'నేను రిటైర్ కాను..ఇంకా ఆడతా'
కరాచీ: దాదాపు రెండేళ్ల నుంచి అంతర్జాతీయ నిషేధం ఎదుర్కొంటున్న పాకిస్తాన్ ఆఫ్ స్పిన్నర్ సయీద్ అజ్మల్కు ఇప్పట్లో రిటైరయ్యే ఆలోచన లేదట. గతవారం పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పీసీబీ) పలువురు తమ దేశ క్రికెటర్లకు ఘనమైన వీడ్కోలు ఏర్పాట్లు చేయాలని భావించింది. ఇందులో ప్రధానంగా పాకిస్తాన్ వెటరన్ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిదితో పాటు సయీద్ అజ్మల్లు పీసీబీ వీడ్కోలు జాబితాలో ఉన్నారు. అయితే అజ్మల్ మాత్రం తన రిటైర్మెంట్కు సంబంధించి పీసీబీ తొందర పడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశాడు.
'ఇప్పట్లో క్రికెట్ కు వీడ్కోలు చెప్పే యోచన లేదు. నేను ఇప్పటికే జాతీయ టీ 20 కప్లో ఫిట్నెస్ను నిరూపించుకున్నా. ఇది నాకు జట్టులో చాన్స్కు తెచ్చిపెడుతుందని ఆశిస్తున్నా. ఒకవేళ నేను నిరూపించుకోపోతే.. జట్టు నుంచి స్వతహాగా వైదొలుగుతా. ఇంకా దేశవాళీ క్రికెట్ ను కొనసాగించి సత్తాచాటుకుంటా'అని అజ్మల్ తెలిపాడు. 2014లో అజ్మల్ తన బౌలింగ్ ను నిబంధనలకు విరుద్ధంగా చేస్తున్నాడనే కారణంతో అతనిపై నిషేధం పడింది. అయితే గతేడాది బౌలింగ్ ను సరి చేసుకుని బంగ్లాదేశ్ పర్యటకు ఎంపికయ్యాడు. కాగా, మరొకసారి అతని బౌలింగ్ లో ఇబ్బందులు తలెత్తడంతో నిషేధం ఎదుర్కొంటున్నాడు.
ఇదిలా ఉండగా, ఈ ఏడాది పాకిస్తాన్ జాతీయ టీ 20 కప్లో అజ్మల్ 20 వికెట్లు తీసి అగ్రస్థానంలో నిలిచాడు. తొమ్మిది మ్యాచ్ల్లో 6.28 స్ట్రైక్ రేట్తో ఆకట్టుకున్నాడు. కాగా, పాకిస్తాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ నజీమ్ సేథీ మాత్రం ఆఫ్రిది, అజ్మల్లతో రిటైర్మెంట్ నిర్ణయంపై త్వరలోనే చర్చిస్తానని స్పష్టం చేశాడు.