తాము తీసిన గోతిలోనే...
పేకమేడలా కూలిన భారత ఇన్నింగ్స్
► ఆరు వికెట్లతో ఓకీఫ్ మాయాజాలం
► కోహ్లి సేన 105 పరుగులకే ఆలౌట్
► చివరి 7 వికెట్లు 11 పరుగులకే
► ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ 143/4
► ప్రస్తుత ఆధిక్యం 298
టెస్టు ఫార్మాట్‌లో ప్రపంచంలోనే నంబర్‌వన్ జట్టుకేవైుంది? స్పిన్ బౌలింగ్‌ను చీల్చి చెండాడడంలో తమను మించిన వారు లేరని పేరు తెచ్చుకున్న విరాట్ సేనకేవైుంది? సొంతగడ్డపై ప్రత్యర్థి ఎవరైనా వారికి సింహస్వప్నంలా నిలిచే బ్యాట్స్‌మెన్ తెగువ ఎటు పోయింది? టెస్టు ర్యాంకింగ్స్‌లో తొలి రెండు స్థానాల్లో ఉన్న మన స్పిన్నర్ల ధాటికి ఆస్ట్రేలియా తోక ముడుస్తుందనుకుంటే ఒకే ఒక్కడి చేతిలో దెబ్బతిందేమిటి? ఇదీ రెండో రోజు ఆటలో సగటు భారత క్రికెట్ అభిమాని మదిలో మెదిలిన ప్రశ్నలు.
ప్రత్యర్థిని తక్కువ స్కోరుకే కట్టడి చేశామన్న ఆనందంలో బరిలోకి దిగిన భారత్‌ను కెరీర్‌లో కేవలం ఐదో టెస్టు ఆడుతున్న ఆసీస్ ఎడంచేతి వాటం స్పిన్నర్ స్టీవ్ ఓ కీఫ్ బావురుమనిపించాడు. అలా ఇలా కాదు... తమ టెస్టు చరిత్రలోనే భారత్‌కు అత్యంత అవమానకర పరిస్థితిని కల్పించాడు. అతడి బంతులకు ఎలా ఆడాలో తెలీక పెవిలియన్ లో అర్జంటు పని ఉన్నట్టుగా హడావిడిగా వెళ్లిపోవడం భారత బ్యాట్స్‌మెన్ వంతైంది.
ఓపెనర్ కేఎల్ రాహుల్ మినహా ఒక్కరంటే ఒక్కరు కూడా క్రీజులో కుదురుకోలేదు. ఫలితంగా 11 పరుగులకే తమ చివరి 7 వికెట్లను కోల్పోయిన భారత్ 105 పరుగులకు కుప్పకూలింది. ప్రస్తుతం రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఆసీస్ 298 పరుగుల ఆధిక్యంతో శాసించే స్థితిలో నిలిచింది. ఈ పరిస్థితిలో ఆసీస్‌ను అడ్డుకోవడం భారత్‌కు అసాధ్యమే అనుకోవాలి. ఇదే జరిగితే ఇక్కడ చాన్నాళ్లుగా ఊరిస్తున్న విజయం స్మిత్ సేన ఖాతాలో పడినట్టే. ప్రత్యర్థికి ఇబ్బంది సృష్టించాలనే లక్ష్యంతో తొలి రోజు నుంచే టర్న్ అయ్యే విధంగా రూపొందించిన పిచ్‌పై భారత బ్యాట్స్‌మెన్ చేతులెత్తేయడంతో విరాట్ సేన పరిస్థితి తాము తీసిన గోతిలో తామే పడ్డట్టు తయారైంది.
పుణే: అత్యంత పటిష్టవైున భారత స్పిన్ బౌలింగ్‌ను ఆస్ట్రేలియా ఎలా ఎదుర్కొంటుందో? ఇదీ టెస్టు ఆరంభానికి ముందు విశ్లేషకుల అభిప్రాయం. అయితే మ్యాచ్ ఆరంభమయ్యాక మాత్రం పంచ్ మనకే పడింది. ఉపఖండ పిచ్‌లపై స్పిన్ బౌలింగ్‌ను ఆడటంలో భారత బ్యాట్స్‌మెన్ ను మించిన వారు లేరు. అయితే ఏమరుపాటో.. అజాగ్రత్తో మరి.. విచిత్రంగా అదే స్పిన్ వలలో చిక్కుకుని టీమిండియా బ్యాట్స్‌మెన్ విలవిలలాడారు. ఆసీస్ ఎడంచేతి వాటం స్పిన్నర్ స్టీవ్ ఓ కీఫ్ (6/35) సుడులు తిరిగే బంతులతో కోహ్లి బృందం కోలుకోలేని విధంగా నడ్డి విరిచాడు.
24 బంతుల వ్యవధిలోనే 6 వికెట్లు తీశాడు. ఫలితంగా రెండో రోజు శుక్రవారం తమ తొలి ఇన్నింగ్స్‌లో భారత్ 40.1 ఓవర్లలో కేవలం 105 పరుగులకే ఆలౌట్ అయింది. ఓపెనర్ కేఎల్ రాహుల్ (97 బంతుల్లో 64; 10 ఫోర్లు, 1 సిక్స్) ఎదురొడ్డి నిలవగా... రహానే (55 బంతుల్లో 13; 1 ఫోర్), విజయ్ (19 బంతుల్లో 10; 1 ఫోర్) మాత్రమే రెండంకెల స్కోరును దాటారు. మిగతా ఎనిమిది మంది బ్యాట్స్‌మెన్ ఇలా వచ్చి అలా వెళ్లారు. వరుసగా నాలుగు టెస్టుల్లో నాలుగు డబుల్ సెంచరీలతో అత్యద్బుత ఫామ్‌లో ఉన్న కెప్టెన్ కోహ్లి కేవలం రెండు బంతులు ఆడి డకౌట్ అయ్యాడు. స్టార్క్‌కు రెండు... హాజెల్‌వుడ్, లియోన్ లకు ఒక్కో వికెట్ దక్కింది.
ఆ తర్వాత 155 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో తమ రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన ఆసీస్ ఆట ముగిసే సమయానికి 46 ఓవర్లలో 4 వికెట్లకు 143 పరుగులు చేసింది. కెప్టెన్ స్మిత్ (117 బంతుల్లో 59 బ్యాటింగ్; 7 ఫోర్లు) అజేయ అర్ధ సెంచరీ చేయగా... మిషెల్ మార్ష్ (48 బంతుల్లో 21 బ్యాటింగ్; 2 ఫోర్లు, 1 సిక్స్) అతడికి అండగా ఉన్నాడు. ప్రస్తుతం ఆస్ట్రేలియా 298 పరుగుల భారీ ఆధిక్యాన్ని సాధించింది. మూడో రోజు ఆటలో వీలైనంత వేగంగా ఆడి భారత్ ముందు భారీ లక్ష్యాన్ని ఉంచే ఆలోచనలో ఆసీస్ ఉంది. అశ్విన్ కు మూడు వికెట్లు దక్కాయి. అంతకుముందు ఆసీస్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 94.5 ఓవర్లలో 260 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఉమేశ్‌కు నాలుగు, అశ్విన్ కు మూడు వికెట్లు దక్కాయి.
తొలి సెషన్ : రాహుల్ నిలకడ
256/9 ఓవర్‌నైట్ స్కోరుతో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఆసీస్ మరో ఐదు బంతుల్లో నాలుగు పరుగులు చేసి ఆలౌట్ అయి్యంది. జోరు మీదున్న స్టార్క్ వికెట్‌ను అశ్విన్ తీయడంతో ఆసీస్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది. ఆ తర్వాత బరిలోకి దిగిన భారత్ ఇన్నింగ్స్ తడబడుతూ సాగింది. ఓపెనర్ రాహుల్ తొలి ఓవర్ నాలుగో బంతినే బౌండరీగా మలచగా... ఏడో ఓవర్‌లో విజయ్ అవుట్ అయ్యాడు. ఇన్నింగ్స్ పదో ఓవర్‌లో ఓకీఫ్ బౌలింగ్‌లో రాహుల్ సిక్సర్‌తో దూకుడు కనబరిచాడు. అయితే 15వ ఓవర్‌లో స్టార్క్ భారత్‌కు షాక్ ఇచ్చాడు. మూడు బంతుల వ్యవధిలో పుజారా (6), కోహ్లిని అవుట్ చేయడంతో ఆసీస్ ఆనందంలో ముని గింది. అటు రాహుల్ మాత్రం ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుం డా అడపాదడపా బౌండరీలు బాదుతూ రహానే సహాయంతో మరో వికెట్ పడకుండా లంచ్ విరామానికి వెళ్లారు.
ఓవర్లు:0.5, పరుగులు: 4, వికెట్: 1 (ఆసీస్)
ఓవర్లు:25, పరుగులు: 70, వికెట్లు: 3 (భారత్)
రెండో సెషన్ : ఓకీఫ్ మ్యాజిక్
లంచ్ తర్వాత భారత్ 38 నిమిషాలో్లనే మిగిలిన 7 వికెట్లను కోల్పోయింది. రాహుల్ 84 బంతుల్లో అర్ధ సెంచరీ చేయడంతో పాటు స్టార్క్ బౌలింగ్‌లో ఫోర్లు బాదుతూ స్కోరును పెంచే ప్రయత్నం చేశాడు. అయితే ఓకీఫ్ తన పదో ఓవర్ నుంచి మాయాజాలం ప్రారంభించాడు. ఆ ఓవర్ రెండో బంతికి ఫామ్‌లో ఉన్న రాహుల్‌ను అవుట్ చేయడంతో రహానేతో నాలుగో వికెట్‌కు 50 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. ఆ తర్వాత మూడు బంతుల వ్యవధిలో రహానే, సాహా వికెట్‌లను పడగొట్టాడు. మరుసటి ఓవర్‌లో అశ్విన్ వికెట్‌ను లియోన్ తీయడంతో ఒక్క పరుగు వ్యవధిలో భారత్ నాలుగు వికెట్లను కోల్పోయింది. అటు ఓ కీఫ్ తన జోరును కొనసాగిస్తూ వరుస ఓవర్లలో జయంత్ (2), జడేజా (2), ఉమేశ్ (4) వికెట్లను తీయడంతో భారత్ ఇన్నింగ్స్ ముగిసింది.
ఓ దశలో 101 పరుగులకే తొమ్మిది వికెట్లు కోల్పోయిన భారత్ తమ సొంతగడ్డపై ఆసీస్ చేతిలో అత్యల్ప స్కోరు (104)కే వెనుదిరుగుతుందేమో అనిపించినా ఉమేశ్ ఫోర్ సహాయంతో ఆ అవమానం తప్పింది. ఇక పూర్తి ఆధిపత్యంతో రెండో ఇన్నింగ్స్‌కు దిగిన ఆసీస్‌కు తొలి ఓవర్‌లోనే షాక్ తగిలింది. రెండు ఫోర్లతో జోష్ చూపిన వార్నర్‌ను అశ్విన్ ఎల్బీగా పంపాడు. ఏడో ఓవర్‌లో షాన్ మార్ష్ ను కూడా డకౌట్ చేయడంతో ఆసీస్ 23 పరుగులకు రెండు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో స్మిత్ ఎదురుదాడికి దిగి ఒత్తిడి పెంచాడు. 23 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద తను ఇచ్చిన క్యాచ్‌ను విజయ్ వదిలేశాడు.
ఓవర్లు: 15.1, పరుగులు: 35, వికెట్లు: 7 (భారత్)
ఓవర్లు:16, పరుగులు: 46, వికెట్లు: 2 (ఆసీస్)
చివరి సెషన్ : స్మిత్ దూకుడు
టీ బ్రేక్ అనంతరం కూడా స్మిత్ ఇచ్చిన క్యాచ్‌ను సబ్‌స్టిట్యూట్ అభినవ్ ముకుంద్ నేలపాలు చేశాడు. 21వ ఓవర్‌లో అశ్విన్ .. హ్యాండ్స్‌కోంబ్ (19) వికెట్‌ను తీశాడు. స్మిత్‌కు జతగా రెన్ షా (50 బంతుల్లో 31; 5 ఫోర్లు) తోడవ్వడంతో నాలుగో వికెట్‌కు 52 పరుగులు జత చేరాయి. అటు 93 బంతుల్లో స్మిత్ అర్ధ సెంచరీ చేయడంతో పాటు భారత్‌పై ఏడు టెస్టుల్లో వెయ్యి పరుగులను పూర్తి చేసుకున్నాడు. అనంతరం స్మిత్,మార్ష్ మరో వికెట్ పడకుండా రోజును ముగించారు.
ఓవర్లు: 30, పరుగులు: 97, వికెట్లు: 2
1 టెస్టుల్లో తమ చివరి ఏడు వికెట్లను అతి తక్కువ పరుగుల (11)కే కోల్పోవడం భారత్‌కు ఇదే తొలిసారి. గతంలో న్యూజిలాండ్‌పై (1990లో క్రైస్ట్‌చర్చ్‌లో) 18 పరుగులకు కోల్పోయింది.
1 ఒక సీజన్ లో సొంత గడ్డపై అత్యధిక వికెట్లు (67) తీసిన బౌలర్‌గా కపిల్ దేవ్ రికార్డు (63)ను అధిగమించిన అశ్విన్ .
3 టెస్టుల్లో మూడేళ్ల తర్వాత డకౌట్ అయిన కోహ్లి. అన్ని ఫార్మాట్లలో కలుపుకుంటే 104 ఇన్నింగ్స్ అనంతరం అతను ఈసారే సున్నాకు వెనుదిరిగాడు.
స్కోరు వివరాలు
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్: 260 ఆలౌట్
భారత్ తొలి ఇన్నింగ్స్: విజయ్ (సి) వేడ్ (బి) హాజెల్‌వుడ్ 10; రాహుల్ (సి) వార్నర్ (బి) ఓకీఫ్ 64; పుజారా (సి) వేడ్ (బి) స్టార్క్ 6; కోహ్లి (సి) హ్యాండ్స్‌కోంబ్ (బి) స్టార్క్ 0; రహానే (సి) హ్యాండ్స్‌కోంబ్ (బి) ఓకీఫ్ 13; అశ్విన్ (సి) హ్యాండ్స్‌కోంబ్ (బి) లియోన్ 1; సాహా (సి) స్మిత్ (బి) ఓకీఫ్ 0; జడేజా (సి) స్టార్క్ (బి) ఓకీఫ్ 2; జయంత్ యాదవ్ (స్టంప్డ్) వేడ్ (బి) ఓకీఫ్ 2; ఉమేశ్ యాదవ్ (సి) స్మిత్ (బి) ఓకీఫ్ 4; ఇషాంత్ నాటౌట్ 2; ఎక్స్‌ట్రాలు 1; మొత్తం (40.1 ఓవర్లలో ఆలౌట్)105
వికెట్ల పతనం: 1–26, 2–44, 3–44, 4–94, 5–95, 6–95, 7–95, 8–98, 9–101, 10–105.
బౌలింగ్: స్టార్క్ 9–2–38–2; ఓకీఫ్ 13.1–2–35–6; హాజెల్‌వుడ్ 7–3–11–1; లియోన్ 11–2–21–1.
ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్: వార్నర్ ఎల్బిడబ్ల్యు (బి) అశ్విన్ 10; షాన్ మార్ష్ ఎల్బిడబ్ల్యు (బి) అశ్విన్ 0; స్మిత్ బ్యాటింగ్ 59; హ్యాండ్స్‌కోంబ్ (సి) విజయ్ (బి) అశ్విన్ 19; రెన్ షా (సి) ఇషాంత్ (బి) జయంత్ 31; మిషెల్ మార్ష్ బ్యాటింగ్ 21; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం (46 ఓవర్లలో నాలుగు వికెట్లకు) 143
వికెట్ల పతనం: 1–10, 2–23, 3–61, 4–113.
బౌలింగ్: అశ్విన్ 16–3–68–3; జడేజా 17–6–26–0; ఉమేశ్ 5–0–13–0; జయంత్ 5–0–27–1; ఇషాంత్ 3–0–6–0.