
వారితో నాకు పోటీ లేదు: రోహిత్ శర్మ
ముంబై: తొడ కండరాల గాయం కారణంగా నాలుగు నెలలుగా ఆటకు దూరమై తిరిగి కోలుకున్న భారత ఓపెనర్ రోహిత్ శర్మ తన పునరాగమనాన్ని ఘనంగా చాటుకునేందుకు సిద్ధమయ్యాడు. విజయ్ హజారే వన్డే టోర్నీలో ముంబై తరపున రోహిత్ బరిలోకి దిగేందుకు రంగం సిద్ధం చేసుకున్నాడు. ఈ దేశవాళీ వన్డే టోర్నీలో ఆడటానికి సిద్ధంగా ఉన్న విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించిన రోహిత్.. .త్వరలో భారత్ జట్టులో చోటు సంపాదిస్తాననే ఆశాభావం వ్యక్తం చేశాడు. తనకు ఎవరితోనూ పోటీ కాదని విషయాన్ని ఈ సందర్భంగా రోహిత్ స్పష్టం చేశాడు. మరో ఇద్దరు భారత స్టార్ ఆటగాళ్లు అజింక్యా రహానే, కరుణ్ నాయర్ల నుంచి ఏమైనా పోటీని ఎదుర్కొంటున్నారా అన్న ప్రశ్నకు రోహిత్ కాదనే సమాధానం ఇచ్చాడు. ఆ ఇద్దరితో తనకు ఎటువంటి పోటీ లేదని రోహిత్ తెలిపాడు.
' నా కెరీర్ ఆశాజనకంగానే ఉంది. నేనెప్పుడూ జట్టులో పోటీ గురించి ఆలోచించ లేదు. నీవు ఆటగాడి మెరుగుపడని పక్షంలో మాత్రమే పోటీ గురించి ఆలోచిస్తాం. నాకు అటువంటి సందర్భం ఎప్పుడూ రాలేదు. నాకు నేనే పోటీ. ఇలా అనవసరపు విషయాలు గురించి ఆలోచించి సమయాన్ని వృథా చేసుకోదలుచుకోలేదు. భారత్ జట్టు తరపున ప్రతీ మ్యాచ్ ఆడాలనే కోరుకుంటా'అని రోహిత్ పేర్కొన్నాడు.