'భారత్ లో ఆడే ప్రసక్తే లేదు'
న్యూఢిల్లీ: టీమిండియాతో డిసెంబర్ లో జరగాల్సిన ద్వైపాకిక్ష క్రికెట్ సిరీస్ ను భారత్ లో ఆడే ప్రసక్తే లేదని పాకిస్థాన్ క్రికెట్ బోర్డు స్పష్టం చేసింది. ముందుస్తు షెడ్యూల్ ప్రకారం ఆ సిరీస్ ను యూఏఈలో మాత్రమే ఆడాలనుకుంటున్నట్లు పీసీబీ చైర్మన్ షహర్యార్ ఖాన్ స్పష్టం చేశారు. ఈ మేరకు భారత్ లో ఆడాలంటూ భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) చేసిన విన్నపాన్ని షహర్యార్ ఖాన్ తోసిపుచ్చారు. ఎట్టి పరిస్థితిల్లోనూ ఇరు దేశాల మధ్య జరగాల్సిన ద్వైపాక్షిక సిరీస్ ను భారత్ లో ఆడబోమని పేర్కొన్నారు.
ఒకవేళ భారత్ తమతో ఆడాలనుకుంటే మాత్రం అది యూఏఈలో మాత్రమే జరుగుతుందని షహర్యార్ తెలిపారు. 'భారత్ లో సిరీస్ ఆడే విజ్ఞప్తిని తోసిపుచ్చుతున్నాం. యూఏఈలో జరగాల్సిన సిరీస్ ను భారత్ లో నిర్వహించడానికి మేము అంగీకరించం. ఇందులో వేరే ప్రశ్నే లేదు'అని షహర్యార్ తెలిపారు. 2009వ సంవత్సరంలో లాహార్ లో శ్రీలంక -పాకిస్థాన్ ల మధ్య సిరీస్ జరిగే సమయంలో ఉగ్రవాదులు దాడులకు పాల్పడటంతో అప్పట్నుంచి పీసీబీ తమ క్రికెట్ సిరీస్ లను స్వదేశంలో నిర్వహించకుండా మిగతా వేదికలపై జరుపుతోంది. దీనిలో భాగంగానే బీసీసీఐ-పీసీబీల మధ్య ఆరు ద్వైపాక్షిక సిరీస్ లకు ఒప్పందం కుదరింది. ఆ ఒప్పందంలో ముందస్తు సిరీస్ ను డిసెంబర్ లో యూఏఈలో నిర్వహించాల్సి ఉంది. ప్రస్తుతం పాకిస్థాన్ తో క్రికెట్ సిరీస్ లు జరగడానికి రాజకీయ పరమైన అంశాలు ముడిపడి ఉండటంతో ఆ సిరీస్ ను భారత్ లో జరపాలని బీసీసీఐ భావించింది. కాగా, అందుకు పాకిస్థాన్ క్రికెట్ బోర్డు నుంచి ఎటువంటి సానుకూలత లేకపోవడంతో ఆ సిరీస్ పై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి.