనే సంతోషాన్ని పంచుకున్నారు. ఇందుకు కారణంగా రష్యన్ అథ్లెట్లపై గత నాలుగేళ్లుగా డోపింగ్ ఆరోపణలు చుట్టముట్టడమే. అప్పట్నుంచి రష్యన్ అథ్లెట్లపై నిషేధాన్ని వాడా పెంచుకుంటూ పోతుంది. అయితే ప్రస్తుత అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో రష్యన్ అథ్లెట్లు బరిలోకి దిగడానికి అనుమతి ఇచ్చినా వారి జాతీయ జెండాలను దూరం పెట్టాలని నిబంధనతో పాటు పతకాలు సాధించిన క్రమంలో ఆ దేశం జాతీయ గీతాన్ని సైతం ఆలపించరాదనే నియమాన్ని పెట్టింది.
ఈ క్రమంలోనే సిదోరోవా పసిడితో మెరిసినా ఆమెకు తటస్థ అథ్లెట్‌గానే మిగిలిపోయింది. ఈ పోల్ వాల్ట్ పోరులో అమెరికాకు చెందిన శాండి మోరిస్ రజతం సాధించగా, గ్రీస్ దేశానికి చెందిన ఏకాతెరిణి స్టిఫనిది కాంస్యం సాధించారు. దీనిపై సిదోరోవా మాట్లాడుతూ.. ‘స్వర్ణం అనేది స్వర్ణమే. నేను పసిడిని సాధించినందుకు సంతోషంగా ఉన్నా. నాకు దక్కాల్సిన గౌరవం దక్కలేదు. అయినా స్వర్ణం సాధించడం చాలా ఆనందాన్ని కల్గిస్తుంది’ అని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment