
చెలరేగిన ప్రజ్ఞాన్ ఓజా
కోల్ కతా: రంజీ ట్రోఫీ మ్యాచ్ లో భాగంగా బెంగాల్ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా సంచలన బౌలింగ్ తో చెలరేగిపోయాడు. గ్రూప్-ఏ లో భాగంగా విదర్భతో జరిగిన మ్యాచ్ లో ఓజా 11 వికెట్లు తీసి కెరీర్ అత్యుత్తమ గణాంకాలను నమోదు చేశాడు. తొలి ఇన్నింగ్స్ లో ఏడు వికెట్లు తీసిన ఓజా.. రెండో ఇన్నింగ్స్ లో నాలుగు వికెట్లు తీసి విదర్భ వెన్నువిరిచాడు.
బెంగాల్ విసిరిన 297 పరుగల విజయ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ కొనసాగించిన విదర్భ 91.1 ఓవర్లలో 191 పరుగులు మాత్రమే చేసింది. 3/0 ఓవర్ నైట్ స్కోరుతో చివరిరోజు ఆట కొనసాగించిన విదర్భ వరుస వికెట్లు కోల్పోయింది. 111 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన విదర్భ ఆ తరువాత తేరుకోలేదు. విదర్భ ఆటగాళ్లలో గణేష్ సతీష్(96), బద్రీనాథ్(31) మినహా ఎవరూ రాణించలేదు. ఎనిమిది మంది ఆటగాళ్లు సింగిల్ డిజిట్ కే పరిమితం కావడంతో విదర్భకు ఓటమి తప్పలేదు. దీంతో బెంగాల్ 105 పరుగుల విజయాన్ని సాధించడమే కాకుండా.. సీజన్ లో తొలి గెలుపును అందుకుంది. ఈ మ్యాచ్ ద్వారా రంజీల్లో పదివేల పరుగుల మైలురాయిని అందుకుని తొలి క్రికెటర్ గా గుర్తింపు సాధించిన విదర్భ ఆటగాడు వసీం జాఫర్ రెండు ఇన్నింగ్స్ లలో (9 పరుగులు, 3 పరుగులు) నిరాశపరిచాడు. బెంగాల్ బౌలర్లలో ఓజాకు తోడుగా ప్రతాప్ సింగ్ మూడు వికెట్లు తీసి విజయంలో దోహదపడ్డాడు.
బెంగాల్ తొలి ఇన్నింగ్స్ 334 ఆలౌట్, రెండో ఇన్నింగ్స్ 164 ఆలౌట్
విదర్భ తొలి ఇన్నింగ్స్ 202 ఆలౌట్, రెండో ఇన్నింగ్స్ 191 ఆలౌట్