‘చిన్న పాల్’ జర్మనీయే అంటోంది
ఒబెర్‌హాసన్ (జర్మనీ): ఈసారి ప్రపంచకప్ ఎవరిదంటూ ప్రపంచం మొత్తం ఉత్కంఠగా ఎదురు చూస్తుంటే... ‘చిన్న పాల్’ (ఆక్టోపస్) మాత్రం జర్మనీదే కప్ అని కుండ బద్దలు కొట్టింది.
ఒజెర్‌హాసన్‌లో ఉన్న సీ లైఫ్ అక్వేరియంలో ఈ చిన్న పాల్ నివసిస్తోంది. జర్మనీ, అర్జెంటీనా జాతీయ పతాకాలు చుట్టిన రెండు పాత్రల్లో ఆహార పదార్థాలను ఉంచి పాల్ ముందు పెట్టారు. అది ఆహారం కోసం జర్మనీ పాత్ర రంధ్రంలోకి తన టెంటకిల్‌ను దూర్చింది. 2010 దక్షిణాఫ్రికా టోర్నీలో ఇలాంటి ‘ఆక్టోపస్ పాల్’ వరుసగా ఎనిమిది మ్యాచ్‌ల ఫలితాలను ముందుగానే ఊహించి విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. ఇప్పుడు దాని వారసుడిగా వచ్చిన ఈ చిన్న పాల్ జోస్యం నిజమవుతుందో లేదో తెలియాలంటే ఆదివారం వరకు వేచి చూడక తప్పదు మరి!