
పాకిస్తాన్ టీమ్ వస్తోంది..!
కరాచీ: భారత్లో జరిగే టి-20 ప్రపంచ కప్లో పాల్గొనేందుకు పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు ఆ దేశ ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్టు ఆ దేశ మీడియా వెల్లడించింది. ఈ మెగా ఈవెంట్లో భాగంగా మార్చి 19న ధర్మశాలలో జరిగే మ్యాచ్లో దాయాదులు భారత్, పాక్లు తలపడనున్నాయి. భారత్లో మార్చి 8న ఈ ఈవెంట్ ఆరంభంకానుంది.
భద్రత కారణాల రీత్యా పాక్ జట్టు భారత్ పర్యటనకు వచ్చేది సందేహంగా మారిన సంగతి తెలిసిందే. టి-20 ప్రపంచ కప్లో తాము ఆడబోయి మ్యాచ్లను భారత్ వెలుపల తటస్థ వేదికలపై నిర్వహించాలని ఇంతకుముందు పాక్ క్రికెట్ బోర్డు ఐసీసీని కోరింది. అయితే పాక్ విన్నపాన్ని ఐసీసీ తిరస్కరించింది. దీంతో పాక్ టి-20 ప్రపంచ కప్లో ఆడాలంటే భారత్కు రాకతప్పని పరిస్థితి ఏర్పడింది. భారత్కు వెళ్లేందుకు పాక్ జట్టు అనుమతి ఇవ్వాలని పీసీబీ కోరగా, ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.
ముంబై ఉగ్రవాదదాడుల అనంతరం భారత్, పాకిస్తాన్ మధ్య క్రికెట్ సంబంధాలు దెబ్బతిన్నాయి. ప్రపంచ కప్ వంటి ఈవెంట్లలో ఇరు జట్లు ఆడటం మినహా ద్వైపాక్షిక సిరీస్లు ఆడటం లేదు. భారత్తో ద్వైపాక్షిక సిరీస్కు పీసీబీ ఆసక్తి కనబరిచినా ఇటీవల పఠాన్కోట్లో ఉగ్రవాద దాడి జరగడంతో భారత్ విముఖత చూపింది.