సర్ఫరాజ్‌ వర్ణ వివక్ష వ్యాఖ్యలు | Pakistan captain Sarfraz Ahmed apologises for his racial comments | Sakshi
Sakshi News home page

సర్ఫరాజ్‌ వర్ణ వివక్ష వ్యాఖ్యలు

Published Thu, Jan 24 2019 12:21 AM | Last Updated on Thu, Jan 24 2019 12:21 AM

Pakistan captain Sarfraz Ahmed apologises for his racial comments - Sakshi

డర్బన్‌: పాకిస్తాన్‌ క్రికెట్‌ జట్టు కెప్టెన్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌ మైదానంలో చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపాయి. దక్షిణాఫ్రికాతో మంగళవారం జరిగిన రెండో వన్డే సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రత్యర్థి బ్యాట్స్‌మన్‌ ఫెలుక్‌వాయో నలుపు రంగును ఉద్దేశించి అతను ఈ మాటలు అన్నాడు. క్రీజ్‌లో పాతుకుపోయి సఫారీ జట్టును ఫెలుక్‌వాయో విజయం దిశగా తీసుకెళుతుండగా అసహనంతో పాక్‌ కెప్టెన్‌ ఇలాంటి వ్యాఖ్యలు చేశాడు. ‘ఒరే నల్లోడా... మీ అమ్మ ఇవాళ ఎక్కడుంది. ఈ రోజు నీ కోసం ఆమెతో ఏం మంత్రం చదివించుకొని వచ్చావు’ అని ఉర్దూలో అన్న మాటలు స్టంప్‌ మైక్‌లో రికార్డయ్యాయి.

దీనిపై దక్షిణాఫ్రికా జట్టు అధికారికంగా ఫిర్యాదు చేయకపోయినా... ఐసీసీ స్వతంత్ర విచారణ చేపట్టింది. సరదాగా స్లెడ్జింగ్‌ కాకుండా ఇవి వర్ణ వివక్ష వ్యాఖ్యలు కావడంతో దోషిగా తేలితే సర్ఫరాజ్‌కు పెద్ద శిక్షే పడవచ్చు. మరోవైపు మ్యాచ్‌ తర్వాతి రోజు బుధవారం సర్ఫరాజ్‌ దీనిపై క్షమాపణలు కోరాడు. ‘మ్యాచ్‌లో అసహనాన్ని ప్రదర్శిస్తూ నేను చేసిన వ్యాఖ్యలతో ఎవరైనా బాధపడితే మన్నించండి. ఎవరినీ కావాలని ఆ మాటలు అనలేదు. మరెవరినీ బాధపెట్టే ఉద్దేశం నాకు లేదు. ప్రపంచవ్యాప్తంగా సహచర క్రికెటర్లను నేను ఎప్పుడైనా గౌరవిస్తాను’ అని సర్ఫరాజ్‌ ట్వీట్‌ చేశాడు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement