ధోని కెప్టెన్సీ రికార్డు పదిలం
పుణె: ఇప్పటివరకూ విరాట్ కోహ్లి నేతృత్వంలో భారత జట్టు ఆడిన టెస్టు మ్యాచ్లు 24. అందులో 15 టెస్టుల్లో భారత్ విజయం సాధిస్తే, ఆరింటిని డ్రా చేసుకుంది. మరో మూడు మ్యాచ్ల్లో ఓటమి పాలైంది. ఇందులో ఇటీవల పుణెలో ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో భారత్ కు ఎదురైన ఓటమి ఒకటి. దాంతో కోహ్లి వరుస విజయాల రికార్డుకు బ్రేక్ పడటమే కాకుండా, స్వదేశంలో తొలి టెస్టు ఓటమి ఎదురైంది.
అయితే ఇక్కడ భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని రికార్డు మాత్రం పదిలంగా ఉందనే చెప్పాలి. స్వదేశీ టెస్టుల్లో ధోని నేతృత్వంలోని భారత్ జట్టుకు ఆసీస్ పై ఓటమి అనేది లేదు.. స్వదేశంలో ధోని సారథ్యంలో భారత్ జట్టు 10 టెస్టులు ఆడగా, ఎనిమిది గెలిచింది. మరో రెండు మ్యాచ్లు డ్రాగా ముగిసాయి. 2008-09 సీజన్ లో భారత పర్యటనకు వచ్చిన ఆసీస్ కు చేదు అనుభవమే ఎదురైంది. ఆనాటి నాలుగు టెస్టుల సిరీస్ లో ధోని నేతృత్వంలోని భారత్ 2-0 తేడాతో ఆసీస్ ను ఓడించి సిరీస్ దక్కించుకుంది. ఆ తరువాత 2010-11 సీజన్ లో కూడా ఆసీస్ కు ఇదే పరిస్థితి ఎదురైంది. రెండు టెస్టుల సిరీస్ లో భారత్ విజయ సాధించింది. ఆపై 2012-13 సీజన్ లో ధోని సారథ్యంలోని భారత్ జట్టు 4-0తో ఆసీస్ ను ఓడించి తమకు తిరుగులేదని నిరూపించింది. అయితే ధోని తరువాత టెస్టు పగ్గాలు అందుకున్న కోహ్లికి తాజాగా ఆసీస్ రూపంలో గట్టి షాక్ తగిలింది. ఇప్పటికే ఎన్నో రికార్డులను తన పేరిట లిఖించుకున్న విరాట్ కోహ్లికి ధోని రికార్డును అధిగమించే అవకాశం లేకుండా పోయింది.
పుణె మ్యాచ్లో 333 పరుగుల తేడాతో ఓటమి పాలైన భారత్ జట్టు ఇంకా ఫేవరెట్ గానే బరిలో ఉంది. ఇంకా మూడు టెస్టు మ్యాచ్లు మిగిలి ఉండటంతో స్వదేశంలో భారత్ తిరిగి పుంజుకుని సిరీస్ కైవసం చేసుకుంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. మరి భారత్ తిరిగి సత్తా చాటుతుందా?లేక ఒత్తిడికి లోనై సిరీస్ ను కోల్పోతుందా? అనేది చూడాల్సింది.