బీసీసీఐపై చర్యలకు పీసీబీ సిద్ధం!
కరాచీ: గత కొన్నేళ్లుగా తమతో క్రికెట్ ఆడటానికి తీవ్రంగా వ్యతిరేకిస్తున్న భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ)పై చర్యలకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) సిద్ధమైంది. ఈ మేరకు భారత క్రికెట్ కంట్రోలో బోర్డుపై న్యాయపరమైన చర్యలు తీసుకునేందుకు సన్నద్ధమైనట్లు పీసీబీ చైర్మన్ షహర్యార్ ఖాన్ తెలిపారు. దీనిలో భాగంగా త్వరలోనే న్యాయ నిపుణలను కలవనున్నట్లు బోర్డు సమావేశంలో పేర్కొన్నారు. బీసీసీఐపై చర్యలకు పీసీబీ ఆమోద ముద్ర వేసిన విషయాన్ని షహర్యార్ ఖాన్ తాజాగా తెలిపారు.
'2014లో ఇరు క్రికెట్ బోర్డులు దైపాక్షిక సిరీస్లు ఆడటానికి ఒప్పందం చేసుకున్నాయి. ఆ విషయాన్ని బీసీసీఐ పక్కన పెట్టేసింది. మాతో సిరీస్ ఆడటాన్ని బీసీసీఐ వ్యతిరేకిస్తోంది. మా మధ్య ఒప్పందం ప్రకారం 2015 మొదలుకొని 2022 వరకూ ఆరు ద్వైపాక్షిక సిరీస్లు జరగాలి. అందుకు అంతర్జాతీయ క్రికెట్ మండలే(ఐసీసీ) సాక్ష్యం. ఐసీసీ స్థాయిలో ఒప్పందం జరిగిన తరువాత బీసీసీఐ ఎందుకు మాతో ఆడటం లేదు. ఆ క్రమంలోనే బీసీసీఐపై చర్యలకు సిద్ధమవుతున్నాం' అని షహర్యార్ పేర్కొన్నారు. 2007 తరువాత భారత్-పాకిస్తాన్ జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్ జరగలేదు. 2007లో చివరిసారి భారత్లో పాకిస్తాన్ పర్యటించింది. ఆ తరువాత పాకిస్తాన్ తో సిరీస్ కు బీసీసీఐ విముఖత వ్యక్తం చేయడంతో పీసీబీకి కొన్ని వందల కోట్ల రూపాయిలను నష్టపోయింది. దీనిలో భాగంగానే బీసీసీఐపై న్యాయపరమైన చర్యలు తీసుకుని కొంత మేరకు లబ్దిపొందాలని యోచిస్తోంది.