IAAF
-
గోల్డ్ గెలిచినా.. జాతీయ గౌరవం లేదు!
దోహా: సాధారణంగా ప్రధాన ఈవెంట్లలో పతకాలు సాధించిన అథ్లెట్లకు ఆ దేశ జాతీయ గీతంతో గౌరవాన్ని ఇస్తారు. అదే సమయంలో సదరు అథ్లెట్ జాతీయ జెండాను తన ఒంటిపై వేసుకోవడం చూస్తూ ఉంటాం. కాకపోతే ఐఏఏఎఫ్ వరల్డ్ చాంపియన్‌షిప్‌లో పాల్గొన్న రష్యాకు చెందిన పోల్ వాల్టర్ అంజెలికా సిదోరోవా పసిడి పతకం సాధించినా ఆమెకు జాతీయ గౌరవం దక్కలేదు. అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో భాగంగా ఆదివారం జరిగిన పోటీలో సిదోరోవా 4.95 మీటర్లు ఎత్తు ఎగిరి స్వర్ణాన్ని సాధించారు. అయినప్పటికీ ఆమెకు దక్కాల్సిన గౌరవానికి దూరంగా ఉండిపోయింది. కనీసం పతకం సాధించిన తర్వాత జాతీయ జెండాతో ఆనందాన్ని పంచుకోవడానికి కూడా నోచుకోలేదు. ఇక్కడ రజత, కాంస్య పతకాలు సాధించిన వారు మాత్రం తమ జాతీయ జెండాలతో మైదానమంతా కలియ తిరిగితే సిదోరోవా మాత్రం కేవలం చప్పట్లతోనే సంతోషాన్ని పంచుకున్నారు. ఇందుకు కారణంగా రష్యన్ అథ్లెట్లపై గత నాలుగేళ్లుగా డోపింగ్ ఆరోపణలు చుట్టముట్టడమే. అప్పట్నుంచి రష్యన్ అథ్లెట్లపై నిషేధాన్ని వాడా పెంచుకుంటూ పోతుంది. అయితే ప్రస్తుత అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో రష్యన్ అథ్లెట్లు బరిలోకి దిగడానికి అనుమతి ఇచ్చినా వారి జాతీయ జెండాలను దూరం పెట్టాలని నిబంధనతో పాటు పతకాలు సాధించిన క్రమంలో ఆ దేశం జాతీయ గీతాన్ని సైతం ఆలపించరాదనే నియమాన్ని పెట్టింది. ఈ క్రమంలోనే సిదోరోవా పసిడితో మెరిసినా ఆమెకు తటస్థ అథ్లెట్‌గానే మిగిలిపోయింది. ఈ పోల్ వాల్ట్ పోరులో అమెరికాకు చెందిన శాండి మోరిస్ రజతం సాధించగా, గ్రీస్ దేశానికి చెందిన ఏకాతెరిణి స్టిఫనిది కాంస్యం సాధించారు. దీనిపై సిదోరోవా మాట్లాడుతూ.. ‘స్వర్ణం అనేది స్వర్ణమే. నేను పసిడిని సాధించినందుకు సంతోషంగా ఉన్నా. నాకు దక్కాల్సిన గౌరవం దక్కలేదు. అయినా స్వర్ణం సాధించడం చాలా ఆనందాన్ని కల్గిస్తుంది’ అని అన్నారు. -
పాల్గొంది ఐదుగురు... అందరూ డిస్క్వాలిఫై!
బర్మింగ్‌హామ్: అదో ప్రతిష్టాత్మక ఈవెంట్... గోల్డ్ మెడల్ ఫేవరెట్ సహా స్టార్ అథ్లెట్లందరూ బరిలోకి దిగారు. అయితే హీట్స్‌లోనే వీరంతా అనర్హతకు గురయ్యారు. విశేషం ఏమిటంటే ఐదుగురు అథ్లెట్లు ఈ హీట్స్‌లో పాల్గొనగా వేర్వేరు కారణాలతో వీరందరూ డిస్క్వాలిఫై కావడం! వరల్డ్ ఇండోర్ అథ్లెటిక్స్ పురుషుల 400 మీటర్ల విభాగంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గత ఏడాది ఈ విభాగంలో అత్యుత్తమ టైమింగ్ నమోదు చేసిన బ్రలోన్ టాప్లిన్ (గ్రెనడా) కూడా డిస్క్వాలిఫయర్స్ జాబితాలో ఉన్నాడు. లైన్ తప్పి పరుగెత్తడంతో బ్రలోన్తో పాటు స్టీవెన్ గేల్ (జమైకా), ఆస్ట్రిస్ కార్పిన్స్కిస్ (లాత్వియా), అలోంజో రసెస్ (బహమాస్)లపై అనర్హత వేటు పడింది. అంతకు ముందే అబ్దుల్లా హరూన్ (ఖతార్) ఫాల్స్ స్టార్ట్‌తో డిస్క్వాలిఫై అయ్యాడు. వీరిలో ఇద్దరు అప్పీల్ చేసినా లాభం లేకపోయింది. ఒక మేజర్ చాంపియన్‌షిప్‌లో హీట్స్‌లో పాల్గొన్న అందరూ అనర్హతకు గురి కావడం చరిత్రలో ఇదే మొదటిసారి అని స్వయంగా అంతర్జాతీయ అథ్లెటిక్స్ సమాఖ్య (ఐఏఏఎఫ్) ప్రకటించడం విశేషం. -
రష్యాపై నిషేధం పొడిగింపు
లండన్ ప్రపంచ చాంపియన్‌షిప్‌కు దూరం పారిస్: డోపింగ్ కారణంగా రష్యా అథ్లెటిక్స్ సమాఖ్యపై కొనసాగుతున్న నిషేధాన్ని అంతర్జాతీయ అథ్లెటిక్స్ సమాఖ్య (ఐఏఏఎఫ్) పొడిగించింది. ఈమేరకు ఐఏఏఎఫ్ చేసిన ప్రతిపాదనను పాలక మండలి కౌన్సిల్ ఆమోదించింది. దీంతో ఆగస్టులో లండన్‌లో జరిగే ప్రపంచ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌కు రష్యా అథ్లెట్లు దూరం కానున్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలోనే రష్యా అథ్లెట్లు డోపింగ్‌కు పాల్పడుతున్నారని తేలడంతో 2015 నవంబర్ నుంచి అంతర్జాతీయ ఈవెంట్స్‌లో పాల్గొనకుండా ఆ దేశాన్ని నిషేధించిన విషయం తెలిసిందే. అయితే గత డిసెంబర్లో జరిగిన పాలక మండలి సమావేశం అనంతరం మరికొంత అనుమానాస్పద సంఘటనలు జరిగాయని అందుకే వారి సభ్యత్వ పునరుద్ధరణపై వెనక్కి తగ్గామని ఐఏఏఎఫ్ కౌన్సిల్ పేర్కొంది. -
నీరజ్ భారత 'బంగారం'
► జావెలిన్ త్రోలో ప్రపంచ రికార్డు ► అథ్లెటిక్స్‌లో ఓ భారతీయుడికి తొలిసారి స్వర్ణం బెంగళూరు: అథ్లెటిక్స్ లో భారత్ సాధారణంగా ఏదైనా ట్రాక్ లో మెరుగైన ఫలితాలు సాధిస్తేనే గొప్ప విషయంగా భావిస్తుంటాం. కానీ 'జావెలిన్ త్రో'లో హరియాణాకు చెందిన నీరజ్ చోప్రా ప్రపంచ రికార్డులు తిరగరాశాడు. పోలెండ్‌లో జరుగుతున్న ఐఏఏఎఫ్ వరల్డ్ అండర్-20 అథ్లెటిక్ ఛాంపియన్‌షిప్‌లో 86.48 మీటర్లు జావెలిన్ విసిరి నీరజ్ చోప్రా స్వర్ణం నెగ్గాడు. స్వర్ణం నెగ్గడంతో పాటు ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. దక్షిణాఫ్రికాకు చెందిన జోహాన్ గ్రాబ్లర్, గ్రెనెడా ఆటగాడు అండర్సన్ పీటర్స్ వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచారు. గ్రాబ్లర్ 80.59 మీటర్లు విసిరి రజతం సొంతం చేసుకోగా, అండర్సన్ 79.65 మీటర్ల దూరం జావెలిన్ విసిరి కాంస్యం చేజిక్కుంచుకున్నాడు. మొదటి ప్రయత్నంలో నీరజ్ 79.66 మీటర్లు జావెలిన్ విసరగా, గ్రాబ్లర్ 80.59మీటర్ల దూరం విసిరాడు. దీంతో రెండో ప్రయత్నంలో 86.48 మీటర్లు విసిరి ఏకంగా ప్రపంచ రికార్డును సవరించాడు. గతంలో ఈ రికార్డు లాత్వియాకు చెందిన జిగిస్మండ్స్ సిర్మాయిస్ పేరిట ఉండేది. 2011లో సిర్మాయిస్ విసిరిన 84.69 మీటర్లే ఇప్పటివరకూ అత్యధికం. మూడో ప్రయత్నంలో 78.36 మీటర్లు విసిరిన నీరజ్, చివరి ప్రయత్నంలో ఫౌల్ అయ్యాడు. మరిన్ని అంశాలు: ఐఏఏఎఫ్ వరల్డ్ అండర్-20 అథ్లెటిక్ ఛాంపియన్‌షిప్‌లో 86.48 మీటర్లు జావెలిన్ విసిరి నీరజ్ చోప్రా స్వర్ణం నెగ్గాడు. నీరజ్‌కు, రెండో స్థానంలో నిలిచిన గ్రాబ్లర్కు జావెలిన్ తేడా దాదాపు 6 మీటర్లు ఉండటం విశేషం. లండన్ ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలిచిన ప్లేయర్ 84.58 మీటర్లు జావెలిన్ విసిరాడు. ప్రపంచ రికార్డు నెలకొల్పిన నీరజ్ రియో ఒలింపిక్స్‌కు అర్హత సాధించలేదు. ఇటీవల వార్సాలో జరిగిన ఒలింపిక్స్ అర్హత టోర్నీలో నీరజ్ త్రుటిలో స్వర్ణం కోల్పోయాడు. 79.73 మీటర్లతో రజతం నెగ్గాడు. స్వర్ణం చేజిక్కుంచుకుని ఉంటే ఒలింపిక్స్‌లో పాల్గొనేవాడు. 14 ఏళ్ల వయసులోనే 68.4 మీటర్ల దూరం జావెలిన్ విసిరి నేషనల్ రికార్డు బద్దలుకొట్టాడు. గతేడాది డిసెంబర్ లో పాటియాలలో జరిగిన ఇంటర్ వర్సిటీ చాంపియన్‌షిప్ లో 81.04మీటర్లు విసిరి జాతీయ రికార్డులతో పాటు ప్రపంచ రికార్డుకు చేరువయ్యాడు. 2002లో సీమా ఆంటిల్, రెండేళ్ల కిందట నవజీత్ కౌర్ థిల్లాన్ కూడా రజతం సాధించారు. భారత్ తరఫున స్వర్ణం నెగ్గిన తొలి జావెలిన్ త్రోయర్గానూ నీరజ్ సంచలనం సృష్టించాడు.