రహానేను తప్పించడమా!
ప్రతీ విజయయాత్రకు ఎక్కడో ఒక చోట విరామం తప్పదని, అన్ని మ్యాచ్‌లు గెలవడం సాధ్యం కాదని భారత జట్టు కోచ్ అనిల్ కుంబ్లే వ్యాఖ్యానించారు. పుణే ఫలితం ఇప్పుడు గతమని, జట్టు కోచ్‌గా తాను భవిష్యత్తుపైనే దృష్టి పెడతానని ఆయన అన్నారు. ‘మేం మా స్థాయికి తగినట్లుగా ఆడలేదు కాబట్టే ఓడిపోయాం. అలాంటి తప్పు ఇక్కడ జరగకుండా జాగ్రత్త పడతాం. జరిగినదాని గురించి చర్చ అనవసరం. సిరీస్‌లో మరో మూడు టెస్టులు ఉన్నాయి. ఆస్ట్రేలియా మెరుగైన జట్టే అనే విషయం మరచిపోవద్దు. ఈ టెస్టులో ఎలా విజయం సాధించాలనేదానిపైనే మా దృష్టి’ అని కుంబ్లే అన్నారు. మరో వైపు రహానేను తుది జట్టులోంచి తప్పించాల్సిన అవసరమే లేదని కుంబ్లే స్పష్టం చేశారు. నాయర్ ఇంకా వేచి చూడాల్సిందేనని ఆయన అన్నారు.
‘గత రెండేళ్లుగా రహానే చాలా బాగా ఆడుతున్నాడు. అతడిని తప్పించాలనే ప్రశ్నే తలెత్తదు. ట్రిపుల్ సెంచరీ తర్వాత కూడా కరుణ్‌కు అవకాశం రాకపోవడం దురదృష్టకరం కానీ తప్పదు. తుది జట్టుపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఐదుగురు బౌలర్లను కొనసాగించాలా, లేదా నలుగురు బౌలర్లతో ఆడి మరో బ్యాట్స్‌మన్‌కు అవకాశం ఇవ్వాలా అనేది చెప్పలేను’ అని కుంబ్లే అభిప్రాయం వ్యక్తం చేశారు.