ఆరంభం ఆకట్టుకుంది...
హైదరాబాద్: దిగ్గజాలకు సన్మానం... స్థానిక సంస్కృతిని ప్రతిబింబించిన కళాకారులు... ఎమీ జాక్సన్ షో... సంక్షిప్తంగా ఐపీఎల్ ఆరంభోత్సవ విశేషాలు ఇవి. గతంలోని ఐపీఎల్ ప్రారంభ ఉత్సవాలతో పోలిస్తే భారీ స్థాయిలో హడావిడి, హంగామా లేకుండా ఇది సాగింది. ముందుగా క్రికెట్ సినిమా లగాన్ నుంచి ‘అప్‌నీ జీత్ హో’... పాటకు ఒక బృందం అభినయించింది. ఆ తర్వాత నలుగురు భారత క్రికెట్ దిగ్గజాలను బీసీసీఐ సత్కరించింది. సచిన్, గంగూలీ, లక్ష్మణ్, సెహ్వాగ్‌లు ముందుగా ప్రత్యేక వాహనంలో మైదానం చుట్టూ తిరిగారు. ఆ తర్వాత వారంతా వేదిక మీదకు వచ్చారు. మరో మాజీ ఆటగాడు రాహుల్ ద్రవిడ్ ఈ కార్యక్రమానికి గైర్హాజరయ్యారు. నలుగురు ఆటగాళ్లు కూడా ఐపీఎల్ పదేళ్ల ప్రస్థానంపై తమ అభిప్రాయాలు వెల్లడించారు.
అనంతరం రెండు వైపుల నుంచి వాహనాల్లో హైదరాబాద్, బెంగళూరు జట్ల కెప్టెన్లను వేదిక వద్దకు తీసుకొచ్చారు. బోనాలు తదితర సాంప్రదాయ వేషధారణలో ఉన్న కళాకారులు వీరికి తోడుగా వచ్చారు. ముందుగా హైదరాబాద్ కెప్టెన్ వార్నర్ ఐపీఎల్ ట్రోఫీని తీసుకొచ్చి వేదికపై పెట్టి, ఆ తర్వాత ప్రత్యర్థి కెప్టెన్ కోహ్లికి ఒక ప్రత్యేక జ్ఞాపికను అందజేశాడు. ఆ వెంటనే ఎమీ జాక్సన్ నృత్య ప్రదర్శన మొదలైంది. పలు బాలీవుడ్ సూపర్‌హిట్ పాటలకు ఆమె నర్తించింది. అరగంట పాటు సాగిన ఈ ప్రారంభోత్సవం బాణాసంచా మెరుపులతో ముగిసింది.
ఐపీఎల్ పదేళ్ల ప్రస్థానాన్ని నమ్మలేకపోతున్నా. నిజంగా ఇది గొప్ప ఘనకార్యం. దీనికి అశేష ప్రేక్షకుల మద్దతే కారణం. 2007లో ఐపీఎల్ ప్రకటించినపుడు, 2008లో మేం తొలిసారిగా ఇందులో ఆడినపుడు... ఈ టోర్నీ ఇంత భారీ సక్సెస్ అవుతుందని అస్సలూహించలేదు.
– సచిన్
క్రికెటర్ల మైండ్‌సెట్‌ను పాజిటివ్‌గా మార్చేసింది ఐపీఎల్. బ్యాట్స్‌మన్ దూకుడు పెరిగింది. బౌలర్ల రక్షణాత్మక లైన్ అండ్ లెంగ్త్ మెరుగైంది. మరీ ముఖ్యంగా అన్‌క్యాప్‌డ్ ఆటగాళ్లు ప్రపంచ మేటి క్రికెటర్లతో కలిసి ఆడటమే కాదు... వారు తమ భుజాలను తట్టేలా రాణిస్తున్నారు.
–వీవీఎస్ లక్ష్మణ్
మేం 20వ సీజన్‌లోనూ ఇలాగే కనబడాలనుకుంటున్నాం. ఇప్పుడు ఐపీఎల్ పుణ్యమాని దేశవాళీ యువ ఆటగాళ్లు ముప్పై... నలభై వేల మంది ప్రేక్షకుల మధ్య ఎలాంటి ఒత్తిడి లేకుండా ఆడగలుగుతున్నారు. ఇలా ఐపీఎల్ ఆటను మరో దశకు తీసుకెళ్లింది. భారత క్రికెట్ స్థాయిని అమాంతం పెంచేసింది. – గంగూలీ
ఐలవ్ ఐపీఎల్. అన్ని ఫార్మాట్లను ఒకే రకంగా ఆడిన ఏకైక క్రికెటర్‌ను బహశా నేనేనేమో! బ్యాటింగ్ జోరును నేనెప్పుడు మార్చలేదు. ప్రతీసారి ఎదురుదాడికే దిగా. అది టెస్టయినా, వన్డేలయినా, టి20లయినా... నా తీరేం మారలేదు. నా దృష్టిలో క్రికెట్ ఆడటమంటే... ప్రేక్షకుల్ని రంజింపచేయడమే. – సెహ్వాగ్