
పంకజ్‌కు షాక్
బెంగళూరు: సొంతగడ్డపై భారత స్టార్ పంకజ్ అద్వానీకి ఊహించని పరాభవం ఎదురైంది. ఫలితంగా ప్రపంచ స్నూకర్ చాంపియన్‌షిప్‌లో భారత పోరాటం ముగిసింది. శుక్రవారం జరిగిన పురుషుల విభాగం క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ మాజీ చాంపియన్ పంకజ్ అద్వానీ 4-6 (63-38, 75-47, 0-107, 10-68, 16-60, 83-4, 24-89, 67-40, 26-71, 40-59)ఫ్రేమ్‌ల తేడాతో చైనాకు చెందిన 14 ఏళ్ల కుర్రాడు యాన్ బింగ్‌తావో చేతిలో ఓడిపోయాడు.
టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన పంకజ్‌ను ఓడించిన యాన్ బింగ్‌తావో... అదే జోరులో ఫైనల్‌కు చేరాడు. సెమీస్‌లో 7-5తో క్రిట్ సానట్ (థాయ్‌లాండ్)పై నెగ్గాడు. ఫైనల్లో మహ్మద్ సజ్జాద్ (పాకిస్తాన్)తో యాన్ బింగ్‌తావో తలపడతాడు. సజ్జాద్ సెమీఫైనల్లో 7-3తో జిన్‌టాంగ్ (చైనా)పై, క్వార్టర్ ఫైనల్లో 6-1తో మానన్ చంద్ర (భారత్)పై గెలిచాడు. మహిళల విభాగం క్వార్టర్ ఫైనల్లో భారత క్రీడాకారిణి చిత్రా మగిమైరాజన్ 1-4 ఫ్రేమ్‌ల తేడాతో వెండీ జాన్స్ (బెల్జియం) చేతిలో పరాజయం పాలైంది.