
అడిలైడ్: భారత్, ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్టు వేదిక అయిన అడిలైడ్ ఓవల్ మైదానంలో గత మూడు సీజన్లలో మూడు డే అండ్ నైట్ టెస్టులు జరిగాయి. ఏ మ్యాచ్ కూడా పూర్తిగా ఐదు రోజుల పాటు సాగలేదు. ఆ మ్యాచ్‌లలో గులాబీ బంతి మన్నిక కోసం పిచ్‌పై కాస్త ఎక్కువ పచ్చికను ఉంచారు. ఫలితంగా ఆరంభంలో పిచ్ పేస్‌కు బాగా అనుకూలించింది. ఈసారి డే అండ్ నైట్ టెస్టు కాకపోయినా... తాము అదే తరహాలో పిచ్‌ను సిద్ధం చేస్తున్నామని క్యురేటర్ డామియెన్ హాఫ్ చెప్పాడు.
‘మేం డే టెస్టు కోసం భిన్నంగా ఏమీ చేయడం లేదు. అదే తరహాలో పిచ్‌ను రూపొందిస్తాం. పిచ్‌పై కొంత పచ్చిక ఉంటేనే అటు బ్యాట్‌కు, బంతికి మధ్య సమంగా పోరు సాగుతుందనేది మా నమ్మకం. ప్రస్తుతానికి మాత్రం మేం అదే పనిలో ఉన్నాం’ అని అతను అన్నాడు. టెస్టు సాగినకొద్దీ బ్యాటింగ్‌కు అనుకూలంగా మారినా... మొదటి రోజు మాత్రం పేసర్లకు బాగా అనుకూలించే అవకాశం ఉంది. ఇరు జట్లలోనూ నాణ్యమైన పేస్ బౌలర్లు ఉన్న నేపథ్యంలో సిరీస్‌కు ఆసక్తికర ఆరంభం లభించవచ్చు.
అరవడం కంటే కరవడం ముఖ్యం!
బాల్ ట్యాంపరింగ్ ఉదంతం తర్వాత మైదానంలో ఆస్ట్రేలియా క్రికెటర్ల వ్యవహారశైలి మారిపోయిందని, వారంతా బుద్ధిగా వ్యవహరిస్తారని తరచూ వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అయితే మాటల్లో తీవ్రత లేకపోయినా... తమ దూకుడు మాత్రం తగ్గదని ఆసీస్ బ్యాట్స్‌మన్ ట్రవిస్ హెడ్ అన్నాడు. తమ బౌలర్లు ఆ పని చేయగలరని అతను అభిప్రాయపడ్డాడు. ‘అవసరం లేకపోయినా మాట్లాడే మాటలకు విలువే ఉండదు. మా బౌలర్లు స్టార్క్ 150 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేసి, కమిన్స్, హాజల్‌వుడ్ బౌన్స్‌తో చెలరేగి మైదానంలో దూకుడును ప్రదర్శిస్తారు. బ్యాటింగ్‌లో, ఫీల్డింగ్‌లో కూడా ఇలాగే చేస్తాం. టీవీల్లో ఇది కనిపించకపోవచ్చు. నా దృష్టిలో అరిచే కుక్కకంటే కరిచే కుక్క ఎక్కువ ప్రభావం చూపిస్తుంది’ అని హెడ్ అన్నాడు. కెరీర్‌లో 2 టెస్టులే ఆడిన హెడ్‌కు అడిలైడ్ సొంత మైదానం. ఆసీస్ కూర్పు ప్రకారం చూస్తే అతడికి తుది జట్టులో చోటు లభించే అవకాశాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రాక్టీస్ మ్యాచ్‌లో అశ్విన్‌ను సమర్థంగా ఎదుర్కొన్న హ్యారీ నీల్సన్ నుంచి తాను కొన్ని సూచనలు తీసుకుంటానని అతను చెప్పాడు.
కోహ్లిని ఇబ్బంది పెట్టగలం: పైన్
భారత కెప్టెన్‌ను కట్టడి చేయగల సామర్థ్యం తమ పేసర్లను ఉందని ఆస్ట్రేలియా కెప్టెన్ టిమ్ పైన్ అన్నాడు. తమ బౌలర్లు భావోద్వేగాలను నియంత్రించుకోవాల్సిన అవసరం కూడా లేదని అతను అభిప్రాయం వ్యక్తం చేశాడు. ‘మా బౌలర్లు తమ స్థాయిలో సత్తా చాటితే విరాట్ కోహ్లిని అడ్డుకోగలరు. అయితే మరీ ఎక్కువగా భావోద్వేగాలను నియంత్రించుకునే ప్రయత్నం చేస్తే మా ఆట దెబ్బ తింటుంది. మేం బాగా బౌలింగ్ చేస్తుంటే కోహ్లితో మాటల యుద్ధం అనే ప్రశ్నే తలెత్తదు. ఒక్కో ఆటగాడు తమకు అలవాటైన రీతిలో ఆడితే చాలు. అవసరమైతే కోహ్లితో ఢీ అంటే ఢీ అనే విధంగా వ్యవహరించాల్సి వచ్చినా తప్పు లేదు. అయితే హద్దులు దాటకుండా ఉంటే చాలు’ అంటూ పైన్ తమ జట్టు ఉద్దేశాన్ని చెప్పకనే చెప్పాడు.
Comments
Please login to add a commentAdd a comment