
'ఇదొక అద్భుతమైన క్షణం'
మొహాలీ:దాదాపు ఎనిమిదేళ్ల తరువాత భారత క్రికెట్ జట్టు జెర్సీ ధరించడంపై వికెట్ కీపర్ పార్థీవ్ పటేల్ హర్షం వ్యక్తం చేశాడు. అయితే తాను జట్టులోకి తిరిగి వస్తున్నప్పుడు జట్టు సభ్యుల నుంచి లభించిన సహకారం ఎప్పటికీ మరువలేనిదన్నాడు. ప్రత్యేకంగా తన పునరాగమనంలో కెప్టెన్ విరాట్ కోహ్లి పాత్ర వెలకట్టలేనిదని పార్థీవ్ కొనియాడాడు.
'ఇంత సుదీర్ఘ కాలం తరువాత తిరిగి భారత క్రికెట్ జట్టులోకి వస్తానని ఏనాడు అనుకోలేదు. ఇది నిజంగానే అద్భుతమైన క్షణం. డ్రెస్సింగ్ రూమ్లో జట్టు సభ్యులతో కలిసి అనుభవాల్ని పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. జాతీయ జట్టుకు ఆడటం ఒక అరుదైన గౌరవం. గతంలో నేను చాలా టెస్టు మ్యాచ్లు ఆడినా, విన్నింగ్స్ రన్స్ ను ఎప్పుడూ చేయలేదు. ఇంగ్లండ్ తో మూడో టెస్టులో మ్యాచ్ను నా చేతుల్తోనే ఫినిష్ చేసినందుకు ఒకింత గర్వంగా ఉంది. అవతలి ఎండ్లో ఉన్న కోహ్లి.. నా బ్యాటింగ్ పట్ల చాలా సంతోషం వ్యక్తం చేశాడు' అని పార్థీవ్ పేర్కొన్నాడు. చాలా కాలం నుంచి దేశవాళీ మ్యాచ్ల్లో బాగా ఆడుతున్నాననే విషయం తనకు తెలుసని పార్థీవ్ అన్నాడు. ఇదే జట్టులో తిరిగి స్థానం సంపాదించడానికి కారణమైందన్నాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో ఫామ్నే అంతర్జాతీయ మ్యాచ్లో కూడా కొనసాగించినట్లు పార్థీవ్ తెలిపాడు.
మూడో టెస్టుకు ముందు కీపర్ వృద్థిమాన్ సాహా గాయపడటంతో అనూహ్యంగా పార్థీవ్ చోటు దక్కింది. తనకు వచ్చిన అవకాశాన్ని పార్థీవ్ చక్కగా ఉపయోగించుకున్నాడు. అటు కీపింగ్ లో రాణించడంతో పాటు, ఇటు బ్యాటింగ్ లో కూడా సత్తాచాటాడు. తొలి ఇన్నింగ్స్ లో 42 పరుగులు చేస్తే, రెండో ఇన్నింగ్స్ లో 67 పరుగులతో అజేయంగా నిలిచాడు.