‘విన్‌’ రైజర్స్‌... | sunrisers Hyderabad win a first match in ipl-10 | Sakshi
Sakshi News home page

‘విన్‌’ రైజర్స్‌...

Published Thu, Apr 6 2017 12:52 AM | Last Updated on Mon, May 28 2018 2:10 PM

‘విన్‌’ రైజర్స్‌... - Sakshi

‘విన్‌’ రైజర్స్‌...

తొలి మ్యాచ్‌లో హైదరాబాద్‌ ఘన విజయం  
35 పరుగులతో బెంగళూరు చిత్తు
యువరాజ్‌ మెరుపు ఇన్నింగ్స్‌   
బౌలర్ల సమష్టి ప్రదర్శన  
ఐపీఎల్‌–10  


పదేళ్ల  ఐపీఎల్‌ పండగ వేళ తొలి రోజే డిఫెండింగ్‌ చాంపియన్‌ సత్తా చాటింది. సొంతగడ్డపై అంచనాలను నిలబెట్టుకుంటూ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు అద్భుత విజయంతో లీగ్‌లో తొలి అడుగును విజయవంతంగా వేసింది. రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్టు బలహీన బౌలింగ్‌ను సొమ్ము చేసుకుంటూ ముందుగా భారీ స్కోరుతో చెలరేగిన సన్‌రైజర్స్‌ ఆ తర్వాత పదునైన బౌలింగ్‌తో ప్రత్యర్థిని కుప్పకూల్చింది. ఐపీఎల్‌లో చాన్నాళ్ల తర్వాత యువరాజ్‌ సింగ్‌ వీరత్వం ప్రదర్శించి రైజర్స్‌ విజయంలో కీలక పాత్ర పోషించడం విశేషం.  

హైదరాబాద్‌: అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌లో విశేషంగా రాణించిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు ఐపీఎల్‌–2017ను విజయంతో మొదలు పెట్టింది. తొలి మ్యాచ్‌లో గత ఏడాది రన్నరప్‌ రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరుపై హైదరాబాద్‌ 35 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన రైజర్స్‌ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 207 పరుగులు చేసింది. యువరాజ్‌ సింగ్‌ (27 బంతుల్లో 62; 7 ఫోర్లు, 3 సిక్సర్లు), హెన్రిక్స్‌ (37 బంతుల్లో 52; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధసెంచరీలు సాధించగా... శిఖర్‌ ధావన్‌ (31 బంతుల్లో 40; 5 ఫోర్లు) రాణించాడు. అనంతరం బెంగళూరు 19.4 ఓవర్లలో 172 పరుగులకే ఆలౌటైంది. గేల్‌ (21 బంతుల్లో 32; 2 ఫోర్లు, 3 సిక్సర్లు), కేదార్‌ జాదవ్‌ (16 బంతుల్లో 31; 4 ఫోర్లు, 1 సిక్స్‌), హెడ్‌ (22 బంతుల్లో 30; 3 ఫోర్లు) పర్వాలేదనిపించారు. నెహ్రా, భువనేశ్వర్, రషీద్‌ ఖాన్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి. యువరాజ్‌ సింగ్‌కు ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ అవార్డు లభించింది. ఈనెల 9న హైదరాబాద్‌లోనే జరిగే తమ తదుపరి మ్యాచ్‌లో గుజరాత్‌ లయన్స్‌తో సన్‌రైజర్స్‌ ఆడుతుంది.

చెలరేగిన హెన్రిక్స్‌...
టాస్‌ గెలిచిన బెంగళూరు ఫీల్డింగ్‌ ఎంచుకుంది. సన్‌రైజర్స్‌ తరఫున బరిలోకి దిగిన లెగ్‌స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌ ఐపీఎల్‌ ఆడిన తొలి అఫ్ఘానిస్తాన్‌ ఆటగాడిగా గుర్తింపు తెచ్చుకోగా, బెంగళూరు బౌలర్‌ టైమల్‌ మిల్స్‌కు కూడా ఇదే మొదటి ఐపీఎల్‌ మ్యాచ్‌. ఐపీఎల్‌లో బెంగళూరుతో ఆడిన 7 మ్యాచ్‌లలో 7 అర్ధ సెంచరీలు సాధించిన వార్నర్‌ ఈసారి మాత్రం విఫలమయ్యాడు. అనికేత్‌ ఓవర్లో ఫోర్, సిక్స్‌ కొట్టి జోరు ప్రదర్శించిన వార్నర్‌ (14) అదే ఓవర్లో అవుటయ్యాడు. ఈ దశలో ధావన్, హెన్రిక్స్‌ కలిసి చక్కటి సమన్వయంతో బ్యాటింగ్‌ చేశారు. వాట్సన్‌ వేసిన ఓవర్లో ధావన్‌ నాలుగు ఫోర్లు బాది దూకుడు ప్రదర్శించాడు. సచిన్‌ బేబీ క్యాచ్‌తో 74 పరుగుల (53 బంతుల్లో) రెండో వికెట్‌ భాగస్వామ్యానికి తెర పడింది. ఆ తర్వాత యువరాజ్, హెన్రిక్స్‌ జోడి మరింత ధాటిగా ఆడి 29 బంతుల్లోనే 58 పరుగులు జత చేసింది. చివర్లో కటింగ్‌ (6 బంతుల్లో 16 నాటౌట్‌; 2 సిక్స ర్లు), దీపక్‌ హుడా (12 బంతుల్లో 16 నాటౌట్‌; 1 సిక్స్‌) వేగంగా మరికొన్ని పరుగులు జోడించారు. అరవింద్‌ వేసిన 15వ ఓవర్లో హైదరాబాద్‌ అత్యధికంగా 19 పరుగులు రాబ ట్టగా... చివరి 3 ఓవర్లలో జట్టు 45 పరుగులు సాధించింది.

బ్యాటింగ్‌లో విఫలం...
బెంగళూరు ఇన్నింగ్స్‌ కూడా ధాటిగా ఆరంభమైంది. నెహ్రా వేసిన మూడో ఓవర్లో జట్టు 16 పరుగులు రాబట్టగా, ఐదు ఓవర్లలో స్కోరు 48 పరుగులకు చేరింది. అయితే రషీద్‌ తన తొలి ఓవర్లోనే మన్‌దీప్‌ (16 బంతుల్లో 24; 5 ఫోర్లు)ను బౌల్డ్‌ చేసి రైజర్స్‌కు బ్రేక్‌ ఇచ్చాడు. హుడా వేసిన తర్వాతి ఓవర్లో భారీ సిక్స్‌ బాదిన గేల్‌ తర్వాతి బంతికే వార్నర్‌ చక్కటి క్యాచ్‌కు వెనుదిరిగాడు. టి20ల్లో వార్నర్‌కు ఇది 100వ క్యాచ్‌ కావడం విశేషం. ధాటిగా ఆడే ప్రయత్నం చేసిన కేదార్‌ జాదవ్‌ అనవసరపు రెండో పరుగు కోసం ప్రయత్నించి కటింగ్‌ అద్భుత త్రోకు రనౌట్‌ కాగా... రషీద్‌ వేసిన తర్వాతి ఓవర్లోనే హెడ్‌ కూడా అవుట్‌ కావడంతో ఆర్‌సీబీ ఆశలు సన్నగిల్లాయి. చివర్లో వాట్సన్‌ (17 బంతుల్లో 22; 1 ఫోర్, 1 సిక్స్‌) ధాటిగా ఆడే ప్రయత్నం చేసినా, అప్పటికే ఆలస్యమైపోయింది.

యువీ మెరుపులు...
తొలి మ్యాచ్‌లో అన్నింటికంటే యువరాజ్‌ సింగ్‌ ఇన్నింగ్సే హైలైట్‌గా నిలిచింది. గత ఏడాది సన్‌రైజర్స్‌ తరఫున అంతంత మాత్రంగానే ఆడిన యువరాజ్‌ ఈ సీజన్‌లో శుభారంభం చేశాడు. ముఖ్యంగా అతని హుక్‌ షాట్లు అభిమానులను అలరించాయి. తాను ఎదుర్కొన్న ఐదో బంతికి ఫోర్‌ బాదిన యువీ, ఆ తర్వాత అనికేత్‌ ఓవర్లో వరుస బంతుల్లో 4, 6, 4 కొట్టాడు. 26 పరుగుల స్కోరు వద్ద అదే ఓవర్లో తాను ఇచ్చిన అతి సునాయాస క్యాచ్‌ను డీప్‌ స్క్వేర్‌లెగ్‌లో అరవింద్‌ వదిలేయడం కూడా యువరాజ్‌కు కలిసొచ్చింది. అరవింద్‌ బౌలింగ్‌లోనే మరో సిక్సర్‌ బాదిన యువీ ఈ క్రమంలో 23 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అతనికి ఐపీఎల్‌లో ఇదే వేగవంతమైన హాఫ్‌ సెంచరీ కావడం విశేషం. మిల్స్‌ వేసిన 19వ ఓవర్లో తొలి రెండు బంతుల్లో 4, 6 కొట్టిన యువీ, మూడో బంతికి బౌల్డయ్యాడు. 2015 సీజన్‌లో ఢిల్లీ తరఫున ఆడుతూ ముంబైపై అర్ధ సెంచరీ చేసిన తర్వాత యువరాజ్‌కు ఐపీఎల్‌లో ఇదే మొదటి హాఫ్‌ సెంచరీ.

స్కోరు వివరాలు
సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఇన్నింగ్స్‌: వార్నర్‌ (సి) మన్‌దీప్‌ (బి) అనికేత్‌ 14; ధావన్‌ (సి) సచిన్‌ బేబి (బి) స్టువర్ట్‌ బిన్నీ 40; హెన్రిక్స్‌ (సి) సచిన్‌ బేబి (బి) చాహల్‌ 52; యువరాజ్‌ (బి) మిల్స్‌ 62; హుడా (నాటౌట్‌) 16; కటింగ్‌ (నాటౌట్‌) 16; ఎక్స్‌ట్రాలు 7; మొత్తం (20 ఓవర్లలో 4 వికెట్లకు) 207.

వికెట్ల పతనం: 1–19, 2–93, 3–151, 4–190

బౌలింగ్‌: మిల్స్‌ 4–0–31–1, అనికేత్‌ 4–0–55–1, చాహల్‌ 4–0–22–1, అరవింద్‌ 3–0–36–0, వాట్సన్‌ 3–0–41–0, హెడ్‌ 1–0–11–0, స్టువర్ట్‌ బిన్నీ 1–0–10–1
రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు ఇన్నింగ్స్‌: గేల్‌ (సి) వార్నర్‌ (బి) హుడా 32; మన్‌దీప్‌ సింగ్‌ (బి) రషీద్‌ ఖాన్‌ 24; హెడ్‌ (సి) యువరాజ్‌ (బి) రషీద్‌ ఖాన్‌ 30; కేదార్‌ జాదవ్‌ (రనౌట్‌) 31; వాట్సన్‌ (సి) హెన్రిక్స్‌ (బి) నెహ్రా 22; సచిన్‌ బేబి (సి) హెన్రిక్స్‌ (బి) బిపుల్‌ శర్మ 1; స్టువర్ట్‌ బిన్నీ (సి) యువరాజ్‌ (బి) భువనేశ్వర్‌ 11; అరవింద్‌ (బి) నెహ్రా 0; మిల్స్‌ (సి) వార్నర్‌ (బి) భువనేశ్వర్‌ 6; చాహల్‌ (రనౌట్‌) 3; అనికేత్‌ (నాటౌట్‌) 6; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (19.4 ఓవర్లలో ఆలౌట్‌) 172.

వికెట్ల పతనం: 1–52, 2–60, 3–116, 4–126, 5–128, 6–154, 7–156, 8–156, 9–164, 10–172

బౌలింగ్‌: నెహ్రా 4–0–42–2; భువనేశ్వర్‌ 4–0–27–2, కటింగ్‌ 3.4–0–35–0; రషీద్‌ 4–0–36–2; హుడా 1–0–7–1; హెన్రిక్స్‌ 2–0–20–0; బిపుల్‌ శర్మ 1–0–4–1.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement