
మా సంగతేంటి?: పంకజ్ అద్వానీ
ముంబై: ఒలింపిక్స్ జరిగే ఏడాదిలోనే భారత్‌లో క్రీడల గురించి ఎక్కువగా ఆలోచిస్తారని... ఆ తర్వాత మూడున్నరేళ్లపాటు క్రీడల గురించి అంతగా పట్టించుకోరని భారత క్యూ స్పోర్ట్స్ (స్నూకర్, బిలియర్డ్స్) ప్లేయర్ పంకజ్ అద్వానీ ఆవేదన వ్యక్తం చేశాడు. 31 ఏళ్ల పంకజ్ ఇప్పటికే కెరీర్‌లో 16 సార్లు వివిధ ఫార్మాట్‌లలో ప్రపంచ చాంపియన్‌గా నిలిచాడు.
‘మనం నాలుగేళ్లకోసారి ఒలింపిక్స్ జరిగే సమయంలో క్రీడల గురించి మాట్లాడుకుంటాం. మిగతా మూడున్నరేళ్లలో ఏం జరుగుతుందో ఎవరూ పట్టించుకోరు. మిగతా క్రీడల్లో నిలకడగా రాణిస్తున్న వారి సంగతేంటి? ఒక క్రీడను ఎలా పాపులర్ చేయాలో మిగతా క్రీడా సంఘాలు బీసీసీఐని చూసి నేర్చుకోవాలి’ అని ఈ బెంగళూరు ప్లేయర్ సూచించాడు.